Vijayawada: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో టికెట్ల గోల్‌మాల్ కలకలం రేపుతోంది. అమ్మవారి ఆదాయానికి గండి కొడుతూ, భక్తులను మోసం చేస్తున్న అక్రమార్కుల గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి రెండు పెద్ద ఘటనలు వెలుగుచూడటంతో ఆలయ ఈవో శీనా నాయక్ సీరియస్ అయ్యారు. ఈవో ఫిర్యాదు మేరకు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు (FIR) నమోదు చేశారు.
తాజాగా నిన్న ఆలయంలో టికెట్ల పంచింగ్ దగ్గర పెద్ద మోసం వెలుగుచూసింది. రూ. 100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో వాటిని పంచింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే, అక్కడ విధుల్లో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చింతాడ సాయి, మరో మహిళా ఉద్యోగి కలిసి సుమారు 70 నుంచి 80 టికెట్లను పంచింగ్ చేయకుండా దాచిపెట్టారు. ఈ టికెట్లను మళ్లీ అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనేది వీరి ప్లాన్. దీనిని గమనించిన ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు వెంటనే అలర్ట్ అయి, ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తనిఖీ చేయగా పంచింగ్ చేయని టికెట్లు బయటపడ్డాయి. వెంటనే ఈ సమాచారాన్ని ఈవోకు చేరవేయగా.. టెంపుల్ పోలీస్ సిబ్బంది నరసింహారావు, జగదీష్‌లు నిందితులను పట్టుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఈవో శీనా నాయక్ ఆ ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇలాగే ఈ నెల 14వ తేదీన కూడా ఆలయంలో అనధికార దర్శనాలు చేయిస్తున్న దళారీ గుట్టు రట్టయింది. గతంలో దుర్గమ్మ ఆలయంలో హోంగార్డ్‌గా పనిచేసిన చంద్రశేఖర్ అనే వ్యక్తి.. దళారీగా మారి భక్తులను నిలువునా ముంచాడు. ఏకంగా 50 మంది భక్తుల దగ్గర తలా రూ. 500 చొప్పున మొత్తం రూ. 25,000 వసూలు చేసి అక్రమంగా దర్శనాలు చేయిస్తుండగా ఈవో శీనా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి అతడిని పట్టుకున్నారు. ఈవో ఫిర్యాదుతో స్పందించిన సీపీ రాజశేఖర్ బాబు.. హోంగార్డ్ చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. గతంలో కూడా అమ్మవారి ఆలయంలో నకిలీ రూ. 500 టికెట్ల వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే అప్పట్లో నిందితులపై అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేశారని, ఆ ఉదాసీనత వల్లే ఇప్పుడు సిబ్బంది, దళారీలు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని భక్తులు, స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఆలయ పవిత్రతను కాపాడాలని వారు కోరుతున్నారు.

