Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటైన గొంతుకలకు ఇదే వేదిక! ప్రభుత్వాలు సమాధానం చెప్పాలంటూ సామాన్యులు రోడ్లపైకి వచ్చినప్పుడు.. న్యాయం కోసం బాధితులు రోజుల తరబడి పోరాడినప్పుడు.. దేశ రాజకీయాల్లో కొత్త శక్తులు పుట్టుకొచ్చినప్పుడు.. ఆ పోరాటాల చరిత్రలో ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది! కానీ ఇప్పుడు.. దశాబ్దాలుగా ప్రజా నిరసనలకు చిరునామాగా నిలిచిన ఈ ప్రాంతం నుంచే నిరసనకారులను అధికారికంగా దూరం చేస్తున్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ ఇకపై అధికారిక నిరసన వేదికగా ఉండదు. దాని స్థానంలో రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్లను ప్రత్యామ్నాయ వేదికలుగా ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఇంతకీ ఈ జంతర్ మంతర్ కథేంటి? ఇక్కడి నుంచి మొదలైన ఉద్యమాలు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించాయి? ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
1724లో జైపూర్ మహారాజు సవాయ్ జై సింగ్-2 నిర్మించిన ఖగోళ పరిశీలనా కేంద్రాల్లో జంతర్ మంతర్ ఒకటి. నక్షత్రాలు, గ్రహాల గమనాన్ని పరిశీలించడానికి నిర్మించిన ఈ ప్రాంతం.. శతాబ్దాలు గడిచేకొద్దీ మరో చారిత్రక పాత్రను పోషించింది. ఆకాశంలోని గ్రహాల గమనాన్ని లెక్కించడానికి ఏర్పడిన ఈ ప్రదేశానికి.. ఒకరోజు నేలమీద సామాన్యుల ఆవేదనను దేశానికి వినిపించే వేదికగా గుర్తింపు వచ్చింది.
Also Read
1990లలో ఢిల్లీలో నిరసనలకు సంబంధించి బోట్ క్లబ్ ప్రాంతంపై ఆంక్షలు పెరగడంతో జంతర్ మంతర్ ఒక ముఖ్యమైన నిరసన కేంద్రంగా ఎదిగింది. పార్లమెంటుకు సమీపంలో ఉండటం, దేశ రాజకీయాలకు సంబంధించిన కీలక ప్రాంతానికి దగ్గరగా ఉండటం దీని ప్రాధాన్యాన్ని పెంచాయి. దూర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చిన రైతులు, కార్మికులు, సామాజిక కార్యకర్తలు, న్యాయం కోసం పోరాడుతున్న బాధితులు ఇక్కడ తమ గొంతు వినిపించడం ప్రారంభించారు. అలా జంతర్ మంతర్ ఒక నిరసన స్థలం నుంచి.. ప్రజల సమస్యలు, ప్రభుత్వాల నిర్ణయాలు, అధికార వ్యవస్థల బాధ్యతలపై చర్చ జరిగే వేదికగా మారింది. ఇక 2011లో అవినీతిపై దేశవ్యాప్తంగా రగిలిన ఆగ్రహానికి జంతర్ మంతర్ వేదికైంది. దేశంలో అవినీతిపై చర్చ తీవ్రమవుతున్న సమయంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు.
లోక్‌పాల్ చట్టం కోసం ఆయన చేపట్టిన ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరిగింది. అవినీతిని అరికట్టడానికి బలమైన వ్యవస్థ కావాలనే డిమాండ్ ప్రజల్లోకి విస్తరించింది. అక్కడితో ఆ ఉద్యమం ఆగిపోలేదు. నిరసనలు రామ్‌లీలా మైదానానికి విస్తరించాయి. మీడియా, సోషల్‌మీడియా ద్వారా ఉద్యమం దేశవ్యాప్త చర్చగా మారింది. ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెరిగింది.
లోక్‌పాల్ అంశం జాతీయ రాజకీయాల్లో ప్రధాన అంశంగా నిలిచింది. ఆ ఉద్యమం నుంచి భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయం కూడా మొదలైంది. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ సహా కొందరు కార్యకర్తలు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. అంటే జంతర్ మంతర్‌లో మొదలైన నిరసన.. ఒక రాజకీయ ఉద్యమానికి పునాది వేసిన చరిత్రలో భాగమైంది. ఆ తర్వాత కూడా.. ఈ వేదికపై ఎన్నో ఆవేదనలు వినిపించాయి. రైతుల సమస్యల నుంచి మాజీ సైనికుల పెన్షన్ల వరకు.. మహిళలపై హింసకు వ్యతిరేకంగా న్యాయం కోసం సాగిన పోరాటాల నుంచి వివిధ సామాజిక హక్కుల ఉద్యమాల వరకు జంతర్ మంతర్ అనేక నిరసనలకు వేదికగా నిలుస్తూ వచ్చింది.
ఇక 2023లో రెజ్లర్లు తమపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసనకు దిగారు. ఈ పోరాటం క్రీడాకారుల హక్కులు, మహిళల భద్రత, అధికారంలో ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎలా జరగాలనే అంశాలను జాతీయ చర్చలోకి తీసుకొచ్చింది. జంతర్ మంతర్‌తో ముడిపడిన ఈ నిరసన కూడా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
నిజానికి ఇలాంటి ఉద్యమాలన్నీ ఒకే ఫలితాన్ని ఇవ్వలేదు. కొన్ని రాజకీయ చర్చలను మార్చాయి.. కొన్ని చట్టపరమైన చర్యలపై ఒత్తిడి పెంచాయి.. మరికొన్ని ఆశించిన పరిష్కారం లేకుండానే కొనసాగాయి. అయితే ఇప్పుడు అదే జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి తీసేశారు. అక్టోబర్ 12న వెలువడిన ఢిల్లీ పోలీసుల నిర్ణయం ప్రకారం.. జంతర్ మంతర్ ఇకపై నిరసనలకు గుర్తించిన అధికారిక వేదికగా ఉండదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అక్టోబర్ 9న సుప్రీంకోర్టు కూడా శాంతియుత నిరసనలకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలించాలని అధికారులను కోరింది. నిరసనలకు వచ్చే ప్రజలకు తాగునీరు, వాష్‌రూమ్స్, వైద్య సహాయం లాంటి మౌలిక సదుపాయాలు ఉండాల్సిన అవసరాన్ని కోర్టు ప్రస్తావించింది. మరోవైపు ఇండియాను శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును రాజ్యాంగం కల్పించిందని మర్చిపోవద్దు. అయితే శాంతి భద్రతల అంశాల దృష్ట్యా చట్టబద్ధమైన పరిమితులు కూడా విధించవచ్చు.
2018లో జంతర్ మంతర్, బోట్ క్లబ్ వద్ద నిరసనలను పూర్తిగా నిషేధించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. నిరసన హక్కు, స్థానిక ప్రజల హక్కుల మధ్య బ్యాలెన్స్ అవసరమని స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి జంతర్ మంతర్ చుట్టూ అదే చర్చ మొదలైంది. నిజానికి జంతర్ మంతర్ చరిత్రను చెరిపేయడం అంత సులభం కాదు.. ఎందుకంటే అక్కడ వినిపించిన ప్రతి నినాదం వెనుక ఒక పోరాటం ఉంది, ప్రతి పోరాటం వెనుక ఒక ప్రజా ఆవేదన ఉంది!
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!