Cheating: కేటుగాళ్లు కంత్రీ స్కెచ్.. ‘తల్లికి వందనం’ డబ్బులు బురిడీ

Cheating

Cheating

అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు కొంత మంది కేటుగాళ్లు.. ప్రభుత్వ పథకాలను ఎంచుకుంటున్నారు. పేద వర్గాలకు ప్రభుత్వం ఇచ్చే స్కీమ్‌లను స్కామ్‌‌లుగా మార్చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రెండు వేర్వేరు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కామారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ డబ్బుల కోసం నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. మరోవైపు కర్నూలు జిల్లాలో తల్లికి వందనం డబ్బులను ఆన్‌లైన్‌లోనే కొట్టేశారు కేటుగాళ్లు. దీంతో ఈ రెండు ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

పేద ప్రజలకు ఆర్దిక భరోసా కల్పించేందుకు.. ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించారు. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తీగ లాగితే.. స్కీమ్‌ను ఆసరాగా చేసుకుని స్కామ్ చేసిన ముఠా బాగోతం బయటపడింది. దీంతో నకిలీ ధృవపత్రాలతో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్‌కు దరఖాస్తులు చేస్తూ.. ప్రభుత్వ ఖజానా కొల్లగొడుతున్న ముఠాను పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి ఫోర్జరీ చేసిన గెజిటెడ్ సంతకాల దరఖాస్తులు, నకిలీ స్టాంపులు, స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటి వరకు 52 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తులను ఆన్‌లైన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో ఇప్పటి వరకు 34 మందికి ఇప్పటికే చెక్కులు సైతం వచ్చినట్లు తేల్చారు. మరో 18 ఫైళ్లు ప్రాసెస్‌లో ఉన్నట్లు తేల్చారు. 52 మంది లబ్దిదారుల వివరాలను సేకరిస్తున్నారు. నకిలీ గెజిటెడ్ సంతకానికి రూ.5 వేల చొప్పున వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు కామారెడ్డి పోలీసులు.

కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన రాజా నరేందర్, రాజలింగం.. జిరాక్స్, ఆన్ లైన్ సెంటర్ నిర్వహిస్తారు. ఈ ఇద్దరికి జిల్లా ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసే ప్రసాద్ తోడై.. ఓ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ సమయంలో అడ్డదారిలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. గెజిటెడ్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి .. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తులు చేస్తున్నారు. ఒక్కొ దరఖాస్తుకు 4 నుంచి 5 వేల వరకు వసూలు చేశారు.

నాలుగు రోజుల క్రితం తన సంతకం ఫోర్జరీ అయిందని ..జిల్లా ఆసుపత్రి RMO సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు తీగ లాగితే.. ఈ ముఠా డొంక కదిలింది. నిందితులు ముందుగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి వివాహ పత్రికలు ఆధార్ కార్డులు, కుల, ఆదాయ నివాస ఇతర ధృవీకరణ పత్రాలు సేకరించే వారు. ప్రతీ దరఖాస్తుకు 4 నుంచి 5 వేల వవరకు వసూలు చేస్తూ.. గెజిటెడ్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ.. ఆన్ లైన్ చేసే వారు. అవసరమైతే ఇతర పత్రాలను సైతం నకిలీవి సృష్టించే వారు. ఇందుకోసం జీరాక్స్ సెంటర్, కంప్యూటర్, నకిలీ రబ్బర్ స్టాంపులు, స్టాంప్ డ్యూటీ పేపర్లు సిద్దంగా ఉంచుకునే వారు. నకిలీ పత్రాలతో, ఫోర్జరీ సంతకాలతో .. ఒక్క భిక్కనూరులో సుమారు 52 మందికి కల్యాణ లక్ష్మికి దరఖాస్తులు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రభుత్వానికి ఎంత ఆర్థిక నష్టం చేశారు? ఈ అక్రమాల్లో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్రీగా ఇస్తామంటే ఎవరు మాత్రం కాదంటారు.. ఫ్రీ సిమ్.. ఆ తర్వాత ఫ్రీగా వచ్చే ఇంటర్నెట్ డేటా.. ఇంకేముంది పంటపండింది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే.. 3 నెలల తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన తల్లికి వందనం స్కీమ్ డబ్బులను కొట్టేశారు కేటుగాళ్లు. అప్పుడు దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయింది ఫ్రీ సిమ్ తీసుకున్న వారి పరిస్థితి.

