Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నది ఒక్కసారిగా ఉప్పొంగితే మనం భయపడతాం. కానీ అదే నది నెమ్మదిగా మారుతుంటే? నది మారడమేంటని ఆలోచిస్తున్నారా? ఒక సంవత్సరం కొద్దిగా మారిన ప్రవాహం.. మరో సంవత్సరం కొద్దిగా తగ్గిన నీరు.. వర్షాకాలంలో మారిన వరదల లయ. నదితో పాటు కదిలే మట్టి క్రమంగా తగ్గిపోవడం.. ఇవేవీ ఒక్కరోజులో విపత్తులా కనిపించవు కానీ 20ఏళ్ల తర్వాత అదే మార్పులు ఒక ప్రాంతం వ్యవసాయాన్ని మార్చవచ్చు. చేపల జీవనాన్ని మార్చవచ్చు.
నదీతీరాలను మార్చవచ్చు. చివరికి నదిని నమ్ముకుని జీవించే లక్షలాది మంది జీవితాలను మార్చవచ్చు. ఇదే బ్రహ్మపుత్ర విషయంలో ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అసలు ప్రమాదం. టిబెట్‌లో యార్లుంగ్ సాంగ్పోగా పిలిచే ఈ నది నమ్చా బర్వా పర్వతం దగ్గరికి చేరుకున్నప్పుడు తన స్వభావాన్నే మార్చుకుంటుంది. ప్రపంచంలోని అత్యంత లోతైన లోయల్లో ఒకదాని గుండా భారీ ఎత్తు నుంచి కిందికి దూసుకెళ్తుంది.
అక్కడే నదికి ఉన్న అపారమైన జలవిద్యుత్ సామర్థ్యం కనిపిస్తుంది. అదే చోట ప్రకృతి ఎంత ప్రమాదకరమైనదో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంఆన్ని భూకంపాలు సంభవించే భూమిగా చెబుతుంటారు. నిటారుగా ఉన్న పర్వతాలు.. హిమనదాలు.. భారీ వర్షాలు.. కొండచరియలు.. వాటి మధ్య నుంచి ఉద్ధృతంగా ప్రవహించే నది.. ఇలా ఇక్కడ ఒక ప్రమాదం మరో ప్రమాదాన్ని పుట్టించగలదు. భూకంపం కొండను కదిలించవచ్చు. వర్షం ఆ కొండచరియను నదిలోకి నెట్టవచ్చు. కొండచరియ నదిని అడ్డుకోవచ్చు. ఆ అడ్డంకి తెగిపోతే దిగువకు ఒక్కసారిగా భారీ నీటి ప్రవాహం దూసుకెళ్లవచ్చు. ఇదే కారణంగా మెడోగ్ జలవిద్యుత్ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తమవుతోంది. కానీ దీన్ని కేవలం వాటర్ బాంబ్ అని పిలవడం అసలు కథలో సగం మాత్రమే.
Also Read
ఒకవేళ చైనా ఈ ప్రాజెక్టును విద్యుత్ ఉత్పత్తి, ఆర్థిక అభివృద్ధి కోసమే నిర్మిస్తోందని అనుకున్నా కూడా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ప్రాజెక్టు తర్వాత నది తన పాత లయలోనే ప్రవహిస్తుందా? ఎందుకంటే నదితో పాటు మట్టి ప్రయాణిస్తుంది.. పోషకాలు ప్రయాణిస్తాయి.
వేల సంవత్సరాలుగా ఆ మట్టే నదీతీరాలను నిర్మించింది. వ్యవసాయ భూములను సారవంతం చేసింది. చేపలకు జీవనాధారంగా మారింది. వరద మైదానాలను తీర్చిదిద్దింది. అందుకే భారత్‌కు ఎంత నీరు వస్తుందన్నదే ప్రశ్న కాదు. ఎప్పుడు వస్తుంది? ఎలాంటి వేగంతో వస్తుంది? వర్షాకాలంలో ప్రవాహం ఎలా ఉంటుంది? ఎండాకాలంలో ఎంత నీరు ఉంటుంది? వీటితో పాటు ఎంత మట్టి దిగువకు వస్తుందన్నవే అసలు ప్రశ్నలు.
ఒక పెద్ద ఆనకట్ట లేదా జలవిద్యుత్ ప్రాజెక్టు నదిని నియంత్రించినప్పుడు దాని సహజ లయ మారవచ్చు. ఆ మార్పు మొదటి ఏడాది పెద్దగా కనిపించకపోవచ్చు. రెండో ఏడాది కూడా కనిపించకపోవచ్చు. కానీ పదేళ్లు, 20ఏళ్లు గడిచిన తర్వాత పరిస్థితి వేరుగా ఉండొచ్చు. వ్యవసాయంపై ప్రభావం పడవచ్చు. చేపల జీవనం మారవచ్చు. నదీతీరాల క్షీణత పెరగవచ్చు. వరద మైదానాల స్వభావం మారవచ్చు. జీవవైవిధ్యం కూడా ప్రభావితమవుతుంది. ఇక్కడే అసలు అసమానత కనిపిస్తుంది.
మెడోగ్ నుంచి వచ్చే విద్యుత్ ప్రయోజనం ప్రధానంగా చైనాకే దక్కుతుంది. పెట్టుబడులు, ఆర్థిక లాభాలు కూడా అక్కడే ఉంటాయి. కానీ నది ప్రవాహంలో ఏర్పడే దీర్ఘకాలిక మార్పులు మాత్రం సరిహద్దులను దాటి ప్రయాణించవచ్చు. అందులో అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఆ తర్వాత బంగ్లాదేశ్‌కూ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఇదే కారణంగా వాటర్ బాంబ్ అనే ఆలోచన కంటే మారుతున్న నది అనే ఆలోచనను మనం మరింత సీరియస్‌గా చూడాలి. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చే వరదను గుర్తించడం సులభం. దానికి హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయవచ్చు. ప్రజలను అప్రమత్తం చేయవచ్చు కానీ ప్రతి సంవత్సరం కొద్దిగా మారుతున్న నదిని గుర్తించడం చాలా కష్టం. ఇక్కడ మరో పెద్ద మార్పు కూడా జరుగుతోంది. వాతావరణం మారుతోంది. హిమనదాలు మారుతున్నాయి. వర్షపాతం తీరు మారుతోంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు మరింత ముఖ్యమైనవిగా మారుతున్నాయి. భవిష్యత్తులో బ్రహ్మపుత్రలో ఏదైనా మార్పు కనిపిస్తే అది సహజ వాతావరణ మార్పు వల్ల వచ్చిందా? ఎగువ ప్రాంతాల్లోని మానవ జోక్యం వల్ల వచ్చిందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడా కష్టమవుతుంది.
అందుకే భారత్ భవిష్యత్తులో వచ్చే సమస్య కోసం ఎదురుచూడకూడదు. ఇప్పటి నుంచే నదిని గమనించాలి. ఉపగ్రహాలు, రాడార్, ఇన్సార్ సాంకేతికత, భూకంప పర్యవేక్షణ, ఎత్తైన ప్రాంతాల్లో వాతావరణ కేంద్రాలు, నదీ ప్రవాహ కొలతలు. మట్టి రవాణా కొలతలు.. ఇవన్నీ కలిసి నది ఎలా మారుతుందో ముందుగానే అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి. అందుకే ఇప్పటికైనా ఈ విషయాన్ని ఇండియాతో పాటు సరిహద్దు దేశాలు తెలుసుకుంటే భవిష్యత్‌లో అనేక ముప్పుల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?