2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. 2025 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశమంతా సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది కొన్ని క్రైమ్ సీన్లు దేశాన్ని కుదిపేశాయి. కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు దగ్గర నుంచి.. కర్ణాటక రేణుకాస్వామి మర్డర్ వరకు.. పూణె కారు యాక్సిడెంట్ దగ్గర నుంచి ముంబైలో రాజకీయ హత్య వరకు.. ఇలా ఎన్నో ఘటనలు దేశాన్ని షేక్ చేశాయి. అయితే ఈ ఏడాదిలో జరిగిన క్రైమ్ సంఘటనలను రివైండ్ చేసుకుందాం.
నేరాల్లో భారతదేశం 79వ స్థానంలో ఉన్నట్లుగా తాజా గణాంకాల్లో తేలింది. 197 దేశాల్లో సర్వే చేయగా.. భారతదేశం 79వ స్థానంలో ఉన్నట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ తెలిపింది. దేశంలో హింసాత్మక నేరాలు, మహిళలపై నేరాల తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. దోషులకు కఠిన శిక్షలు వేగవంతం చేసేందుకు నిర్భయ చట్టం తీసుకొచ్చి దశాబ్ద కాలం గడిచినా నేరాల్లో మార్పు రాలేదని తెలిపింది. ఇప్పటికీ మహిళలకు భద్రత లేదని.. అనేక రకాల బెదిరింపులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.
1. ఆర్‌జీ కర్ వైద్యురాలి హత్య కేసు:
కోల్‌కతా ఆర్‌జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. వైద్యురాలి హత్యాచార కేసును నిరసిస్తూ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరిగాయి. ఆగస్టు 9న డ్యూటీలో ఉన్న ట్రైనీ డాక్టర్‌ను సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి చంపేశాడు. సెమినార్ హాల్‌లో నిద్రిస్తున్న డాక్టర్‌ను రేప్ చేసి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వైద్యులు విధులు బహిష్కరించి నెలల పాటు నిరసనలు తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి శాంతింప జేశారు.
2. రేణుకాస్వామి హత్య:
ఇక కర్ణాటకలో జరిగిన రేణుకాస్వామి హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. అభిమానుడైన రేణుకాస్వామిని నటుడు దర్శన్.. అతడి ప్రియురాలి పవిత్రాగౌడ్ చంపడంతో రేణుకాస్వామి ప్రాణాలు పోయాయి. జూన్ 8న బెంగళూరులోని సుమనహళ్లి బ్రిడ్జి దగ్గర 33 ఏళ్ల రేణుకాస్వామి మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జూన్ 11న దర్శన్, పవిత్రాగౌడ్, మిగతా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నవంబర్‌లో 1,300 పేజీల అనుబంధ ఛార్జ్‌షీటును పోలీసులు కోర్టులో దాఖలు చేశారు. అసభ్యకరమైన సందేశాలు పంపించాడన్న కారణంతో రేణుకాస్వామిని చంపేశారు. ఇక ఆరు నెలల తర్వాత డిసెంబర్ 13న దర్శన్, పవిత్రకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
3. బాబా సిద్ధిఖీ హత్య
ఇక ముంబైలో ప్రముఖ రాజకీయ నాయుడు, ఎస్పీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం సృష్టించింది. అక్టోబర్ 12, 2024న ముంబైలో బాబా సిద్ధిఖీ (66) హత్యకు గురయ్యారు. ఛాతీలోకి బుల్లెట్లు దిగడంతో ప్రాణాలు పోయాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చంపినట్లుగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇక సిద్ధిఖీతో బాలీవుడ్ ప్రముఖలు, రాజకీయ నాయకులు మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
4. పూణె యాక్సిండ్
ఇక మే 19న పూణెలో జరిగిన కారు ప్రమాదం కూడా జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మద్యం మత్తులో మైనర్లు కారు నడిపి ఇద్దరు టెకీ ఉద్యోగుల మరణానికి కారణమయ్యారు. అయితే ప్రమాదం తర్వాత నిందితులకు గంటల వ్యవధిలో బెయిల్ మంజూరు కావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో తప్పుడు నివేదికలు ఇచ్చిన డాక్టర్లపై కూడా చర్యలు తీసుకున్నారు.
5. బెంగళూరు ఫ్రిజ్ హత్య
2024లో జరిగిన అత్యంత క్రూరమైన హత్యలో బెంగళూరు మహిళ (29) హత్య. 50 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టి ప్రియుడు పరారయ్యాడు. బెంగళూరులోని మల్లేశ్వరంలోని ఫ్లాట్‌లో సెప్టెంబర్ 21న మహాలక్ష్మీ మృతదేహాన్ని వెలికితీశారు. ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ రాయ్ ఒడిశాలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహాలక్ష్మీ భర్త నుంచి విడిపోయి ముక్తి రంజన్‌తో ప్రేమాయణం సాగించింది. వీరిద్దరి మధ్య నిత్యం గొడవలు జరగడంతో మహాలక్ష్మీని ప్రియుడు చంపేసి.. శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి పరారయ్యాడు. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు.. ముక్తి రంజన్‌రాయ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు విచారణలో తేలింది.
6. ఢిల్లీ ట్రిపుల్ మర్డర్
ఇక డిసెంబర్ 6న దక్షిణ ఢిల్లీలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కూడా దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, కుమార్తె హత్యకు గురయ్యారు. అది కూడా వివాహ వార్షికోత్సవం రోజే మర్డర్‌కు గురయ్యారు. ఈ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. కన్న కొడుకే ఈ నేరానికి పాల్పడినట్లుగా తేలింది. కొన్ని గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు.