UP News: ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కూతురు, తన ప్రియుడితో లేచిపోయింది. ఈ సంఘటనతో అవమాన భారంతో తల్లి మరణించింది. ఈ ఘటన తర్వాత తండ్రి తన బతికున్న కూతుుకు అంత్యక్రియలు నిర్వహించారు. తన ఆస్తిలో కుమార్తెకు వాటా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాడు. కౌశాంబి జిల్లాలోని సందీపన్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురత్గంజ్–పల్హానా రోడ్డు సమీపంలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజు గుప్తా అనే వ్యక్తికి 19 ఏళ్ల ఒక్కగానొక్క కుమార్తె ఉంది. ఆమె ఇంటర్మీడియట్ చదువుతోంది. నవంబర్ 25న ఆమెకు పెళ్లి కావాల్సి ఉంది. పెళ్లికి పనులు జరుగుతున్న సమయంలో కాలేజీకి వెళ్తానని అక్టోబర్ 15న వెళ్లిన కుమార్తె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా ధన్నీ గ్రామానికి చెందిన తన ప్రియుడు అమర్దీప్ రైదాస్తో పారిపోయినట్లు తెలిసింది. గతంలో రెండుసార్లు వేరే వ్యక్తులతో నిశ్చితార్థం అయినప్పటికీ అవి క్యాన్సిల్ అయ్యాయి. నెల రోజుల క్రితం ఫతేపూర్ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. నవంబర్ 25న వివాహం జరిపించే ముందే ప్రియుడితో పారిపోయింది.
ఈ పరిణామంతో తీవ్ర మనోవేదనకు గురైన 40 ఏళ్ల తల్లి పార్వతి చనిపోయింది. ఓ వైపు కూతురు ప్రియుడితో వెళ్లిపోవడం, మరోవైపు కట్టుకున్న భార్య చనిపోవడంతో రాజుగుప్తా కుంగిపోయారు. చివరకు తల్లి అంత్యక్రియల విషయాన్ని కుమార్తెకు పోలీసులు చెప్పినా ఆమె రావడానికి నిరాకరించింది. తాను తన ఇష్టపూర్వకంగానే ప్రియుడితో వెళ్లిపోయినట్లు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది.
ఈ వరస ఎదురుదెబ్బలతో రాజు గుప్తా తన భార్యతో పాటు బతికున్న కుమార్తెకు కూడా పిండప్రదానం చేసి, పదమూడో రోజు కర్మకాండలను కూడా నిర్వహించారు. తన కుమార్తె వల్లే తన భార్య మరణించిందని ఆయన ఆరోపించారు. తన ఆస్తుల్లో చిల్లిగవ్వ కూడా ఇవ్వనని స్పష్టం చేశారు.

