NTV Telugu Site icon

UP: యూపీలో మరో దారుణం.. ప్రియుడి కోసం పెళ్లైన 2 వారాలకే భర్తను చంపిన నవ వధువు

Upmurder

Upmurder

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ హత్య మరువక ముందే మరో ఘోరం వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి సౌరబ్‌ను భార్య హత్య చేయగా.. తాజాగా ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను చంపింది ఓ నవ వధువు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాకు చెందిన ప్రగతి యాదవ్(22)-అనురాగ్ యాదవ్ ప్రేమికులు. గత నాలుగేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లిని యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో మార్చి 5న ప్రగతి యాదవ్‌కు దిలీప్ (25) అనే యువకుడితో బలవంతంగా వివాహం చేశారు. అయితే ఈ పెళ్లిని ప్రగతి ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయింది. ఇక ప్రియుడితో ఎడబాటును ఏ మాత్రం సహించలేకపోయింది. అంతే ప్రియుడు అనురాగ్ యాదవ్‌తో కలిసి కుట్ర పన్నింది. స్కెచ్‌లో భాగంగా దిలీప్‌ను చంపేందుకు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నారు.

ఇది కూడా చదవండి: MLAs Defection Case: పార్టీ ఫిరాయింపుల కేసు.. సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన స్పీకర్..

మార్చి 19న పొలంలో దిలీప్ బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. చికిత్స కోసం బిధునాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో దిలీప్‌ను సైఫాయి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు తరలించారు. తిరిగి మార్చి 20న ఔరయ్యలోని ఆస్పత్రికి తరలించారు. ఒక్కరోజు అనంతరం దిలీప్ ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు.

అయితే ఈ ఘటనపై దిలీప్ సోదరుడు సహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్లయ్యాక.. ప్రగతి.. ప్రియుడిని కలుసుకోలేకపోవడంతో భర్తను చంపాలని నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. దిలీప్‌ను హత్య చేసేందుకు రామాజీ చౌదరిని కాంట్రాక్ట్ కిల్లర్‌గా నియమించుకున్నారని.. ఇందుకోసం రూ.2లక్షలు సుఫారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. రామాజీ.. మరికొందరితో కలిసి దిలీప్‌ను పొలాలకు తీసుకెళ్లి.. అక్కడ బాధితుడిని కొట్టి కాల్చేశారన్నారు. వెంటనే నిందితులు అక్కడ నుంచి పారిపోయారని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, నాలుగు లైవ్ కార్ట్రిడ్జ్‌లు, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక పర్సు, ఆధార్ కార్డు, రూ.3,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల కోసం కూడా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రగతి యాదవ్, అనురాగ్ యాదవ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి: MMTS Incident: ఎంఎంటీఎస్‌లో లైంగిక దాడికి యత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు…