Abdul El-Sayed: అమెరికా సెనెట్‌లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!

Triumph At The Capitol With Karnataka Roots (1)

Triumph At The Capitol With Karnataka Roots (1)

అతను సెనెట్‌లో అడుగుపెట్టాలంటే మెటల్ డిటెక్టర్ దాటుకుంటూ వెళ్లాలి. మధ్యంతర ఎన్నికల్లో పోటీకి దిగిన ఓ డెమోక్రాట్ ముస్లిం అభ్యర్థిపై ట్రంప్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలివి. ట్రంప్ అహంకారాన్ని పాతరేస్తూ.. మిచిగాన్ ప్రజల ప్రేమను గెలుచుకున్నాడు ఆ ముస్లిం డెమోక్రాట్. అతనే అబ్దుల్ ఎల్ సయీద్. అమెరికా చరిత్రలోనే తొలి ముస్లిం సెనెటర్‌గా ఆ దేశ కాంగ్రెస్ లో అడుగుపెడుతున్న ఈయన మన కర్ణాటక అల్లుడన్న సంగతి మీకు తెలుసా?

అమెరికా రాజకీయాల్లో బ్లూ వేవ్ సృష్టించిన ప్రభంజనంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. మిచిగాన్ రాష్ట్రం నుంచి డెమొక్రాట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్ రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌ను చిత్తుగా ఓడించారు. ఈ విజయంతో అమెరికా చరిత్రలో తొలి ముస్లిం సెనేటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఎల్-సయీద్ భార్య డాక్టర్ సారా జుకాకుకు భారతీయ మూలాలు ఉన్నాయి. వీళ్ల పూర్వికులది కర్ణాటకలోని భట్కల్ ప్రాంతం. భట్కల్ అనేది మంగళూరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక తీరప్రాంత పట్టణం. నాటి మైసూర్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జెహెచ్ షంషుద్దీన్ జుకాకు మనవరాలే ఈ సారా జుకాకు. ఇలా అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయీద్ కర్ణాటక అల్లుడు అయ్యారు.

సారా తాతయ్య జెహెచ్ షంషుద్దీన్ జుకాకు నవాయత్ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ప్రముఖ న్యాయవాది. ఈ వర్గం వాళ్లంతా అరేబియన్ ద్వీపకల్పం.. ఇరాన్, ఇరాక్ నుంచి వలస వచ్చి దక్షిణ భారత తీర ప్రాంతాల్లో స్థిరపడిన పురాతన వ్యాపార సంఘానికి చెందిన వాళ్లు. ఈ కమ్యూనిటీ నుంచి న్యాయవాదిగా అర్హత సాధించిన తొలి వ్యక్తి ఆయనే. అలాగే మంత్రిగా ఎన్నికైన మొదటి వ్యక్తి కూడా షంషుద్దీన్ కావడం విశేషం. 1946లో బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957, 1962 ఎన్నికల్లో హొన్నావర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1958లో బి.డి. జెట్టి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ఉప మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎస్. నిజలింగప్ప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యుత్ శాఖ ఉప మంత్రిగా కూడా సేవలు అందించారు. భట్కల్ ప్రాంతానికి విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

షంషుద్దీన్ 52 ఏళ్ల వయసులో మరణించారు. ఆయనకు ఆరుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన డాక్టర్ జుకాకు ఎస్ తయ్యబ్ 1976లో బెంగళూరు మెడికల్ కాలేజీ నుంచి పట్టభద్రులయ్యారు. నెఫ్రాలజిస్ట్ అయిన ఆయన మెరుగైన అవకాశాల కోసం మొదట సౌదీ అరేబియా వెళ్లి ఆ తర్వాత 1980లలో అమెరికాలో స్థిరపడ్డారు. డెట్రాయిట్ ప్రాంతంలో వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అక్కడే మిచిగాన్‌లో భారతీయ వలస కుటుంబంలో సారా పుట్టి పెరిగారు. సారా అమెరికాలో పెరిగినప్పటికీ… ఆమె తండ్రి తమ పిల్లలను మూలాలకు దూరంగా ఉంచలేదు. బెంగళూరు, భట్కల్ ప్రాంతాలను వారు తరచూ సందర్శించేలా చూసుకున్నారు.

సారా జుకాకు విద్యాభ్యాసం అంతా మిచిగాన్ విశ్వవిద్యాలయంలో సాగింది. అక్కడే అబ్దుల్ ఎల్-సయీద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. యూనివర్సిటీ ముస్లిం స్టూడెంట్స్ అసోసియేషన్‌లో ఇద్దరూ కలిసి పనిచేశారు. 2006లో వివాహం జరిగింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన సారా.. కొలంబియా యూనివర్సిటీ నుంచి మెడికల్ డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఆమె మిచిగాన్ హెల్త్ యూనివర్సిటీలో సైకియాట్రీ విభాగం బాధ్యతలు చూస్తున్నారు. అబ్దుల్ ఎల్-సయీద్ తనకు భారతీయ సంస్కృతితో ఉన్న అనుబంధం గురించి ఎప్పుడూ గర్వంగా చెబుతుంటారు. దక్షిణ భారత కుటుంబంలో అల్లుడిగా చేరి 20 ఏళ్లు అవుతోందని ఆయన ఓ ఇంటర్వ్యూలో సరదాగా అన్నారు. ఈజిప్టు నుంచి వలస వచ్చిన ముస్లిం కుటుంబంలో పుట్టిన అబ్దుల్ అల్ సయీద్ వృత్తి రీత్యా ఎపిడమాలజిస్ట్. మిచిగాన్ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. వైద్యరంగంలో వివిధ హోదాల్లో పనిచేస్తూనే రాజకీయాల్లో అడుగుపెట్టిన అబ్దుల్ ఎల్ సయీద్… తొలి ముస్లిం సెనెటర్‌గా చరిత్ర సృష్టించారు. తాను అరబ్ కంటే కూడా భారతీయుడిగానే ఎక్కువగా ఫీల్ అవుతానని భార్య సారాకు మద్దతుగా చెబుతూ ఉంటారు. ముస్లిం ఇమిగ్రెంట్ కావడం వల్ల అమెరికాలో అబ్దుల్ ఎల్ సయీద్ చాలా సందర్భాల్లో జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నారు. ఆ అడ్డుగోడలను దాటుకుని చివరకు సెనెట్‌లో అడుగు పెడుతున్నారు.