El Nino: ఎల్‌నినో దెబ్బ.. చుట్టుముడుతున్న వ్యాధులు..WHO సంచలన ప్రకటన!

Elnino Health Effects Explained

Elnino Health Effects Explained

ఒక చిన్న వాతావరణ మార్పు.. కోట్లాది మంది మనుషుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టగలదా? సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల దోమల వ్యాప్తి నుంచి ప్రాణాంతకమైన వడదెబ్బ వరకు ఎన్నో సమస్యలు తీవ్రమవుతాయా? అవును. దీనికి కారణం ఎల్‌నినో!

భూమి వాతావరణ వ్యవస్థలో జరిగే సహజమైన మార్పుల్లో ఎల్‌నినో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మార్పు ఒక్క సముద్రానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపిస్తుంది.

ఇప్పుడు ఈ ఎల్‌నినో ప్రభావం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భూతాపంతో వేడెక్కుతున్న భూమిపై ఎల్‌నినో మరో ఉష్ణ ప్రభావాన్ని తీసుకురావచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తోంది. 2027 ప్రారంభం వరకు దీని ప్రభావం కొనసాగవచ్చని అంచనా వేస్తోంది. ఈ పరిణామాల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా ఎల్‌నినోతో ముడిపడిన ఆరోగ్య ప్రభావాలను ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించింది. ఇందులో మొదటిది తీవ్రమైన వేడి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే వడదెబ్బ, డీహైడ్రేషన్, గుండెపై ఒత్తిడి లాంటి సమస్యలు పెరుగుతాయి. రెండోది గాలి నాణ్యత. కరువులు, అడవుల్లో మంటల కారణంగా పొగ, కాలుష్య కారకాలు గాలిలోకి చేరి శ్వాసకోశ సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. మరోవైపు వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు దోమల వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించవచ్చు. ఫలితంగా డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల ముప్పు మారుతుంది. కలుషితమైన నీటి సమస్యలు పెరిగితే కలరా లాంటి వ్యాధుల ప్రమాదం కూడా ఉంటుంది. పంటలు దెబ్బతినడం, నీటి కొరత ఏర్పడటం వల్ల ఆహార భద్రత దెబ్బతిని పోషకాహార లోపం పెరిగే అవకాశం ఉంది.

ఇక 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవానికి ముందు ఉన్న స్థాయితో పోలిస్తే 1.47 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. 2023 నుంచి 2026 వరకు నమోదైన నాలుగేళ్లు చరిత్రలో అత్యంత వేడిగా ఉన్న నాలుగేళ్లుగా నిలిచాయి. సముద్రాలు ఈ అదనపు వేడిలో దాదాపు 90 శాతాన్ని గ్రహిస్తున్నాయి. వాటి పై పొరల్లోనే కాదు, రెండు వేల మీటర్ల లోతు వరకు సముద్ర జలాల్లో వేడి పెరుగుతోంది. వేడెక్కిన నీరు విస్తరించడం, హిమానీనదాలు కరగడం వల్ల సముద్ర మట్టాలు కూడా పెరుగుతున్నాయి. ఈ వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. యూరోప్‌లో వేడిగాలులు, కరువులు, అడవి మంటల కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం 30 వేల మందికి పైగా అదనపు మరణాలు సంభవించాయి. భారత్‌లో 2026 ఏప్రిల్‌లో వచ్చిన వేడిగాలుల సమయంలో సుమారు 14 కోట్ల 65 లక్షల మంది తీవ్ర ఉష్ణోగ్రతలకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఒక మార్గం ఉంది. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు.

2015లో ఇలాంటి వ్యవస్థలను నివేదించిన దేశాలు 56 మాత్రమే. 2025 నాటికి ఆ సంఖ్య 136కు చేరింది. నిజానికి ప్రకృతిలో మార్పులను మనం ఆపలేకపోవచ్చు కానీ వాటి ప్రభావాన్ని ముందుగానే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఎందుకంటే వాతావరణ మార్పు అనేది కేవలం భూమి వేడెక్కడం మాత్రమే కాదు. అది మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, చివరికి మనిషి మనుగడతో ముడిపడిన పరిణామం.