మనుషులకు కొన్ని జీవులంటే విపరీతమైన ప్రేమ..మరికొన్ని జీవులంటే కంపరం. రంగురంగుల సీతాకోకచిలుకలు కనిపిస్తే మనుషులు మురిసిపోతారు. పూల మీద వాలే తేనెటీగలను చూస్తే ప్రకృతిలో వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటారు. అయితే బొద్దింక కనిపిస్తే మాత్రం ముఖం చిట్లిస్తారు. అది ఎక్కడి నుంచి వచ్చిందోనని ఆలోచిస్తారు. వెంటనే చంపేయడానికి ప్రయత్నిస్తారు. మనుషుల దృష్టిలో బొద్దింక అంటే అసహ్యం, అపరిశుభ్రత. కానీ ప్రకృతి దృష్టిలో ప్రతి జీవికీ ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రకృతికి సురూపి, కురూపి అనే భేదం ఉండదు. మనుషులు చిన్నచూపు చూసే బొద్దింకలు ప్రకృతిలో ఎంత గొప్ప పని చేస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా అమెజాన్ అడవుల్లో రాత్రిపూట కాక్రోచ్లు చేస్తున్న ఒక చర్య నిజంగా అద్భుతం. ఇంతకీ అమెజాన్ అడవుల్లో బొద్దింకలు ఏం చేస్తున్నాయి? బ్రెజిలియన్ జర్నల్ ఆఫ్ బొటనీలో ప్రచురితమైన అధ్యయనం ఏం చెబుతోంది?
సాయంత్రం ఆరు గంటల సమయం.. బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో సూర్యుడు నెమ్మదిగా మాయమవుతున్నాడు. చుట్టూ చీకటి పరుచుకోవడానికి సిద్ధమవుతోంది. అక్కడ ఒక చిన్న పొదలాంటి మొక్కకు పూసిన పూలు నెమ్మదిగా విచ్చుకోవడం మొదలుపెట్టాయి. పగలంతా మూడుచుకుని ఉన్న ఆ పూలు సాయంత్రం అవ్వగానే రేకులను విప్పుతున్నాయి. వాటి నుంచి వచ్చే సువాసన క్రమంగా పెరుగుతోంది. పూల కాడల నుంచి తేనె చుక్కలు కిందకు జారుతున్నాయి.
ఆరు గంటల సమయానికి మొదలైన ఈ మార్పు, ఏడు గంటలు వచ్చేసరికి మరో ఆసక్తికరమైన దృశ్యానికి దారితీసింది. ఆ పూల దగ్గరకు బొద్దింకలు రావడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కటిగా పూల మీదకు చేరుకుంటున్నాయి. వాటిలోని తేనెను తాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పూల దగ్గరకు తేనెటీగలు, సీతాకోకచిలుకలు వస్తాయని మనకు తెలుసు. కొన్ని మొక్కల దగ్గరకు గబ్బిలాలు కూడా వస్తుంటాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం మాత్రం శాస్త్రవేత్తలకు కొత్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ బొద్దింకలు కేవలం తేనె తాగి వెళ్లిపోవడం లేదు. ఆ మొక్కలో కొత్త కాయలు ఏర్పడటానికి కూడా సహాయపడుతున్నాయి. ఈ మొక్క పేరు మబేయా ఉలియానా. బ్రెజిల్‌లోని అమెజానాస్ ప్రాంతంలో మాత్రమే పెరిగే ప్రత్యేకమైన మొక్క ఇది.
