Psychology facts: అర్థరాత్రి.. నిద్రపోని మనసు.. సముద్రంలో అలల్లా ఎగసిపడుతున్న ఆలోచనలకు కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాత్రి రెండు గంటలు దాటింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నువ్వు మాత్రం మంచం మీద కళ్లు తెరిచి పడుకున్నావు. ఉదయం ఎవరికో మెసేజ్ పెట్టావు. ఇంతవరకు వాళ్ల నుంచి రిప్లై రాలేదు. పగటిపూట అయితే పెద్దగా పట్టించుకోని విషయం అది. కానీ ఇప్పుడు అదే విషయం గుర్తొస్తుంది. ఎందుకు రిప్లై ఇవ్వలేదు? ఏమైనా జరిగిందా? నాతో మాట్లాడటం ఇష్టం లేదా? నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా?
ఈ ఒక ఆలోచన ఇంకో ఆలోచనను పిలుస్తుంది. ఇంకోటి ఇంకోదాన్ని తీసుకొస్తుంది. కాసేపటికి ఉదయం జరిగిన ఒక చిన్న విషయం, రాత్రి నీ ముందు చాలా పెద్ద సమస్యగా నిలబడుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? చిన్న విషయాలు రాత్రివేళ ఎందుకు పెద్దవిగా కనిపిస్తాయి? దీనికి సైకాలజీ ఏం చెబుతుంది?
నిజానికి రాత్రి రెండు గంటలకు ఏదో ప్రత్యేకమైన శక్తి ఉండదు. రెండు గంటలు అవ్వగానే మన మెదడు ఓవర్‌థింకింగ్ మోడ్‌లోకి వెళ్లిపోతుందని చెప్పడానికి కూడా ఆధారం లేదు. కానీ ఆ సమయానికి నువ్వు మేల్కొని ఉంటే, అలసిపోయి ఉంటే, చుట్టూ మాట్లాడే మనుషులు లేకపోతే, పగటి హడావుడి మొత్తం ఆగిపోయి ఉంటే… నీ ఆలోచనలకు ఒక్కసారిగా చాలా ఖాళీ దొరుకుతుంది.
Also Read
పగటిపూట మనసుకు ఒక బాధ గుర్తొచ్చినా, దాని మీద ఎక్కువసేపు కూర్చునే అవకాశం ఉండదు. పని ఉంటుంది. ఫోన్ మోగుతుంది. ఎవరైనా మాట్లాడతారు. ఎక్కడికైనా వెళ్లాలి. ఏదో ఒక పని చేయాలి. మనసు ఒక విషయాన్ని పట్టుకుంటే ఇంకో విషయం వచ్చి దాన్ని పక్కకు నెట్టేస్తుంది. కానీ రాత్రి మాత్రం అలా కాదు. గది నిశ్శబ్దంగా ఉంటుంది.
ఫోన్ స్క్రీన్ మాత్రమే అప్పుడప్పుడు వెలుగుతుంది. బయట ప్రపంచం నిద్రలోకి వెళ్లిపోతుంది. నువ్వు మాత్రం నీ ఆలోచనలతో ఒంటరిగా మిగిలిపోతావు. అప్పుడు ఉదయం నీకు రిప్లై రాని ఒక మెసేజ్ గుర్తొస్తుంది. దాని తర్వాత ఆఫీసులో జరిగిన ఒక మాట గుర్తొస్తుంది. అక్కడి నుంచి బాస్ గురించి ఆలోచన వస్తుంది. రేపటి మీటింగ్ గుర్తొస్తుంది. ఇంకో పొరపాటు గుర్తొస్తుంది. ఆ పొరపాటు వల్ల ఉద్యోగానికి ఏమైనా అవుతుందా అనే భయం మొదలవుతుంది. అక్కడితో ఆగదు. మనసు భవిష్యత్తులోకి పరిగెడుతుంది.
రేపు ఏదైనా చెడుగా జరిగితే? అదే జరిగితే నేను ఏం చేస్తాను? అది జరిగిన తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది? ఇలా ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకు వెళ్తూ, చివరికి అసలు సమస్య ఎక్కడ మొదలైందో కూడా గుర్తుండదు. ఇదంతా కేవలం ఊహ కాదు. నిద్ర తగ్గితే మన భావోద్వేగాలను నియంత్రించుకునే విధానం మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
2021లో 64 అధ్యయనాలు, 241 వేర్వేరు ఫలితాలను కలిపి చేసిన మెటా అనాలిసిస్లో నిద్ర తగ్గడం వల్ల నెగెటివ్ మూడ్ పెరిగినట్టు కనిపించింది. అదే పరిశోధనలో నిద్రలేమి వల్ల భావోద్వేగాలు పెరగడం కూడా గమనించారు. ఇంకా ఆసక్తికరమైన విషయం మెదడులోనే కనిపిస్తుంది. మనకు భయం, కోపం, ఆందోళన లాంటి భావోద్వేగాలకు వేగంగా స్పందించే మెదడులోని అమిగ్డాలా అనే భాగం ఉంటుంది. దాన్ని నియంత్రించడంలో ప్రీ-ఫ్రంటల్ కార్టెక్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిద్ర తగ్గినప్పుడు ఈ భావోద్వేగ నియంత్రణ వ్యవస్థలో మార్పులు కనిపించవచ్చని బ్రెయిన్ ఇమేజింగ్ అధ్యయనాలు సూచించాయి.
