Site icon NTV Telugu

Vijayalakshmi Murder: నరరూప రాక్షసుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..

Vijayalakshmi Murder

Vijayalakshmi Murder

Vijayalakshmi Murder: వరసకు పిన్ని అయ్యే వృద్ధురాలిని కన్న కొడుకుతో కలిసి అత్యంత దారుణంగా హత్యకు పాల్పడిన నరరూప రాక్షసుడిని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఊర్మిళ నగర్‌కు చెందిన పొత్తూరి విజయలక్ష్మి హత్య కేసులో మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత దారుణ హత్యను గుర్తించారు.

READ ALSO: Drugs : మరో పెద్ద నెట్‌వర్క్‌ను చేధించిన తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌

విజయవాడ భవానీపురం ఊర్మిళా నగర్‌లో పొత్తూరి విజయలక్ష్మి కుమారుడితో కలిసి ఉంటోంది. ఆమె భర్త పిచ్చయ్య ఆరేళ్ల క్రితం చనిపోయారు. గతనెల 30న చిట్టినగర్ లోని వాసవి కల్యాణమండపంలో జరిగిన పెళ్లికి వెళ్లిన విజయలక్ష్మి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో విజయలక్ష్మి కుమారుడు రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రవి ఫిర్యాదుపై పోలీసులు విజయలక్ష్మి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో విజయలక్ష్మి దారుణ హత్యకు గురైనట్టు గుర్తించారు. విజయలక్ష్మిని చంపి ముక్కలు ముక్కలుగా నరికి విజయవాడలో వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. విజయలక్ష్మి తల మొండెం ఒక చోట, కాళ్లు, చేతులు మరోచోట మురుగు కాల్వ లో సంచుల్లో దొరికాయని చెబుతున్నారు పోలీసులు…

విచారణలో విజయలక్ష్మి సోదరి కుమారుడు హనుమాన్ సుబ్రహ్మణ్యం, అతని కుమారుడు ఆమెను హత్య చేసినట్టు గుర్తించారు. సెప్టెంబర్ 30న భవానీపురం హెచ్బీ కాలనీలో తమ ఇంటికి తీసుకెళ్లి అమెను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. పక్కా ప్రణాళికతోనే ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది… విజయలక్ష్మిని కళ్యాణమండపం నుంచి సుబ్రహ్మణ్యం కుమారుడు ద్విచక్రవాహనంపై HB కాలనీలోని ఇంటికి తీసుకెళ్లాడు. వెంటనే సుబ్రహ్మణ్యం మత్తుమందును ఆమె ముఖానికి అద్ది, మత్తులోకి జారుకోగానే పీకకోసి చంపేశాడు. అపై మామిడికాయలు సరికే కత్తితో శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఈ హత్యకు సుబ్రహ్మణ్యం కుమారుడు సహకరించాడు. శరీరభాగాలను సంచుల్లో వేసుకుని బైక్ పై బొమ్మసానినగర్‌లోని పరిసర ప్రాంతాల్లో పడేసి ఇంటికి తాళం వేసి పారిపోయారు. స్థానికంగా ఉన్న 900 cc కెమెరాలు పరిశీలించి నిందితులను పోలీసులు పట్టుకోగలిగారు…

భార్య తనను విడిచి వెళ్లిందనే కోపంతో పాటు బంగారం దక్కక పోవటం, తనను మేనమామ ఇంటినుంచి వెళ్లగొట్టడానికి కారణం తన పిన్ని విజయలక్ష్మి అని సుబ్రహ్మణ్యం బలంగా నమ్మి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అందుకే ఆమెను అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సుబ్రహ్మణ్యం భార్య 10 ఏళ్ల కిందట అతడిని విడిచి వెళ్లి పోయింది. ఆ సమయంలో 650 గ్రాముల బంగారం తీసుకెళ్లింది. అప్పట్లో సుబ్రహ్మణ్యం భార్యకు విజయలక్ష్మి వత్తాసు పలికారు. బంగారం తనదేనని సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇటీవల ఆ కేసును కోర్టు కొట్టేసింది. మేనమామ రాంబాబు వద్ద సుబ్రహ్మణ్యం పనిచేస్తూ Hb కాలనీలోని ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇల్లు తనదేనని సుబ్రహ్మణ్యం చెబుతున్నాడని రాంబాబుకు ఇటీవల విజయలక్ష్మి చెప్పారు. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని రాంబాబు హెచ్చరించారు. ఈ గొడవలన్నింటికీ విజయలక్ష్మి కారణమని నమ్మిన సుబ్రహ్మణ్యం ఆమెను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు..

READ ALSO: Hyderabad Fraud: కిలాడీ లేడీ.. నమ్మితే నట్టేట ముంచింది!

Exit mobile version