NTV Telugu Site icon

Murders: మూడు దారుణ హత్యలు.. లవర్స్ కోసం భర్తలను చంపిన కిల్లర్ భార్యలు..

Murder Case

Murder Case

సౌరభ్ హత్య కేసుతో పాటు ఔరయ్య, బెంగళూరు హత్యలు కూడా దేశంలో చర్చనీయాంశమవుతున్నాయి. మూడు కేసుల్లోనూ హత్యల సరళి దాదాపు ఒకేలా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సౌరభ్ భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్‌తో కలిసి అతన్ని హత్య చేశారు. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యలో వివాహం అయిన 15 రోజులకే తన భర్త దిలీప్‌ను హత్య చేయడానికి ప్రగతి కుట్ర పన్నింది. బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కూడా ఇలాంటిదే. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందులో రెండు ప్రేమ వివాహాలు ఉన్నాయి. మూడు హత్యల కథను వివరంగా తెలుసుకుందాం…

 

 

ప్రియుడి సాయంతో భర్తను 15 ముక్కలుగా నరికి..
ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలసి మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఓ ప్లాస్టిక్‌ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. సౌరభ్‌ రాజ్‌పుత్‌(29), ముస్కాన్‌(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరభ్‌ మర్చంట్‌ నేవీలో పనిచేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్‌కు సాహిల్‌(25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌరభ్‌ ఉద్యోగం మానేసి లండన్‌కు వెళ్లి ఓ బేకరీలో పనిచేసేవాడు. గత నెల 24న భార్య పుట్టినరోజు కోసం అతడు లండన్‌ నుంచి వచ్చాడు. ఈ నెల 4న సౌరభ్‌కు మత్తు మందు ఇచ్చిన నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సౌరభ్‌ కనిపించడం లేదని అతడి తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించడంతో హత్య విషయం బయటపడింది. నిందితులిద్దరినీ గత బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

 

 

వివాహం జరిగిన 15 రోజులకే భర్తను హత్య చేసిన భార్య..
పెళ్లయిన 15 రోజులకే భర్తను దారుణంగా హత్య చేయించింది. పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 19న ఓ వ్యక్తి పొలంలో గాయాలతో పడి ఉన్నాడని సహారా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసు దర్యాప్తులో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో కలిసి మృతుడి భార్యే ఈ హత్యకు కుట్ర పన్నిందని పోలీసులు గుర్తించారు. మృతుడు దీలీప్ వృత్తి రిత్యా డ్రైవర్ గా పని చేసేవాడు. అతడికి మార్చి 5న ప్రగతి అనే యువతితో వివాహం జరిగింది. అయితే ప్రగతి అదే గ్రామానికి చెందిన అనురాగ్ యాదవ్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఈ పెళ్లి కూడా తనకు ఇష్టం లేకుండానే జరిగింది. దిలీప్ తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని, భర్తను వదిలించుకునేందుకు భార్య ప్రగతి ప్రియుడుతో కలిసి కుట్ర పన్నారు. భర్తను చంపించేందుకు బబ్లూ యాదవ్ అనే వ్యక్తితో రూ.2 లక్షలకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. దిలీప్ కు మాయమాటలు చెప్పి పోలాల వైపు తీసుకెళ్లి, అతడిపై దాడి చేశారు. తర్వాత తుపాకీతో కాల్చి చంపి, పారిపోయారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కాంట్రాక్టు హంతకుడు, మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ అధికారి చెప్పారు.

 

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య..
బెంగళూరులో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, అత్త కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి లోక్‌నాథ్ సింగ్ (37) వివాహేతర సంబంధాలు, చట్టవిరుద్ధమైన వ్యాపారాలే ఈ హత్యకు దారితీసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం… లోక్‌నాథ్ సింగ్ భార్యకు అతడి వివాహేతర సంబంధాలు, చట్టవిరుద్ధమైన వ్యాపారాల గురించి తెలియడంతో చంపడానికి పథకం వేశారు. మొదట అతడికి నిద్రమాత్రలు కలిపిన ఆహారం ఇచ్చి, మత్తులో ఉండగా కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు. రెండేళ్లు ప్రేమలో ఉన్న లోక్‌నాథ్, ఆమె గత డిసెంబర్‌లో కునిగల్‌లో వివాహం చేసుకున్నారు. వారిద్దరి మధ్య వయసులో తేడా ఉండటంతో లోక్‌నాథ్ కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. కానీ, ఇరు కుటుంబాలకు ఈ పెళ్లి విషయం తెలియలేదు. పెళ్లైన వెంటనే లోక్‌నాథ్ తన భార్యను ఆమె తల్లిదండ్రుల ఇంటి వద్ద వదిలిపెట్టాడు. రెండు వారాల కిందటే ఆమె కుటుంబ సభ్యులకు ఈ పెళ్లి గురించి తెలిసింది. ఇదే సమయంలోనే లోక్‌నాథ్ పలువురి మహిళలతో సంబంధాలు, చట్టవిరుద్ధమైన వ్యాపారాల గురించి కూడా భార్యకు తెలియడంతో ఈ హత్యకు ఒడిగట్టింది.