ఇంటర్‌పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మాజీ కమాండర్ మొహిసిన్ రజాయీ ఆగస్టు 9న ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నిర్ణయం కేవలం ఒక సాధారణ పరిపాలనా మార్పు కాదు, పశ్చిమాసియా భవిష్యత్తును శాసించే అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన మలుపు. ఈ పరిణామం ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేసింది. 1994లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో జరిగిన యూూష్యన్ కమ్యూనిటీ సెంటర్ బాంబు పేలుడు ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజాయీపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ అయింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొస్సాద్’ టార్గెట్‌గా ఉన్న వ్యక్తికి దేశ అత్యున్నత భద్రతా పగ్గాలు అప్పగించడం ద్వారా ఇరాన్ తన కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా క్రిమినల్ కేసులు, టెర్రరిజం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దేశ భద్రతా మండలికి అధిపతి కావడం వల్ల ఇరాన్ రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో, ఇరాన్ అధికారికంగానే ఒక ‘టెర్రరిస్ట్ స్టేట్’గా ముద్రపడే ప్రమాదం బలపడుతోంది.
మరోవైపు, అమెరికాతో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభానికి దౌత్యపరమైన ముగింపు లభిస్తే పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. ఈ ఉద్రిక్తతలు తొలగిపోతే ఇరాన్ ప్రాంతీయంగా తిరుగులేని ప్రబల సైనిక శక్తిగా అవతరించే అవకాశం ఉంది. గత కొన్ని మాసాలుగా పశ్చిమాసియాలో చోటుచేసుకున్న పరిణామాలు, ఇరాన్ వ్యూహాత్మక క్షిపణి శక్తి , హార్ముజ్ జలసంధి పై దాని నియంత్రణ వంటి అంశాలను బేరీజు వేసుకున్న అమెరికా… ఇరాన్‌పై మరోసారి దాడులకు దిగే సాహసం ఇప్పట్లో చేయకపోవచ్చు. అఫ్ఘానిస్తాన్ , ఇరాక్ యుద్ధాల తాలూకు ఆర్థిక, ప్రాణనష్టాల నేపథ్యంలో ఇరాన్‌పై ప్రత్యక్ష సైనిక యుద్ధానికి దిగే సాహసం చేయడం దాదాపు అసాధ్యం. అమెరికా నేరుగా బరిలోకి దిగడానికి బదులుగా ప్రాక్సీ వార్‌లు, ఆర్థిక ఆంక్షలు , సైబర్ దాడిలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, ఆర్థిక ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ, ఇరాన్ తన సైనిక, అణ్వస్త్ర సంబంధిత ప్రత్యామ్నాయ శక్తిని మరింత పెంచుకుంటూ పోతోంది. ప్రత్యక్ష యుద్ధం కంటే, ప్రాక్సీ యుద్ధాల ద్వారా తన ప్రభావాన్ని పశ్చిమాసియాలో విస్తరించాలని ఇరాన్ భావిస్తోంది. రెజాయీ నియామకం ఈ వ్యూహంలో భాగమేనని చెప్పవచ్చు. దీని ద్వారా ఇరాన్ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని పశ్చిమ దేశాలకు స్పష్టమైన సంకేతాలు పంపింది. అమెరికాతో భవిష్యత్‌లో ఉద్రిక్తతలు చల్లారినా, ప్రాంతీయంగా ఇరాన్ తన సైనిక ప్రభావాన్ని మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇది పశ్చిమాసియా శాంతికి శాశ్వతంగా ఒక పెను ముప్పుగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా ప్రత్యక్ష జోక్యానికి వెనుకడుగు వేస్తున్న తరుణంలో, ఇరాన్ తన సైనిక ప్రభావాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలు పశ్చిమాసియాను మరింత అస్థిరతలోకి.. అభద్రతా వాతావరణంలోకి నెట్టివేస్తుంది. ప్రాంతీయ రాజకీయాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది.
రెజాయీ గతంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. పశ్చిమ దేశాలపై, ముఖ్యంగా అమెరికా- ఇజ్రాయెల్‌లపై అత్యంత దూకుడుగా వ్యవహరించే నేతగా గుర్తింపు పొందారు. శాంతి చర్చల కంటే సైనిక బలప్రదర్శనే ముఖ్యమనే సిద్ధాంతం కలిగిన వ్యక్తి. హార్ముజ్ జలసంధి నియంత్రణ వంటి వ్యూహాత్మక అంశాలపై ఆయన ఇటీవల చేసిన హెచ్చరికలు గల్ఫ్ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్ తన ప్రాక్సీ నెట్‌వర్క్‌లను మరింత తీవ్రతరం చేసే సూచనలు ఈ నియామకం ద్వారా స్పష్టమవుతున్నాయి. అయితే, రెజాయీపై అంతర్జాతీయ నిఘా వర్గాల ఆరోపణలు, ఇంటర్‌పోల్ వంటి సంస్థల నేపథ్యం రీత్యా.. ఇరాన్‌తో దౌత్యపరమైన సంబంధాలు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇది పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలను దెబ్బతీసి, దేశాల మధ్య అంతులేని అసాధారణ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఏ విధంగా ఎదుర్కొంటుందనేది కాలమే నిర్ణయించాలి.
-భోనగిరి రమేష్ బాబు (NTV GLOBAL)

