డైలీ సీరియల్ లో ట్విస్టుల్లా… ఎన్నికల కమిషన్ అరాచకాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని చెప్పుకునే ఎన్నికల కమిషన్… ఓటర్ల పాలిట విలన్‌గా మారింది. నోటీసు ఇవ్వకుండా… విచారణ జరపకుండా… ఒక్కరంటే ఒక్కరి ఓటు కూడా తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి లేదు.. కానీ యూపీలో ఏం జరిగిందో తెలుసా…? రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్ అయిపోయాయి.
ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి రక్షక కవచం లాంటిది. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన కనీస బాధ్యత ఆ సంస్థపై ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా ఈసీ ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ఓటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఎలాంటి కారణాలు చెప్పకుండానే వేలాది మంది ఓటర్లను జాబితా నుంచి రాత్రికి రాత్రే తొలగించింది. ఈసీకి చెందిన సాఫ్ట్‌వేర్ 85,854 మంది ఓటర్లను తొలగిస్తూ దానంతటదే ఫామ్-7 అభ్యర్థనలను సృష్టించింది. చట్టప్రకారం ఓటరును జాబితా నుంచి తొలగించాలంటే కచ్చితమైన కారణం చూపించడం తప్పనిసరి. కానీ ఈ 85 వేలకు పైగా దరఖాస్తుల్లో ఎలాంటి కారణం ప్రస్తావించలేదు. ఈ ఫారాలపై ఎన్నికల అధికారులు కేవలం డిజిటల్ సంతకాలు మాత్రమే చేసి పంపారు. జనవరి 6 నుంచి ఏప్రిల్ 10, 2026 మధ్య కాలంలో ఈ మొత్తం వ్యవహారం నడిచింది. అంటే ఓట్లు ఆటో డిలీట్ అయిపోయాయన్నమాట.
ఈ అభ్యంతరాల ఫారాలను అధికారులెవరూ స్వయంగా నింపలేదు. ఈసీ ఉపయోగించే ఎరోనెట్ సాఫ్ట్‌వేర్ ఈ ఫారాలను ఆటోమెటిక్ గా జనరేట్ చేసింది. ఈ దరఖాస్తులపై అధికారుల డిజిటల్ సంతకాలు వాటంతట అవే పడిపోయి ఉన్నతాధికారుల ఆమోదానికి వెళ్లాయి. ఓటర్ల జాబితా సవరణ విచారణలు ముగిసిన తర్వాత కూడా ఏకపక్షంగా ఇలా తొలగింపులు జరిగాయి. చనిపోయినవారు, వయసు సరిపోనివారు, వలస వెళ్లినవారు, పౌరసత్వం లేనివారు.. ఇలా ఏదో ఒక కారణం కచ్చితంగా చెప్పాలనే ఈసీ నిబంధనలు ఒక్కటి కూడా ఇక్కడ పాటించలేదు. ఆటో మెటిక్‌గా ఓటర్లను తొలగించే అధికారం ఈసీ సాఫ్ట్‌వేర్‌కి ఎవరు కట్టపెట్టినట్టు?
అధికారుల సంగతి పక్కన పెడితే బయటి వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల్లోనూ భారీ కుట్ర బయటపడింది. లక్షా 10 వేల దరఖాస్తులను గడువు ముగిసిన తర్వాత కూడా ఈసీ యంత్రాంగం స్వీకరించింది. తారాబ్‌గంజ్, పిలిభిత్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలగింపునకు గురైన వారిలో 90 శాతం మంది ముస్లింలే ఉన్నారు. తారాబ్‌గంజ్‌లో రేష్మ అనే ఒకే పేరు మీద ఒకే బూత్‌కు చెందిన వారిపై ఏకంగా 188 అభ్యంతరాలు దాఖలయ్యాయి. పిలిభిత్‌లో బాబూ రామ్ అనే వ్యక్తి 237 మందిపై ఫిర్యాదు చేస్తే అందులో 212 మంది ముస్లింలే కావడం కలకలం రేపుతోంది.
యూపీ సీఈఓ వెబ్‌సైట్‌లో దాదాపు 4 లక్షల 30 వేల ఫాం-7 అభ్యర్థనలు దాఖలయ్యాయి. ఇందులో 20 శాతం అభ్యర్థనలు స్వయంగా అసెంబ్లీ స్థాయి అధికారుల నుంచే రావడం అనుమానాలకు తావిస్తోంది. విచారణలో ఓటరు గుర్తింపును ఆమోదించకపోతే సిస్టమ్ ఆటోమెటిక్ గా ఫాం-7 క్రియేట్ చేస్తుందని ఈసీ అధికారులు చెబుతున్నారు. అదే నిజమైతే అది రాజ్యాంగ విరుద్ధమే. మార్చి 15 నుంచి ఏప్రిల్ 2, 2026 మధ్య కేవలం 19 రోజుల్లోనే 87 వేలకు పైగా తొలగింపు అభ్యర్థనలు దాఖలయ్యాయి. సాఫ్ట్‌వేర్ లో చేసిన మార్పుల వల్ల చట్టవిరుద్ధమైన ఫారాలపై తాము తప్పనిసరి పరిస్థితుల్లో సంతకాలు చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల చట్టాల ప్రకారం ఈ అధికారులకు క్లెయిమ్ లను పరిష్కరించే బాధ్యత ఉంటుంది. కానీ ఈ ఆటోమెటిక్ విధానంతో వారే ఫిర్యాదుదారులుగా.., అదే సమయంలో న్యాయనిర్ణేతలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈఆర్ఓలు దాఖలు చేసిన మొత్తం దరఖాస్తుల్లో 85 వేల ఫారాల్లో కారణం అనే కాలమ్ ఖాళీగా వదిలేశారు. కేవలం 62 ఫారాల్లో A, N, H, E అనే అక్షరాలు మాత్రమే రాశారు. దాదాపు 1211 ఫారాల్లో మాత్రమే ఓటరు అందుబాటులో లేరు అని స్పష్టమైన కారణం చూపించారు.
ఈసీ తీరు చూస్తుంటే డెమొక్రటిక్ స్పిరిట్‌కి విరుద్ధంగా ఏకపక్షంగా పనిచేస్తున్నట్టు అర్ధమవుతుంది. ప్రతిపక్షాల నుంచి ప్రజాసంఘాల వరకు ప్రతి ఒక్కరూ ఈసీ పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు.. దాన్ని సంస్కరించడం అత్యవసరం. ప్రభుత్వం ఆ పనిచేస్తుందో లేదో చూడాలి…

