బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్న్యూస్.. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం, వెండి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఏకంగా 7 శాతానికి పైగా తగ్గగా, బంగారం ధర 2 శాతానికి పైగా పడిపోయింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం దాదాపు 4 శాతం, వెండి దాదాపు 6 శాతం మేర తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్లో స్పాట్ బంగారం ధర 2.19 శాతం తగ్గి ఔన్సుకు 3,546 డాలర్లకు చేరుకుంది. మరోవైపు వెండి ధర మరింత భారీగా పతనమైంది. ఏకంగా 7.01 శాతం తగ్గి ఔన్సుకు సుమారు 42 డాలర్లకు పడిపోయింది. బలపడుతున్న అమెరికా డాలర్, పెరుగుతున్న బాండ్ దిగుబడులు ఈ రెండు విలువైన లోహాల ధరలపై ఒత్తిడి పెంచాయి.
దేశీయ మార్కెట్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే?
భారతీయ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ 4 డెలివరీకి సంబంధించిన బంగారం ధర ప్రారంభ ట్రేడింగ్లో 3.94 శాతం పడిపోయి 10 గ్రాములకు రూ.1,22,430కి చేరింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో MCX బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,380 వద్ద ముగిసింది. దీంతో ఒక్కరోజులోనే పసిడి ధరల్లో గణనీయమైన అంటే ఏకంగా రూ.6,950 మేర తగ్గుదల నమోదైంది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇవే..
నవంబర్ 20న ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.13,068గా, 22 క్యారెట్ల ధర రూ.11,979గా, 18 క్యారెట్ల ధర రూ.9,804గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.13,068, 22 క్యారెట్ల ధర రూ.11,979, 18 క్యారెట్ల ధర రూ.9,801గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.13,083, 22 క్యారెట్ల ధర రూ.11,994, 18 క్యారెట్ల ధర రూ.9,816గా ఉంది. కోల్కతా, బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.13,068, 22 క్యారెట్ల ధర రూ.11,979, 18 క్యారెట్ల ధర రూ.9,801గా ఉంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.13,068గా, 22 క్యారెట్ల ధర రూ.11,979గా ఉంది. కేరళ, పుణెలో 24 క్యారెట్ల ధర రూ.13,068, 22 క్యారెట్ల ధర రూ.11,979గా ఉంది. వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ.13,073, 22 క్యారెట్ల ధర రూ.11,984గా నమోదైంది. ఇక, స్థానిక గోల్డ్ వెబ్సైట్ల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ.5,120 తగ్గి.. రూ.1,25,570కి పడిపోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.4,700 తగ్గి రూ.1,15,100కి పరిమితమైంది.. ఇక కిలో వెండి ధర రూ.5000 తగ్గడంతో రూ.1,75,000కి దిగి వచ్చింది..
వెండి ధరలు కూడా భారీగా పతనం..
బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో మరింత ఎక్కువ తగ్గుదల నమోదైంది. MCXలో వెండి ధరలు ప్రారంభ ట్రేడింగ్లో 5.73 శాతం తగ్గి కిలోగ్రాముకు రూ.1,48,466కు చేరుకున్నాయి. గత ట్రేడింగ్ సెషన్లో కిలో వెండి ధర రూ.1,61,166 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండి ధర 7.01 శాతం తగ్గి ఔన్సుకు సుమారు 42 డాలర్లకు చేరుకుంది. దీంతో వెండి కొనుగోలుదారులకు కూడా ధరల తగ్గుదల ఊరటనిచ్చే అంశంగా మారింది. అంటే ఒకే రోజు ఏకంగా రూ.12,700 వరకు తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి..
బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణాలేంటి?
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ నుంచి వెలువడుతున్న కఠిన సంకేతాలు బంగారం, వెండి ధరల పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదవడంతో ఫెడరల్ రిజర్వ్ తక్షణమే వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు బలహీనపడ్డాయి. దీనికి తోడు అమెరికా ట్రెజరీ బాండ్ల దిగుబడులు పెరగడం, డాలర్ బలపడటం కూడా ప్రభావం చూపాయి. సాధారణంగా బంగారం వంటి వడ్డీ ఆదాయం లేని పెట్టుబడులపై ఈ పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడిదారులు బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అయితే నగల కొనుగోలు చేసేవారు స్థానిక జువెలరీ దుకాణాల్లో తాజా ధరలను తెలుసుకోవాలి. జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, ఇతర పన్నుల కారణంగా తుది ధరల్లో వ్యత్యాసం ఉండవచ్చు.

