NTV Telugu Site icon

OU Phd Admissions: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలపై వివాదం?

Ou Phd Admissions

Ou Phd Admissions

OU Phd Admissions: ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో పీహెచ్‌డీ ప్రవేశాల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ప్రవేశపెట్టిన కొత్త రూల్స్‌పై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఓయూలో గతంలో ఎలిజిబిలిటీ టెస్ట్‌ పెట్టేవారు. అందులో వచ్చిన మార్కుల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి సీట్లు ఇచ్చేవారు. ఈసారి ఈ విధానానికి భిన్నంగా వ్యవహరిస్తామని అధికారులు చెప్పటంతో అభ్యర్థులు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.

ఈసారి కొత్తగా ర్యాంకులు ఇచ్చి అడ్మిషన్లు చేపట్టనుండటం వివాదానికి దారితీస్తోంది. పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఓయూలో నాలుగేళ్ల అనంతరం నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో పోటీ తీవ్రంగా ఉంది. ఖాళీగా ఉన్న సీట్లలో 50 శాతాన్ని కేటగిరీ-1 కింద భర్తీ చేస్తామని, వీటిని జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) అర్హత సాధించినవారికి కేటాయిస్తామని ఓయూ అధికారులు చెబుతున్నారు. మిగతా 50 శాతం సీట్లను పరీక్ష ద్వారా, ర్యాంకులు ఇచ్చి నింపుతామని అంటున్నారు.

Home Work: ఒకటీ రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్‌ ఇవ్వొద్దన్న ఆదేశాలు అమలవుతాయా?

ఎంట్రన్స్‌ టెస్ట్‌లో వచ్చిన మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇస్తామని పేర్కొంటున్నారు. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) లేదా స్టేట్‌ లెవల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(స్లెట్‌)తోపాటు ఎంఫిల్‌, ఇంటర్వ్యూ తదితర దశల్లో వచ్చిన మార్కులకు మిగతా 30 శాతం వెయిటేజీ ఇస్తామని ఓయూ అధికారులు వివరిస్తున్నారు. ఈ విధానం పట్ల విద్యార్థులు విముఖత ప్రదర్శిస్తున్నారు. పాత పద్ధతిలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ ఇవ్వటంలో ఇప్పటికే నాలుగేళ్లు జాప్యం చేసిన అధికారులు ఇప్పుడు ప్రకటన జారీ చేసినప్పటికీ అడ్మిషన్లను మరింత ఆలస్యం చేసేందుకే రూల్స్‌ మార్చారని మండిపడుతున్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు సైతం తమకు ప్రత్యేకంగా సీట్లు సృష్టించాలని కోరుతున్నారు. నెట్‌/స్లెట్‌ అర్హత ఉందని, అందుకే సూపర్‌ న్యూమరరీ కింద సీట్లు కేటాయించాలని అడుగుతున్నారు.

కాకతీయ యూనివర్సిటీ ఇప్పటికే పీహెచ్‌డీ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసి వచ్చే నెలలో ఎగ్జామ్‌ పెట్టేందుకు రెడీ అవుతోంది. మరోవైపు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ కూడా ప్రవేశ ప్రకటనకు సంసిద్ధమవుతోంది. ప్రైవేట్‌ కాలేజీల్లో పనిచేసే అర్హులైన ప్రొఫెసర్లకు పీహెచ్‌డీ గైడ్‌షిప్‌ ఇవ్వాలని భావిస్తోంది. మొత్తమ్మీద ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.