ఇరాన్‌ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచం మొత్తం మారిపోయింది..హార్మూజ్‌కు తెరుచుకున్నా సీన్ మారదా?

Hormuz Open

Hormuz Open

Explainer: హార్మూజ్ జల సంధి- ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. అమెరికా – ఇరాన్ ఒప్పందంతో ఈ జలసంధి మళ్లీ తెరుచుకుంటోంది. యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రకటన చేయగానే హార్మూజ్‌లో పరిస్థితులు బ్యాక్ టు నార్మల్ అని అనుకోవడానికి అవకాశం లేదు. ఈ మార్గం తన పాత వైభవాన్ని తిరిగి పొందడం అంత ఈజీ కాదు. యుద్ధం నేర్పిన పాఠాలతో ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నాయి. ముడిచమురు సంక్షోభంతో ఇబ్బంది పడ్డ భారత్‌కు ఒమన్ ఊహించని స్థాయిలో అండగా నిలిచింది. హార్మూజ్‌కు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో గల్ఫ్ దేశాలతో పాటు ఆసియా దేశాలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాయి.

మూడున్నర నెలల బాంబుల వర్షానికి ఎట్టకేలకు అమెరికా- ఇరాన్ ఫుల్ స్టాప్ పెట్టాయి. శాంతి ఒప్పందం ద్వారా యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. హార్మూజ్ జలసంధి ద్వారా ఇకపై స్వేచ్ఛగా ఇంధన సరఫరా కూడా సాగుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు హార్మూజ్ జల సంధి మళ్లీ అందుబాటులోకి వచ్చినా… జరిగిన నష్టాన్ని పూడ్చడం అంత ఈజీ కాదు. ప్రపంచ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునేందుకు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాయి.

×
×
Ad

యుద్ధం కారణంగా ఇండియా ఎలా నష్టపోయింది?

ఈ సంక్షోభం కారణంగా అత్యంత దారుణంగా నష్టపోయిన దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. మధ్యప్రాచ్యం నుంచి వచ్చే చమురు.. గ్యాస్‌తో పాటు ఎరువుల దిగుమతులు కూడా ఈ కీలక మార్గం గుండానే సాగుతాయి. అందుకే మనకు భారీ నష్టం వాటిల్లింది. భారతీయ చమురు సంస్థలు రోజుకు ఏకంగా 16 వేల కోట్ల రూపాయల మేర నష్టపోయాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.

దుక్మ్ పోర్టుకు ఇండియాకు ఉన్న లింకేంటి?

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత్ – ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కార్యరూపం దాల్చడం ఒక పెద్ద శుభవార్త. ఈ ఒప్పందంతో ఒమన్‌కు భారతీయ ఎగుమతులు ఊపందుకుంటాయి. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఒమన్ భౌగోళిక స్థానం మనకు చాలా కీలకం. హార్మూజ్ జలసంధి వెలుపల అరేబియా సముద్రం.. గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో ఉంది. దీంతో సరుకులు హార్మూజ్‌తో పనిలేకుండానే సలాలా… దుక్మ్ పోర్టుల ద్వారా సులభంగా రవాణా అవుతాయి.

దుక్మ్ పోర్టులో భారత్‌కు చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. ముడిచమురు, యూరియా కొనుగోళ్ల కారణంగా ఒమన్ నుంచి మన దిగుమతులు 430 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 1.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే ఏకంగా 246 శాతం వృద్ధి నమోదైంది. ఈ నేపథ్యంలోనే 40 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టాల్సిన ఒమన్-గుజరాత్ డీప్-సీ గ్యాస్ పైప్‌లైన్ ప్రతిపాదనను ఇరు దేశాలు మళ్లీ తెరపైకి తెచ్చాయి. 2000 కిలోమీటర్ల పొడవైన ఈ సముద్రగర్భ ప్రాజెక్టు పూర్తయితే… భవిష్యత్తులోహార్మూజ్ సంక్షోభాలతో సంబంధం లేకుండా నేరుగా భారత్‌కు సురక్షితంగా సహజ వాయువు అందుతుంది.

