Woman Boyfriend Killed Her Husband In Karnataka: భర్త తనని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో.. భార్య ప్రియుడి వద్ద తన గోడు వెళ్లబోసుకుంది. దాంతో అతగాడు బైక్ రిపేరీ పేరిట పిలిపించి, దారుణంగా ఆమె భర్తని హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కృష్ణరాజపురంలోని మహాదేవపుర కాడుగోడిలో ఉదయ్ కుమార్ (40), ప్రియా నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఉదయ్ బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత భర్త మద్యానికి బానిస అయ్యాక కష్టాలు మొదలయ్యాయి. ఉదయ్ నిత్యం తాగొచ్చి, తన భార్యని వేధించసాగాడు. తాగుడు మానుకోవాలని ఎంత వేడుకున్నా.. ఉదయ్‌లో మార్పు రాలేదు. ఈ బాధలన్నింటిని.. ఇంటి పక్కనే ఉన్న అన్వర్ అనే యువకుడికి చెప్పుకునేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తాను పెళ్లి కూడా చేసుకుంటానని ప్రియాకు మాటిచ్చాడు. కానీ.. ప్రియా పెళ్లికి నిరాకరించింది. సాన్నిహిత్యం మాత్రం కొనసాగించింది.
Kejriwal : అందుకే పీఎం చదువుకున్న వాడై ఉండాలనేది : కేజ్రీవాల్
కట్ చేస్తే.. గురువారం రాత్రి కూడా ఉదయ్ ఫుల్లుగా తాగొచ్చాడు. భార్యతో గొడవ పట్టాడు. ఆమెపై చెయ్యి కూడా చేసుకున్నాడు. ఎప్పట్లాగే.. ఈ గొడవ గురించి అన్వర్‌కు చెప్పింది ప్రియా. దాంతో.. అన్వర్ రగిలిపోయాడు. తన ప్రియురాల్ని ఉదయ్ పెడుతున్న వేధింపుల్ని చూసి భరించలేకపోయాడు. అప్పుడు అతని అడ్డు తొలగించాలని అన్వర్ పథకం వేశాడు. తన బైక్ రిపేరీ ఉందని ఉదయ్‌కు అన్వర్ ఫోన్ చేసి చెప్పాడు. తాను కాడుగోడి శివాలయం వద్ద ఉన్నానని మెసేజ్ చేశాడు. అప్పటికే రాత్రి అయినా, తెలిసినవాడే కదా అని బైక్ రిపేరీ చేసేందుకు ఉదయ్ అక్కడికి చేరుకున్నాడు. ఉదయ్ అక్కడికి రాగానే.. ‘భార్యని ఎందుకు వేధిస్తున్నావ్’ అంటూ అన్వర్ ప్రశ్నించాడు. ఇది నీకు సంబంధం లేని విషయమని, నువ్వు జోక్యం చేసుకోవద్దని ఉదయ్ గట్టిగా స్పందించాడు. ఈ క్రమంలో ఇద్దరికి గొడవ జరిగింది. అన్వర్ తన వద్ద ఉన్న కత్తి తీసుకొని, ఉదయ్ పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, వెంటనే అన్వర్‌కు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక భార్య హస్తం కూడా ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
