Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మనిషి ప్రాణం విలువను నిర్ణయించేది ఎవరు? రాజ్యమా? మతమా? అధికారంలో ఉన్న పాలకులా? ఒక దేశం తనకు నచ్చిన చట్టాన్ని రూపొందించుకుని, అదే చట్టం కింద మనుషులను దోషులగా ప్రకటించి, చివరకు వారి ప్రాణాన్ని తీసేస్తే దాన్ని న్యాయం అని ఎలా పిలవాలి? మక్కాలో ఇద్దరు బంగ్లాదేశీయులకు మరణశిక్ష అమలైన ఘటన మన ముందుంచుతున్న ప్రశ్నలు ఇవి.
నేరానికి శిక్ష అవసరమని అంగీకరించినా, ప్రతి నేరానికి మరణ శిక్షలే సమాధానమని ఎవరు నిర్ణయించారు? రాజ్యాధికారం కంటే మనిషి ప్రాణానికి విలువ తక్కువైందా? అసలు సౌదీఅరేబియాలో ఏం జరిగింది? ఏ చట్టం కింద ఇద్దరు బంగ్లాదేశీయులను శిక్షించారు? గత దశాబ్ద కాలంలో సౌదీఅరేబియాలో మరణశిక్షలు ఎక్కువగా ఎందుకు అమలయ్యాయి?
Also Read
అక్టోబర్ 14న సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతంలో నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితి అఖ్తర్ అనే ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులకు మరణశిక్ష అమలైంది. మసీదులో అసభ్యకరమైన చర్యకు పాల్పడ్డారన్నది సౌదీ ప్రభుత్వం ప్రకటించిన ఆరోపణ. అయితే అసలు ఏం జరిగిందో, ఏ ఆధారాలతో నేరం నిరూపించారో, విచారణలో వారి వాదనకు ఎంత అవకాశం లభించిందో పూర్తి వివరాలు బహిరంగంగా చెప్పలేదు. బంగ్లాదేశ్‌కు కూడా ముందస్తు సమాచారం అందలేదని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ఇలా ఇద్దరి ప్రాణాలు తీసిన తర్వాత కూడా కేసులోని కీలక వివరాలు అస్పష్టంగా ఉండటం న్యాయవ్యవస్థ పారదర్శకతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తోంది.
ఇటు బంగ్లాదేశ్ కాన్సులేట్ పత్రాలు ఈ కథలో మరో చీకటి కోణాన్ని చూపించాయి. నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్ను సైబర్ నేరానికి సంబంధించిన ఆరోపణలపై, సితి అఖ్తర్‌ను వ్యభిచారానికి సంబంధించిన ఆరోపణలపై 2023 ఆగస్టులో నిర్బంధించినట్లు సెప్టెంబర్ 30న బంగ్లాదేశ్‌కు పంపిన ఖైదీల జాబితాలో నమోదైంది. ఆ జాబితాలో వాళ్లకు విధించిన మరణశిక్షల ప్రస్తావన లేదు. అయితే సౌదీ మాత్రం మసీదులో అసభ్యకరమైన చర్యకు పాల్పడ్డారనే కారణంతో ఇద్దరినీ ఉరితీసినట్లు చెబుతోంది. ఇదే ఇక్కడ అర్థంకాని విషయం. సైబర్ నేరాలకు అరెస్టైన వారిని తర్వాత ఇలా ఉరితీసి చంపడం వెనుక ఏం జరిగిందో సౌదీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంలేదు.
ఇక మరణశిక్షల గురించి ముందుగా తెలిసి ఉంటే, తమ పౌరులకు న్యాయ సహాయం అందించేందుకు లేదా దౌత్యపరంగా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగలిగేవారమని బంగ్లాదేశ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెండు దేశాలూ వియన్నా కన్సులర్ సంబంధాల ఒప్పందంలో భాగస్వాములే. ఆ ఒప్పందం విదేశీ ఖైదీలకు తమ కాన్సులేట్‌తో సంప్రదించే హక్కు గురించి చెప్పడం, దౌత్య సహాయం పొందే అవకాశం కల్పించడం లాంటి అంశాలను ప్రస్తావిస్తుంది.
