టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతరాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేక ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి మొత్తం 61 మంది నిందితులను అరెస్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి.. ఏకంగా 61 మంది సైబర్ క్రిమినల్స్ తాట తీశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసి వారిని పట్టుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన అంతరాష్ట్ర ఆపరేషన్‌లో ఎక్కువమంది సైబర్ క్రిమినల్స్ తమిళనాడు నుంచి పట్టుబడ్డారు. అక్కడ 20 మందిని పట్టుకున్నారు. గుజరాత్‌లో18, కర్ణాటకలో16, మహారాష్ట్రలో 13, ఢిల్లీలో 13, ఆంధ్రప్రదేశ్‌లో 7, పశ్చిమబెంగాల్‌లో 8 మంది ఉన్నారు. ఇక యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, అసోం, రాజస్థాన్, ఉత్తరాఖండ్ నుంచి కూడా నిందితులు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. నిందితుల నుంచి మొత్తం 50 మొబైల్ ఫోన్లు, 21 చెక్ బుక్స్, 12 పాస్‌బుక్స్, 51 ఏటీఎం కార్డులు, 7 ల్యాప్‌టాప్‌లు, 82 సిమ్ కార్డులు, నకిలీ కంపెనీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు…
నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా నిందితుల నుంచి వందలాది మోసాల మూలాలు, నిధులు, ఆధారాలు బయటపడ్డాయి. బాధితుల ఖాతాల్లోకి మొత్తం రూ. 1 కోటి 1 లక్షల 39 వేల 338 రూపాయలు తిరిగి జమ చేశారు. ఒక్క ఆగస్టు నెలలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు మొత్తం 338 ఫిర్యాదులు అందాయి. వాటిలో 233 కేసులు ప్రత్యేకంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయ్యాయి. మిగిలిన కేసులు జోనల్ సైబర్ సెల్స్‌కు పంపారు… నిందితులు విభిన్న రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీటిలో ట్రేడింగ్ మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్ స్కాంలు, లోన్ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరిట డబ్బులు వసూలు చేశారు. ఓటీపీ ఫ్రాడ్స్, జాబ్ స్కాంలు, బిజినెస్ ఫ్రాడ్స్, కాపీరైట్ ఉల్లంఘనలు వంటి కేసులు కూడా ఉన్నాయంటున్నారు పోలీసులు..
హైదరాబాద్ తార్నాకకు చెందిన 34 సంవత్సరాల మహిళకు NSE & Coin SSDCX అధికారులుగా నటించిన నిందితులు.. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి పెద్ద లాభాలు ఇప్పిస్తామని మోసం చేశారు. ప్రారంభంలో చిన్న మొత్తాల లాభాలు చూపించి నమ్మకం కలిగించారు. ఆపై మొత్తం రూ. 1.05 కోట్లు మెల్లగా వసూలు చేశారు. ఆన్‌లైన్ అకౌంట్‌లో 6 కోట్ల రూపాయలకు పైగా చూపించారు. కానీ ఒక్క రూపాయి కూడా ఆమెకు తిరిగి రాలేదు. ఈ మోసంలో చైనా జాతీయుడు చెన్ చెన్, మరికొంతమంది భారతీయ ముఠా సభ్యులు భాగస్వాములుగా ఉన్నారు. ఫింగర్ ప్రింట్ మెషీన్, స్కానర్, ATM కార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు…
మరో కేసులో 73 ఏళ్ల వృద్ధుడిని షేర్‌ఖాన్ అధికారి మంజోషి అంటూ వల వేసి.. ఫేక్ ట్రేడింగ్ యాప్, WhatsApp గ్రూప్ ద్వారా మోసం చేశారు. రూ. 22.5 లక్షలు ఆయన పెట్టుబడి పెట్టగా, దానికి ప్రతిఫలంగా రూ. 1.2 కోట్ల లాభం చూపిస్తూ, విత్‌డ్రా చేసేందుకు రూ. 77 లక్షలు అడిగారు. దీంతో తానే మోసపోయానని గ్రహించిన బాధితుడు.. 1930 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో నిందితులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్‌కు చెందినవారని పోలీసలు గుర్తించారు. కానీ అసలు ముఠా చైనాలో ఉన్నట్లు తేల్చారు.
మరో కేసులో బంజారాహిల్స్‌కు చెందిన రాధా చైతన్య అనే వ్యక్తికి వాట్సాప్‌లో వచ్చిన J Strategic Inventors అనే గ్రూప్ ద్వారా ఫేక్ షేర్ మార్కెట్ స్కాం జరిగింది. సుమారు 40,000 పెట్టుబడి పెట్టినా.. వెనక్కు ఒక్క రూపాయి రాలేదు. కాంటాక్ట్ చేసినా నంబర్లు స్విచ్చాఫ్ చేసేశారు. గ్రూప్‌లో ఇతర కస్టమర్లు కూడా నకిలీ వారేనని తర్వాత బాధితురాలు గ్రహించారు.. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వచ్చే నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను నమ్మవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. హెచ్‌ఆర్డీ, సీబీఐ, ఎన్‌ఐఏ, రిజర్వ్ బ్యాంక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేరుతో వచ్చే వీడియో కాల్స్, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులకు బలి కావొద్దని చెబుతున్నారు. ఆన్‌లైన్ మోసాలు జరిగితే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరుతున్నారు. లేదా cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చంటున్నారు పోలీసులు…
