Book Fair in Hyderabad: పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ అవకాశం రేపటి వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇది ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ కాదు. దీని పేరు వేరు. దీన్ని ‘కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్’ అని అంటారు. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ బుక్ ఫెయిర్ మొన్న గురువారమే ఓపెన్ అయింది. కాబట్టి రేపు ఆదివారం వరకే తెరిచి ఉంచుతారు. అందువల్ల పుస్తకాల పురుగులు త్వరపడటం మంచిది. లక్డీకపూల్‌లోని మారుతి గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్‌లో అన్ని రకాల పుస్తకాలు లభిస్తున్నాయి. రొమాన్స్ నుంచి ఫాంటసీ వరకు, నాన్ ఫిక్షన్ నుంచి క్రైమ్ మరియు చిల్డ్రన్ వరకు అన్ని విభాగాలకు సంబంధించినవి ఉన్నాయి.
మొత్తమ్మీద 10 లక్షలకు పైగా కొత్త, పాత పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు చెప్పారు. నటుడు, రచయిత దుర్జోయ్ దత్తా ఈ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ‘వెన్ అయామ్ విత్ యు’ అనే టైటిల్‌తో ఈయన ఓ బుక్ రాశారు. దానిపై సమీక్ష కోసం దుర్జోయ్ దత్తా హైదరాబాద్ వచ్చారు. ‘లోడ్ ది బాక్స్’ అనేది ఈ బుక్ ఫెయిర్ ప్రత్యేకతగా చెప్పారు. రూ.1100 నుంచి రూ.2750 వరకు విలువ చేసే మూడు రకాల బాక్సుల్లో దేన్నైనా కొని అందులో ఎన్ని పుస్తకాలు పడితే అన్ని తీసుకెళ్లొచ్చని చెప్పారు. పుస్తకాల రేటుతో సంబంధంలేదని తెలిపారు. తాను రాసిన పుస్తకం న్యూ-ఏజ్ రొమాన్స్‌కి సంబంధించిందని, అందులో లవ్, ఫ్రెండ్షిప్, హార్ట్‌బ్రేక్, ఎంట్రప్రెన్యూర్షిప్ తదితర అంశాలను టచ్ చేసినట్లు దుర్జోయ్ దత్తా పేర్కొన్నారు.
read also: Special Story on Zepto: పదే పది నిమిషాల్లో డోర్ డెలివరీ. చందమామ కథలాంటి Zepto సక్సెస్ స్టోరీ..
ఈ బుక్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సాగుతుందని వెల్లడించారు. ఇదిలాఉండగా హైదరాబాద్‌లో ‘కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్’ను నిర్వహించటం ఇది రెండోసారి అని కో-ఫౌండర్ రాహుల్ పాండే అన్నారు. బుక్ ఫెయిర్‌కి అద్భుతమైన స్పందన వస్తోందని, అన్ని వయసుల రీడర్లూ తమకు కావాల్సిన బుక్స్‌ని వెతుక్కునేందుకు గంటలకొద్దీ ఓపికతో ఫెయిర్‌లో తమ విలువైన సమయాన్ని గడుపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. మన దేశ ప్రజల్లో పుస్తక పఠనం పట్ల ఇంకా అమితాసక్తి నెలకొని ఉందనటానికి ఇది ప్రత్యేక్ష నిదర్శనమని, వాళ్లను చూస్తుంటే తనకు చాలా సంతోషం కలుగుతోందని రాహుల్ పాండే పేర్కొన్నారు.