India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటర్లు ఎవరో తెలియదు… వాళ్లను ఎలా నమోదు చేయాలో తెలియదు.. దేశమంతా చీలికలు పీలికలుగా ఉంది… పైగా ఆన్లైన్ సౌకర్యాలు… మొబైల్ యాప్‌లు అంతకంటే లేవు… అయినా సరే… ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ప్రపంచమంతా శభాష్ అనేలా ఎన్నికల ఘట్టం చరిత్రలో నిలిచిపోయింది. నేను మాట్లాడుతున్నది మన దేశ మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికల గురించి. అప్పుడున్నది సోకాల్డ్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఈసీ కాదు. ప్రజాస్వామ్య పునాదులపై నిలబడిన ఎన్నికల సంఘం అది. అందుకే ఒక్క మచ్చ కూడా లేకుండా విమర్శలకు తావులేకుండా… ఫస్ట్ ఇండియన్ ఎలక్షన్స్‌ను సక్సెస్ఫుల్ చేయగలిగింది…
ఆధునిక ప్రపంచ రాజకీయ చరిత్రలో… మన దేశంలో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలను ఒక అసాధారణమైన చారిత్రక ఘట్టంగా… సాహసోపేతమైన ప్రజాస్వామ్య ప్రయోగంగా చెప్పుకుంటారు. దేశ జనాభాలో సుమారు ఆరో వంతు మంది ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ ఎన్నికలు అప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీ, సంక్లిష్టమైన ప్రజాస్వామ్య ప్రక్రియగా రికార్డు సృష్టించాయి. నెహ్రూ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం.. రాజ్యాంగ నిర్మాతలు.. కుల, మత, జాతి, లింగ, అక్షరాస్యత, ఆస్తి విచక్షణ లేకుండా వయోజనులందరికీ సార్వత్రిక ఓటు హక్కును కల్పించాయి. తద్వారా ప్రపంచ దేశాలకు.. ప్రత్యేకించి అప్పుడే స్వాతంత్య్రం పొందుతున్న ఆసియా.. ఆఫ్రికా ఖండాలలోని నూతన దేశాలకు ఒక ఆదర్శవంతమైన నమూనాను అందించారు.
Also Read
భారతదేశ మొదటి సార్వత్రిక ఎన్నికల అపూర్వ విజయం వెనుక ఏళ్ల తరబడి జరిగిన మేధోమథనం… అత్యంత పటిష్టమైన రాజ్యాంగ, చట్టపరమైన పునాది ఉన్నాయి. 1949 నవంబర్ 26న ఆమోదం పొంది 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం… ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను బలంగా ప్రతిష్టించింది. ఈ రాజ్యాంగం ద్వారానే వయోజన ఓటుహక్కు సాకారమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ద్వారా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఉనికిలోకి వచ్చింది. అందుకే జనవరి 25ను ప్రతి యేటా ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించే బృహత్తర బాధ్యతను ఈ సంస్థకు అప్పగించింది రాజ్యాంగం. పశ్చిమ బెంగాల్ మాజీ చీఫ్ సెక్రటరీ సుకుమార్ సేన్ భారతదేశపు మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
దేశ భౌగోళిక వైవిధ్యం, రవాణా సౌకర్యాల లేమి, మౌలిక వసతుల కొరత, దేశ విభజన కారణంగా ఏర్పడిన లక్షలాది మంది శరణార్థుల సమస్య.. తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను జటిలం చేశాయి. సుకుమార్ సేన్ పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికి.. దేశంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏ రకమైన పూర్వానుభవం గానీ, సంస్థాగత జ్ఞానం గానీ లేదు. పైగా బ్రిటిష్ ఇండియాలోని 17 ప్రావిన్సులు 565 స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా దేశ పునర్నిర్మాణం జరుగుతున్న రోజులవి. ఈ పునర్నిర్మాణ ప్రక్రియకు అనుగుణంగానే నియోజకవర్గ సరిహద్దులను నిర్ణయించడం కత్తిమీద సామనే చెప్పాలి. అప్పటి దేశ జనాభా సుమారు 36 కోట్లు. అందులో 21 ఏళ్లు పైబడిన వారు 17.32 కోట్లు. వీరందరినీ ఓటర్లుగా నమోదు చేయడానికి దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వేలు నిర్వహించారు. మొత్తం 489 లోక్‌సభ స్థానాలతో పాటు 18 రాష్ట్రాల శాసనసభలకు సంబంధించిన 3283 స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించారు.
