NTV Telugu Site icon

Doctor Cheating: మ్యాట్రిమోనీలో కలిశాడు.. నట్టేట ముంచేశాడు

Lady Doctor Cheated By Matr

Lady Doctor Cheated By Matr

అతడు మ్యాట్రిమోనీలో కలిశాడు. తానో స్పెషలిస్ట్ డాక్టర్‌నని నమ్మించాడు. నిన్నే పెళ్లాడుతానని మాయమాటలు చెప్పాడు. ఇండియాలో ఒక పెద్ద ఆసుపత్రి కట్టబోతున్నట్టు బిల్డప్పులు ఇచ్చాడు. పాపం తోడు కోసమని మ్యాట్రిమోనీలో వెతికితే, అతడిచ్చిన బిల్డప్పులకి ఆ అమ్మాయి పడిపోయింది. అతడ్ని పూర్తిగా నమ్మింది. తాను వేసిన గాలంలో చేప చిక్కుకుందని భావించిన ఘరానా మోసగాడు, అదును చూసి రూ. 19 లక్షలు దోచేశాడు. అనంతరం పత్తా లేకుండా పోయాడు. చివరికి తాను మోసపోయానని గ్రహించిన అమ్మాయి, పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు కోవై పీలమేడు ప్రాంతానికి చెందిన మహిళ సైక్రియాటిస్ట్‌.. వరుని కోసమని మాట్రిమోని వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచింది. ఆమె డీటెయిల్స్ చూసిన ఓ యువకుడు.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తన పేరు యుసాన్ సియాన్ అని, నెదర్లాండులో తాను శస్త్ర చికిత్స విభాగంలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నానని తెలిపాడు. వైద్య వృత్తికి చెందినవాడే కావడంతో, ఆమె అతనికి ఆకర్షితులైంది. ఫోన్ నెంబర్లు మార్చుకొని, తరచూ మాట్లాడటం మొదలుపెట్టింది. అతనికి ఎంతలా ఎట్రాక్ట్ అయ్యిందంటే, పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. అతడు కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే.. ఇండియాలో తాను కోట్ల రూపాయలతో ఒక పెద్ద ఆసుపత్రి నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నానని, అందుకు సహకారం కావాలని కోరాడు. సహాయం చేయడానికి తాను సిద్ధమేనని చెప్పింది.

కట్ చేస్తే.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారి పేరుతో ఓ మహిళతో అతడు ఫోన్ చేయించాడు. యుసాన్‌ సియాన్‌ తన తల్లితో ఢిల్లీ వచ్చారని, ఆయన సెల్‌ఫోన్ మరమ్మత్తుకు గురైందని ఆమె డాక్టర్‌తో చెప్పింది. అతడు లక్ష యూరో డాలర్లు తీసుకొచ్చాడని, దాన్ని మార్చడానికి, అలాగే వారు నివాసం ఉండటానికి, ఇతర పన్నులు చెల్లించడానికి మొత్తం రూ. 19,59,920 కట్టాలని పేర్కొంది. యుసాన్‌ సియాన్‌ నేరుగా కలిసి ఆ నగదు తిరిగి ఇచ్చేస్తారని నమ్మబలికింది. ఎలాగో తనకు కాబోయే భర్తే కదా అని నమ్మి, ఆ మహిళ చెప్పినట్టు డబ్బు డిపాజిట్ చేసింది. అంతే.. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈమె యుసాన్‌కి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వైద్యురాలు.. సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.