కొన్ని పరిశోధనల్లో నెగెటివ్ భావోద్వేగాలకు అమిగ్డాలా స్పందన పెరగడం, దాన్ని నియంత్రించే మెదడు ప్రాంతాలతో దాని అనుసంధానం తగ్గడం కనిపించింది. అంటే ఒక రకంగా చూస్తే… సమస్యను చూసే మనిషి మారడం కాదు. సమస్యను చూసే మెదడు ఆ సమయంలో కొంచెం అలసిపోయి ఉండటం. ఇక 2023లో జరిగిన ఒక రాండమైజ్డ్ కంట్రోల్డ్ స్టడీలో నిద్ర లేకపోవడం వల్ల ఒక భావోద్వేగ పరిస్థితిని మరో కోణంలో చూసే సామర్థ్యం తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. మన సైకాలజీలో దీన్ని కాగ్నిటివ్ రీ-అప్రైజల్ అంటారు. అంటే మనకు బాధ కలిగిస్తున్న విషయాన్ని ఇంకో కోణంలో చూసి, దాని ప్రభావాన్ని తగ్గించుకోవడం.
ఉదాహరణకు… ఉదయం ఎవరో నీ మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేదు అనుకో. నిద్ర బాగా ఉన్నప్పుడు నీ మెదడు చాలా సులభంగా ఇంకో కారణాన్ని ఆలోచించగలదు. వాళ్లు బిజీగా ఉండొచ్చు. ఫోన్ చూడకపోయి ఉండొచ్చు. తర్వాత రిప్లై ఇస్తారేమో. కానీ రాత్రి నువ్వు అలసిపోయి ఉన్నప్పుడు అదే ఆలోచనకు ఇంకో అర్థం వస్తుంది. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు. నాతో ఏదో సమస్య ఉంది. బహుశా నేను ఏదో తప్పు చేశాను. ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది.
భావన నిజం కావచ్చు..ఆ భావన చెప్పే కథ నిజం కావాల్సిన అవసరం లేదు. నీకు బాధగా అనిపిస్తోంది అంటే ఆ బాధ నిజమే. నీకు భయంగా అనిపిస్తోంది అంటే ఆ భయం నిజమే. కానీ నేను ఊహిస్తున్నదే నిజం అని మాత్రం దాని అర్థం కాదు. ఇదే కారణంగా రాత్రి రెండు గంటలకు వచ్చిన ఆలోచనలతో మనం పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆ సమయంలో ఉద్యోగం వదిలేయాలని అనిపించవచ్చు. ఎవరినైనా జీవితంలో నుంచి తీసేయాలని అనిపించవచ్చు. ఎవరికైనా కోపంగా మెసేజ్ పంపాలని అనిపించవచ్చు. ఒక చిన్న తప్పు వల్ల కెరీర్ మొత్తం అయిపోయిందని అనిపించవచ్చు. కానీ ఉదయం నిద్ర లేచిన తర్వాత అదే విషయం చూస్తే… కథ మారిపోవచ్చు. ఎందుకంటే సమస్య మారకపోయినా, దాన్ని అర్థం చేసుకునే నీ సామర్థ్యం మారుతుంది. నిద్ర లేకపోవడం, ఆందోళన, రూమినేషన్ ఒకదానితో ఒకటి కలిసిపోయే అవకాశం కూడా ఉంది. ఒక విషయం గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ నిద్ర పోకుండా ఉండటం, నిద్ర తగ్గడం వల్ల మరుసటి రోజు భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టమవుతుంది. దీని కారణంగాఅదే సమస్య గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించడం… ఇలా ఒక సైకిల్ తయారవుతుంది.
అందుకే రాత్రి రెండు గంటలకు నీకు కనిపిస్తున్న ప్రపంచం, ఉదయం ఎనిమిది గంటలకు కనిపించే ప్రపంచం రెండు వేర్వేరుగా ఉంటాయి. అది కేవలం అలసిపోయిన కళ్లతో, అలసిపోయిన మెదడుతో చూస్తున్న ప్రపంచం. కాబట్టి ఆ సమయంలో ఒక సమస్య నీ ముందు నిలబడితే దాన్ని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదు. ఒక కాగితంపై రాసిపెట్టు. రేపు చూసుకుందాం అని నీ మనసుకు చెప్పు. ఎందుకంటే నిద్ర సమస్యను మాయ చేయకపోవచ్చు. కానీ సమస్యను దాని అసలు పరిమాణంలో చూడటానికి నీకు కొంచెం దూరం ఇవ్వగలదు.
చివరికి… కొన్ని రాత్రుల్లో మనల్ని బాధపెట్టేది సమస్య కాదండి.. ఆ సమస్య గురించి అలసిపోయిన మనసు రాసే కథ. రాత్రి రెండు గంటలకు ఆ కథ చాలా నిజంగా అనిపించవచ్చు. కానీ ఉదయం వచ్చేసరికి… అదే కథలో కొన్ని పేజీలు అవసరం లేనివిగా అనిపించవచ్చు. ఇదండి రాత్రి రెండు గంటల కథ..!
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!