ఈ మహాక్రతువును నిర్వహించడానికి…సేన్ సుమారు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారు. వీరిలో 56వేల మంది ప్రిసైడింగ్ అధికారులతో పాటు … ఓటర్ల జాబితాలను టైప్ చేసి క్రోడీకరించడానికి ఒప్పంద ప్రాతిపదికన 16500 మంది గుమస్తాలను నియమించారు. దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది పోలీసులను బందోబస్తు కోసం మోహరించారు. హిమాలయాలలోని మంచు శిఖరాల నుంచి కేరళలోని దట్టమైన అడవులు… రాజస్థాన్ ఎడారుల వరకు ఎన్నికల సామగ్రిని భద్రంగా చేరవేయడానికి రైళ్లు, మోటారు వాహనాలతో పాటు ఏనుగులు.. ఒంటెలు… ఎడ్లబండ్లను సైతం ఉపయోగించాల్సి వచ్చింది.
భారతదేశ మొదటి ఎన్నికల విజయం వెనుక ఉన్న అసలైన బలం అందులో ఉపయోగించిన వినూత్నమైన లాజిస్టికల్ ఆవిష్కరణలే. పాశ్చాత్య దేశాల ఎన్నికల పద్ధతులను యథాతథంగా కాపీ కొట్టకుండా భారతీయ సామాజిక వాస్తవికతలకు అనుగుణంగా ఈ ఆవిష్కరణలను రూపొందించారు. అప్పటి ఎన్నికల సంఘం ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య ప్రజల నిరక్షరాస్యత. ఆ కాలంలో దేశ జనాభాలో 85 శాతం మందికి కనీస అక్షరాస్యత లేదు. చదవడం రాయడం రాదు. ఇలాంటి పరిస్థితులలో బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు ముద్రించి దానికి ఎదురుగా స్టాంపు వేయమని అడగడం అసాధ్యం. అందుకే ప్రతి పార్టీ కోసం ఎన్నికల సింబల్‌ను సృష్టించారు. అత్యంత పటిష్టమైన బ్యాలెట్ బాక్సులను తయారు చేసి అందించే బాధ్యతను అప్పటి గోద్రెజ్ కంపెనీకి అప్పగించింది ఎన్నికల సంఘం. ఎవరూ ట్యాంపరింగ్ చేయడానికి వీలులేని బ్యాలెట్ బ్యాలెట్ బాక్సులను ఆరోజుల్లోనే రూపొందించారు. ఒక వ్యక్తి రెండు సార్లు ఓటు వేయకుండా ఉండేందుకు వీలుగా చెరగని సిరాను కూడా అప్పుడే ప్రవేశపెట్టారు.
దేశవ్యాప్తంగా ఓటర్లను నమోదు చేసే ప్రక్రియలో ఎన్నికల సంఘానికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్శ్, రాజస్థాన్ లాంటి ఉత్తర మధ్య భారతదేశ రాష్ట్రాలలో మహిళలు తమ సొంత పేర్లను బయటి వ్యక్తులకు చెప్పడం అగౌరవంగా, ఆచార విరుద్ధంగా భావించేవారు. అందువల్ల ఓటర్ల నమోదు సమయంలో లక్షలాది మంది మహిళలు తమ పేర్లకు బదులుగా రామ్‌దేవ్ తల్లి… ఇమ్రాన్ భార్య… ఫలానా వ్యక్తి కుమార్తె అని నమోదు చేసుకున్నారు. ఈ పరిస్థితిని చూసిన ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ తీవ్ర ఆశ్చర్యానికి ఆగ్రహానికి గురయ్యారు. ఎవరైతే తమ సొంత పేర్లను నమోదు చేయడానికి నిరాకరిస్తారో వారిని ఓటర్ల జాబితా నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. కాల క్రమంలో ఈ సమస్య లేకుండా పోయింది.
1952 సార్వత్రిక ఎన్నికలు భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక శిలాశాసనం. ఇది కేవలం ఒక ప్రభుత్వాన్ని కూల్చి.. మరొక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి జరిగిన సాధారణ ప్రక్రియ కాదు. ఇది వేలాది సంవత్సరాలుగా సామాజిక అణచివేతకు, అసమానతలకు గురైన సామాన్యులకు అధికార బదిలీ చేసిన ఒక మహత్తర సామాజిక విప్లవం. పాశ్చాత్య దేశాలు దశాబ్దాల పాటు ఎవరికైతే ఓటుహక్కును నిరాకరించాయో వారికి భారతదేశం మొదటి రోజునే ఆ హక్కును కల్పించింది. సార్వత్రిక వయోజన ఓటుహక్కు అనే రాజ్యాంగ ఆదర్శాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి సుకుమార్ సేన్ లాంటి అధికారులు కనబరిచిన కార్యదక్షత… ఈ ఎన్నికల విజయానికి బాటలు వేశాయి. ఆనాటి పకడ్బందీ పునాది వల్లే… నేడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద… అత్యంత క్రియాశీలకమైన.. వైవిధ్యభరితమైన ప్రజాస్వామ్య దేశంగా సగర్వంగా నిలబడగలుగుతోంది.
ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఏ స్థాయి విమర్శలను ఎదుర్కొంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల సంఘం ప్రయాణం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి…
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..