Gold and Silver Prices Fall: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Silver

Gold Silver

Gold and Silver Prices Fall: పసిడి కొనుగోలు చేయాలని చూసేవారికి శుభవార్త.. ఈ రోజు పసిడితో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగివచ్చాయి.. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.1,400 తగ్గింది.. ఇటీవల కాలంలో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గడం కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, నవంబర్ 4వ తేదీ తర్వాత పసిడి ధర ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.. ఇక, బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం కిలో వెండి ధర రూ.1,86,550గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే కిలో వెండిపై రూ.3 వేలకుపైగా తగ్గడం గమనార్హం.

మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. స్పాట్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,974 డాలర్లుగా ఉండగా, ఔన్సు వెండి ధర 51.48 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో డిసెంబర్ డెలివరీకి సంబంధించిన బంగారం 10 గ్రాముల ధర రూ.1.38 లక్షలకు తగ్గింది. కిలో వెండి ధర రూ.1.82 లక్షల స్థాయికి దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా ప్రభావం చూపుతోంది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ 19 నెలల గరిష్ఠానికి చేరడం బంగారం, వెండి ధరల తగ్గుదలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి లావాదేవీలు ఎక్కువగా డాలర్లలోనే జరుగుతాయి. డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో ఈ లోహాలను కొనుగోలు చేయడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. దీంతో అంతర్జాతీయంగా బంగారం, వెండికి డిమాండ్ తగ్గుతుంది. ఈ పరిణామం స్పాట్ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.