కర్నూలు పాతబస్తీలో ఎయిర్‌టెల్ కంపెనీ ప్రతినిధులమని ఇంటింటికి వెళ్లారు. ఉచితంగా ఎయిర్ టెల్ సిమ్‌లు ఇస్తామని, ఫ్రీ ఇంటర్నెట్ డేటా కూడా వస్తుందని ఆశచూపారు. ఆ సందర్భంలో సిమ్ కార్డు తీసుకున్న వారి నుంచి బయోమెట్రిక్ తీసుకున్నారు. ఇదంతా మూడు నెలల క్రితం మాట. కొందరు ఆ సిమ్ కార్డు వాడుకున్నారు. అయిపోగానే కొందరు పక్కన పడేశారు. ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు వారి ఖాతాల్లో వేశారు. అయితే ఈ ఉచిత సిమ్‌లు తీసుకున్న వారి ఖాతాలు ఖాళీ అయ్యాయి. లబ్ధిదారులు తమకు తల్లికి వందనం డబ్బులు రాలేదని సచివాలయాలను సంప్రదిస్తే డబ్బుకు ఖాతాలో పడ్డాయని సమాధానం వచ్చింది. ఇలా ఒక్కొక్క లబ్ధిదారుని ఖాతా నుంచి 26 వేలు, 39 వేలు చొప్పున లక్షల రూపాయలు ఖాతాల నుంచి కొట్టేశారు. బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే సుమారు 20 మంది లబ్ధిదారులు పోలీసులను ఆశ్రయించారు.

ఉపేంద్ర అనే వ్యక్తి తను ఎయిర్‌టెల్‌లో పనిచేస్తానని ఉచితంగా సిమ్ కార్డులు ఇస్తామని పాతబస్తీలో పలు వీధుల్లో తిరిగాడు. కొందరు ఫ్రీగా వచ్చేదే కదా అని సిమ్ కార్డు తీసేసుకున్నారు. కొందరు వద్దన్నా తన టార్గెట్ చేరుకొని జీతం రావాలంటే సిమ్ కార్డులు తీసుకోవాలని బ్రతిమలాడి సిమ్ కార్డులు ఇచ్చాడు. సిమ్ కార్డులు ఇచ్చే సమయంలో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు ఖాతా కూడా లబ్ధిదారుల అనుమతి లేకుండా చేశాడు. ఆ సందర్భంలో బయోమెట్రిక్, ఐరిష్ స్కాన్ సేకరించారు. వాటి ద్వారా వారి ATM తీసుకున్నాడు. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు డైరెక్టుగా లబ్ధిదారులకు అందచేసేందుకు వీలుగా DBTకి లింక్ చేస్తారు. ఆ విధంగా ఎయిర్‌టెల్ పేమెంట్ డిజిటల్ బ్యాంకు చేసేందుకు రిజర్వు బ్యాంకు అవకాశం ఇచ్చింది. ఇదే అవకాశంగా ఉపేంద్ర , వీరారెడ్డి అనే వ్యక్తులు ఎయిర్‌టెల్ పేమెంట్ డిజిటల్ బ్యాంకుకు లింక్ చేయించి మోసపురితంగా లబ్ధిదారుల డబ్బులు కాజేశారు. వీరారెడ్డి ఎయిర్‌టెల్ పేమెంట్ డిజిటల్ బ్యాంకు సిస్టమ్‌కు ఇంచార్జిగా ఉన్నాడు. ఉపేంద్ర రెప్రెజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు.

తల్లికి వందనం డబ్బులు ఖాతాలో ఖాళీ అయ్యాయని కర్నూలు వన్ టౌన్ పీఎస్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. షేక్ ముంతాజ్, హసీనా, పర్వీన్ భాను, బేగం, పఠాన్ రేష్మ, షేక్ పర్వీన్, షేక్ షాజహాన్, షేక్ ముస్కాన్, షేక్ ఫాతిమా వంటి బాధితులు PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఉపేంద్ర, వీరారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు.