తాగండోయ్…తాగి ఊగండోయ్ అన్నట్టు తయారైంది ఇండియా పరిస్థితి. ప్రపంచంలోనే అతిపెద్ద మద్యం మార్కెట్లుగా ఉన్న అమెరికా.. చైనాలు మందు తాగడం క్రమంగా తగ్గిస్తుంటే భారతీయులు మాత్రం పెగ్గులు మీద పెగ్గులు లాగిస్తున్నారు. బీరు, విస్కీ, రమ్, వోడ్కా.. ఇలా బ్రాండ్ ఏదైనా సరే రికార్డ్ స్థాయిలో సేల్స్ జరుగుతున్నాయి. ఇంతకీ ప్రపంచ దేశాల్లో మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గాయి? మన దగ్గర ఎందుకు పెరిగాయి.
మద్యం సేవించడమన్నది అన్ని దేశాల్లోనూ ఉన్న అలవాటే. ఆయా దేశాల ప్రజల అభిరుచులకు తగ్గట్టు మద్యం అమ్మకాలు కూడా జరుగుతూ ఉంటాయి. 2026 మొదటి ఆరు నెలల గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. IWSR సర్వే చేసిన 21 ప్రధాన మార్కెట్లలో మొత్తం మద్యం వినియోగం 1 శాతం మేర పడిపోయింది. ఈ 21 దేశాలే ప్రపంచంలోని 76 శాతం మద్యం వినియోగానికి కేంద్రాలుగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆల్కహాల్ మార్కెట్ అయిన అమెరికాలో అమ్మకాలు 4 శాతం పడిపోగా.. చైనాలో 3 శాతం మేర తగ్గాయి. కానీ ఇదే సమయంలో భారత్ లో మాత్రం మద్యం వినియోగం 10 శాతం మేర పెరిగింది. ఈ 21 మార్కెట్లలోకెల్లా అత్యంత వేగంగా వృద్ధి చెందిన దేశం మనదే కావడం విశేషం. అమెరికా, చైనా దేశాలను పక్కనబెడితే మిగిలిన మార్కెట్లలో కేవలం 1 శాతం మాత్రమే వృద్ధి కనిపించింది. గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ ఇప్పుడు తమ వ్యాపార విస్తరణ కోసం భారత్ వైపు చూస్తున్నాయి.
మన దేశంలో మందుబాబులు ఏ ఒక్క బ్రాండ్నూ వదల్లేదు. అన్ని కేటగిరీలోనూ భారత్లో సేల్స్ పెరిగాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో బీర్ల వినియోగం అత్యధికంగా 16 శాతం వృద్ధి సాధించింది. రెడీ టు డ్రింక్ ఆల్కహాలిక్ బేవరేజెస్ 12 శాతం పెరిగాయి. మన దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే ఇండియన్ విస్కీ కేటగిరీ 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక బ్లెండెడ్ స్కాచ్ విస్కీ 8 శాతం పెరగ్గా, వోడ్కా, జిన్ బ్రాండ్లు చెరో 6 శాతం వృద్ధి సాధించాయి. రమ్, నాన్-కాగ్నాక్ బ్రాందీ అమ్మకాలు 3 శాతం మేర పెరిగాయి. వైన్ అమ్మకాల్లో కూడా పాజిటివ్ ట్రెండ్ కనిపించింది.
ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం నాన్-ఆల్కహాలిక్ బీర్లదే. మందులేని ఈ బీర్ల వినియోగం మన దేశంలో ఏకంగా 25 శాతం మేర దూసుకెళ్లింది. ఇతర ఏ ఆల్కహాలిక్ డ్రింక్స్ కంటే కూడా ఇదే అత్యంత ఎక్కువగా సేల్ అవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లలో నాన్ ఆల్కహాల్ బీర్ల సేల్స్ కేవలం 8 శాతం మాత్రమే పెరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగంలో టాప్ దేశాల జాబితా చూస్తే 10 శాతంతో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కొలంబియా 9 శాతం, సౌత్ ఆఫ్రికా 5 శాతం, బ్రెజిల్ 3 శాతం, యూకే 2 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మెక్సికో, థాయ్ లాండ్ దేశాల్లో కూడా అమ్మకాలు పెరిగాయి.
ఒకవైపు మన దేశంలో ఇలా సేల్స్ మోత మోగుతుంటే, ఇతర దేశాల్లో తగ్గుముఖం పట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయి. గ్లోబల్ గా ప్రజల్లో తాగుడు తగ్గించాలనే ఆలోచనా విధానం పెరగడం దీనికి ఒక కారణం. అంతేకాకుండా బరువు తగ్గేందుకు వినియోగించే జీఎల్పీ-1 డ్రగ్స్ వాడకం కూడా ఆల్కహాల్ వినియోగంపై ప్రభావం చూపుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం, టారిఫ్లు, ఆర్థిక అనిశ్చితి లాంటివి వినియోగదారుల కొనుగోలు శక్తిని దెబ్బతీశాయి. ఇక చైనా విషయానికొస్తే అక్కడి మందకొడి ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర నిర్మాణాత్మక సవాళ్ల కారణంగా మద్యం డిమాండ్ పడిపోయింది. గ్లోబల్ బ్రాండ్లకు భారత్ లాంటి దేశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.