అక్కడి తెల్లటి ఇసుక నేలల్లో, పోషకాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని పూల గుత్తులను దగ్గరగా పరిశీలిస్తే ఒక విచిత్రమైన నిర్మాణం కనిపిస్తుంది. పైన ఒకటి లేదా రెండు ఆడ పూలు ఉంటాయి. వాటి కింద 200లకు పైగా చిన్న చిన్న మగ పూలు ఉంటాయి. మగ పూల నుంచి పుప్పొడి విడుదలవుతుంది. ఆ పుప్పొడి ఆడ పూలకు చేరినప్పుడే వాటి నుంచి కాయలు ఏర్పడతాయి. ఇక్కడే బొద్దింకలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
ఒక బొద్దింక తేనె కోసం పూల దగ్గరకు వచ్చినప్పుడు నేరుగా తేనెను చేరుకోలేదు. ముందుగా పూల గుత్తి మీదుగా కిందికి వంగి వెళ్లాలి. అలా వెళ్లే సమయంలో దాని కాళ్లు, పొట్ట భాగం మగ పూలకు తగులుతాయి. ఆ పూల నుంచి విడుదలైన పుప్పొడి దాని శరీరానికి అంటుకుంటుంది. తేనెను తాగిన తర్వాత తిరిగి బయటకు వెళ్లేందుకు అదే దారిలో పైకి ఎక్కుతుంది. అప్పుడు దాని శరీరానికి అంటుకున్న పుప్పొడి ఆడ పూలకు తగులుతుంది. అంటే ఆ బొద్దింకకు కావాల్సింది కొద్దిగా తేనె మాత్రమే కానీ ఆ తేనె కోసం అది చేసే ప్రయాణం ఒక మొక్కలో కొత్త కాయలు ఏర్పడటానికి కారణమౌతుంది.
ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఓ బొద్దింక అంతకుముందు మరో మొక్క దగ్గరకు వెళ్లి ఉంటే, అక్కడి పుప్పొడి కూడా దాని శరీరానికి అంటుకుని ఉండవచ్చు. అప్పుడు అది కొత్త మొక్క దగ్గరకు వచ్చినప్పుడు ఆ పుప్పొడిని కూడా అక్కడి ఆడ పూలకు చేరవేస్తుంది. ఇలా ఒక మొక్క నుంచి మరో మొక్కకు పుప్పొడి చేరుతుంది. దీన్నే పరాగసంపర్కం అంటారు.
ఈ మొక్క పుప్పొడిలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అది చాలా జిగటగా ఉంటుంది. అందుకే కీటకాల శరీరానికి సులభంగా అంటుకుంటుంది. అవి పూల మధ్య తిరిగిన ప్రతిసారీ పుప్పొడి కూడా వాటితో పాటు ప్రయాణిస్తుంది. ఇలా బొద్దింకలు ప్రకృతికి ఎంతో సాయం చేస్తున్నాయి. ఇక గతంలో ఫ్రెంచ్ గయానాలో జరిగిన మరో పరిశోధనలో కూడా బొద్దింకలు ఒక ఉష్ణమండల మొక్కకు పరాగసంపర్కం చేస్తున్నట్లు గుర్తించారు. ఆ మొక్కలో విత్తనాలుగా మారగల నిర్మాణాల్లో దాదాపు 41 శాతానికి బొద్దింకలే పరాగసంపర్కం చేస్తున్నాయని అంచనా వేశారు. నిజానికి ప్రతి జీవి తన వంతుగా ప్రకృతిలో ఏదో ఒక పని చేస్తోంది. మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, ప్రకృతి తన సమతుల్యతను కాపాడుకోవడానికి కోట్లాది జీవుల సహకారం తీసుకుంటూనే ఉంటుంది.
ఇక్కడ చూస్తే మనిషి మాత్రం తన సంకుచిత ఆలోచనలతో జీవులకు విలువలు కడుతున్నాడు కానీ డార్విన్ పరిణామ సిద్ధాంతం చూపించిన జీవవృక్షంలో మనిషి కూడా ఒక కొమ్మ మాత్రమే. ప్రకృతిలో ప్రతి జీవికీ తనదైన పరిణామ చరిత్ర, మనుగడలో తనదైన పాత్ర ఉన్నాయి. ప్రకృతిలో ప్రతి జీవికీ ఒక స్థానం ఉంది. తనకంటే గొప్ప జీవి లేదని విర్రవీగే మనిషికి ఈ సత్యం అర్థం కావడమే అసలైన పరిణామం.