మరోవైపు ఈ మరణశిక్షకు సౌదీ ప్రభుత్వం తజీర్ అనే ఇస్లామిక్ న్యాయసూత్రాన్ని ఆధారంగా చూపించింది. ఇస్లామిక్ న్యాయవ్యవస్థలో హద్ద్ నేరాలకు నిర్దిష్ట శిక్షలు ఉంటాయి. ఖిసాస్ విధానం హత్య లాంటి నేరాల్లో ప్రతీకార న్యాయానికి సంబంధించినవిగా ఉంటాయి. తజీర్ పరిధిలోకి వచ్చే నేరాలకు సంబంధించి వాటికి శిక్ష నిర్ణయించడంలో న్యాయమూర్తికి విచక్షణాధికారం ఉంటుంది. సౌదీ అరేబియాలో క్రిమినల్ శిక్షాస్మృతి లేకపోవడం వల్ల నేరాల నిర్వచనం, శిక్షల నిర్ణయంలో న్యాయమూర్తుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
ఈ వ్యవస్థలో మరణశిక్ష విధించడంపై మానవ హక్కుల సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఇద్దరి కేసులో ఏ నిర్దిష్ట న్యాయపరమైన ఆధారాలతో మరణశిక్షను ఎంచుకున్నారో తెలుసుకునే హక్కు ప్రపంచానికి ఉంది. ఇక చట్టాన్ని రూపొందించే అధికారం రాజ్యానికి ఉంది. దాన్ని అమలు చేసే వ్యవస్థ కూడా రాజ్యానిదే. కానీ చట్టం పేరుతో జరిగే ప్రతి చర్య న్యాయంగా మారిపోతుందా? ఒక వ్యవస్థ తన నియమాలను తానే రూపొందించుకుని, తన నిర్ణయాలను తానే సమర్థించుకుంటూ, ప్రశ్నించే అవకాశాన్ని కూడా పరిమితం చేస్తే, ఆ అధికారాన్ని నియంత్రించేది ఎవరు? ప్రజల హక్కులకు రక్షణగా ఉండాల్సిన చట్టం, అధికారానికి రక్షణ కవచంగా మారితే దాన్ని ప్రశ్నించడం మరింత అవసరం. న్యాయం అనేది పాలకుల ప్రకటనతో నిర్ధారణ అయ్యే విషయం కాదు కదా. అసలు దోషులకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండాలి కదా.
ఈ ఘటనను సౌదీ అరేబియాలో మరణశిక్షల నేపథ్యం నుంచి కూడా చూడాలి. యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ లెక్కల ప్రకారం, 2015 నుంచి ఆ దేశంలో మరణశిక్షల సంఖ్య 2వేలు దాటింది. వీరిలో సుమారు 845 మంది విదేశీ పౌరులున్నారు. మొత్తం మరణశిక్షల్లో సుమారు 43.9 శాతం హత్య కేసులకు సంబంధించినవిగా ఉన్నాయి. ఇక మాదకద్రవ్యాల కేసులు, రాజకీయ ఆరోపణలు సహా ఇతర నేరాలకూ మరణశిక్షలు అమలయ్యాయి. ప్రాణాంతకం కాని మాదకద్రవ్యాల నేరాలకు మరణశిక్ష విధించడాన్ని ఐక్యరాజ్యసమితి నిపుణులు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు విరుద్ధంగా చెబుతున్నారు.
ఈ లెక్కల్లో విదేశీ పౌరుల సంఖ్య ప్రత్యేకంగా ఆలోచింపజేస్తుంది. భాష తెలియని దేశంలో అరెస్టయిన వ్యక్తికి న్యాయ సహాయం అందకపోతే, తనపై ఉన్న ఆరోపణలను అర్థం చేసుకుని ఎదుర్కోవడం కష్టమవుతుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ ఇద్దరి కేసు వివరాలను కోరడం వెనుక ఉన్న ప్రధాన ఆందోళన కూడా ఇదే. తమ పౌరులకు విచారణలో ఏ హక్కులు లభించాయి, న్యాయవాది సహాయం ఉందా, అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారా అనే అంశాలపై బంగ్లాదేశ్ ప్రశ్నిస్తోంది. మరణశిక్ష అమలైన తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడటం, న్యాయప్రక్రియలో పారదర్శకత ఎంత అవసరమో కళ్లకు కడుతోంది. ఒక సమాజం నేరాలను అరికట్టాలి. బాధితులకు న్యాయం అందించాలి. ప్రజల భద్రతను కాపాడాలి. కానీ ఈ లక్ష్యాలన్నింటికీ ఒక మనిషి ప్రాణాన్ని తీసేయడమే అంతిమ మార్గమని భావించడం ప్రమాదకరమైన ఆలోచన.
న్యాయవ్యవస్థలో తప్పులు జరిగే అవకాశం ఉన్నప్పుడు, తిరిగి సరిచేయలేని శిక్షను అమలు చేయడం ఎంతవరకు సమర్థనీయం? నిజానికి రాజ్యానికి చట్టాలు చేసే అధికారం ఉండవచ్చు. కానీ మనిషి ప్రాణాన్ని తీసే అధికారం ప్రశ్నలకు అతీతం కావడానికి వీల్లేదు. చట్టం ఎంత శక్తివంతమైనదైనా, అది మానవ హక్కుల ముందు తన నైతికతను నిరూపించుకోవాల్సిందే!
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
-
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!