దేశాలు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్న వేళ… ఒమన్ తన అనుకూల భౌగోళిక స్థానంతో భారీగా లాభపడుతోంది. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా.. ఇరాక్.. కువైట్.. బహ్రెయిన్‌తో పాటు యూఏఈ నుంచి ఆసియా మార్కెట్లకు వెళ్లే ప్రపంచ ఇంధన సరఫరాలో ఐదో వంతు హార్మూజ్ గుండానే సాగుతుంది. హార్ముజ్ బయట తన పోర్టులు ఉండటంతో ఒమన్ రికార్డు స్థాయిలో చమురును ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తోంది.

కేవలం దుబాయ్‌కు వెళ్లే సరుకుల కస్టమ్స్ ఆదాయమే మార్చిలో 270 మిలియన్ డాలర్లు ఉంటే… ఏప్రిల్ నాటికి అది 2.16 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. సముద్ర.. వాయు రవాణాకు నమ్మకమైన కేంద్రంగా ఒమన్ అవతరించింది. హార్మూజ్ ద్వారా గల్ఫ్ దేశాలకు ఆహార ఎగుమతులు నిలిచిపోవడంతో… ఆ సరుకులన్నీ ఒమన్ పోర్టుల నుంచి హట్టా సరిహద్దు మీదుగా యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తున్నాయి. వ్యూహాత్మక రోడ్డు.. రైల్వే ప్రాజెక్టులతో పాటు భారత్ లాంటి దేశాలతో గ్యాస్ పైప్‌లైన్ల నిర్మాణానికి ఒమన్‌కు భారీగా పెట్టుబడులు రానున్నాయి.

చమురు ఎగుమతులపైనే ఆధారపడిన యూఏఈ లాంటి దేశాలకు హార్మూజ్ మూసివేత ప్రాణసంకటంగా మారింది. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచం ఒక బిలియన్ బ్యారెళ్ల చమురును కోల్పోయిందని యూఏఈ ప్రకటించింది. అందుకే 2027 నాటికి రోజుకు 4 మిలియన్ బ్యారెళ్ల ఎగుమతి సామర్థ్యాన్ని సాధించేలా… వెస్ట్-ఈస్ట్ చమురు పైప్‌లైన్ నిర్మాణాన్ని యూఏఈ వేగవంతం చేసింది. హార్మూజ్‌కు 70 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఫుజైరా పోర్టు ద్వారా ఇది సాగుతుంది. ఫుజైరా ఆయిల్ టెర్మినల్ అనేది 1.177 మిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న అతిపెద్ద ఆన్‌షోర్ స్టోరేజ్ ఫెసిలిటీ. ఇది భారత్‌కు కూడా చాలా కీలకం. ఇక్కడి నుంచే ఏప్రిల్‌లో భారత్‌కు యూఏఈ చమురు ఎగుమతులు సగటున 43 శాతం పెరిగి… రోజుకు 6 లక్షల 19 వేల బ్యారెళ్లకు చేరుకున్నాయి.

ఓపెక్‌లో రెండో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశమైన సౌదీ అరేబియా సైతం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. తన ఎగుమతులను ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ద్వారా ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టుకు మళ్లించింది. తూర్పు ప్రావిన్స్‌లోని అబ్ఖైక్ చమురు క్షేత్రం నుంచి 1200 కిలోమీటర్ల మేర ఉండే జంట పైపుల ద్వారా ఇది సాగుతుంది. పెట్రోలైన్‌గా పిలిచే ఈ పైప్‌లైన్‌ను 1981లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో… హార్ముజ్‌తో సంబంధం లేకుండా అత్యవసర మార్గంగా నిర్మించారు. ఇప్పుడు ఈ పైప్‌లైన్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ సత్ఫలితాలనిస్తోంది.

