Delhi: దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ నుంచి నిన్నటి ఉన్నావ్ ఘటన వరకు… రోజుకు వందలాది అత్యాచార ఘటనలు. నిద్ర లేచింది మొదలు పత్రికల్లో, మీడియాలో ఇవే ఉదంతాలు. పసిపిల్లలపైనా అమానుషం పెచ్చరిల్లిపోవడం చూసి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోక తప్పడం లేదు. దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. ఢిల్లీలోని రైల్వేస్టేషన్‌లో 30 ఏళ్ల మహిళపై నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం(ఈ నెల21) రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Kanwar Yatra: కన్వర్ యాత్రలో విషాదం.. ట్రక్కు ఢీకొని 6గురు మృతి
మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టింది రైల్వే ఉద్యోగులేనని పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి 8 నుంచి 9 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లోని ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సిబ్బంది గుడిసెలో 30 ఏళ్ల బాధితురాలు అత్యాచారానికి గురైందని తెలుసుకున్నారు. నలుగురు నిందితులు ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో రైల్వే ఉద్యోగులు అని.. వారిని అరెస్ట్ చేశామని రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌కు చెందిన బాధితురాలికి అత్యాచారం చేసిన వారిలో ఒకరితో పరిచయం ఉన్నట్లు తెలిసింది. కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న ఆ మహిళకు.. నిందితుడు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపాడు. ఈ నేపథ్యంలోనే జులై 21న తన కుమారుడి పుట్టినరోజుకు ఆమెను ఆహ్వానించిన నిందితుడు.. రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి మరికొందరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బెదిరించి పంపించినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు వివరించింది. అధికారులు దీనిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.