యుద్ధం మొదలైన తర్వాత యాన్బు పోర్టు ద్వారా ఐరోపాకు సౌదీ జెట్ ఫ్యూయల్ ఎగుమతులు భారీగా పెరిగాయి. మరో ప్రధాన ఉత్పత్తి దేశమైన ఇరాక్ కూడా వేరే దారులను వెతుక్కుంటోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి సిరియాలోని బనియాస్ ఆయిల్ పోర్టు ద్వారా చమురు ఎగుమతులు మొదలుపెట్టింది. అల్-తన్ఫ్ సరిహద్దు ద్వారా సిరియాలోకి ప్రవేశించే ఇరాక్ ఇంధనం.. మధ్యధరా తీరంలోని బనియాస్ నుంచి ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటుంది. సిరియాలో పునర్నిర్మాణ పనులు సాగుతున్నందున.. హార్మూజ్ తెరుచుకున్న తర్వాత కూడా ఇరాక్ ఎగుమతులకు ఈ మార్గం శాశ్వతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

హార్మూజ్ మూసివేత వల్ల ఆసియా మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్, అమెరికా కంటే ఆసియా దేశాలే ఎక్కువ మూల్యం చెల్లించుకున్నాయి. చమురు అమ్మకాలతో అమెరికా లాభపడితే… భారత్.. జపాన్.. దక్షిణ కొరియా దేశాలు ఇబ్బందులపాలయ్యాయి. దీంతో ఆయా దేశాలు సంప్రదాయేతర వనరుల వైపు మళ్లాయి. అలా లాభపడిన రెండు దేశాలు అజర్‌బైజాన్, కజకిస్థాన్. మే 2న అజర్‌బైజాన్ నుంచి 45 వేల కిలోలీటర్ల ముడిచమురుతో వచ్చిన ఒక ట్యాంకర్ యోకోహామాలోని ఇనియోస్ రిఫైనరీకి చేరుకుంది. జపాన్‌కు అజర్‌బైజాన్ చమురు రావడం ఇదే తొలిసారి.

హార్మూజ్ తెరుచుకున్నా… జపాన్ ఇకపై ఆ మార్గంపై పూర్తిగా ఆధారపడే అవకాశం లేదు. లాజిస్టిక్స్ పరంగా తక్కువ ఖర్చుతో కూడిన కజకిస్థాన్ వైపు కూడా జపాన్ చూస్తోంది. మధ్యప్రాచ్య చమురు కొరతతో కజకిస్థాన్ చమురుకు గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. సెంట్రల్ ఆసియా.. కాస్పియన్ సముద్రం మీదుగా టర్కీ.. ఐరోపా పోర్టులకు చేరుకునే మిడిల్ కారిడార్‌లో ట్రాఫిక్ పెరిగింది. ఐరోపాతో పాటు జపాన్.. బంగ్లాదేశ్‌లకు కజకిస్థాన్ సరఫరా పెంచింది. భౌగోళిక అనిశ్చితి నడుమ మధ్య ఆసియా ప్రాంతం ఇప్పుడు ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్‌గా మారిందని ఐఎంఎఫ్ చెబుతోంది.

మొత్తంగా చూస్తే… హార్మూజ్ అనిశ్చితితో ప్రతిరోజూ కొత్త భాగస్వామ్యాలు.. కొత్త మార్గాలు పుట్టుకొస్తున్నాయి. దేశాలన్నీ ఈ ప్రత్యామ్నాయ మార్గాలను మరింత పటిష్టం చేసుకుంటూ శాశ్వత మార్గాలుగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. హార్మూజ్ ప్రాధాన్యం పూర్తిగా పోకపోయినా… యుద్ధానికి ముందు ఉన్నంత రద్దీ ఇకపై ఉండకపోవచ్చు. అమెరికా డాలర్‌ను ఆయుధంగా వాడుకుని డీ-డాలరైజేషన్‌కు కారణమైనట్లే… ఇరాన్ కూడా హార్మూజ్ ఆయుధంగా ప్రయోగించి తనకు తానే కోలుకోలేని దెబ్బ తీసుకుంది.