హైదరాబాద్ సీపీఐ నాయకుడు చందు రాథోడ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆర్ధిక విభేదాలు, వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అటు మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులోనూ ఫుల్ ఆధారాలు సేకరించారు పోలీసులు. ఆయనకు సన్నిహతంగా ఉన్న వ్యక్తులే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు.
READ MORE: Murder : భార్యను చంపి అడవిలో పడేసిన భర్త!
ఈ నెల15న ఉదయం వాకింగ్‌కు వెళ్లిన చందు రాథోడ్‌పై నిందితులు కాల్పులు జరిపారు. ఒక్కసారిగా ఫైరింగ్ జరగడంతో శాలివాహన నగర్ పార్కులో కలకలం రేగింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు. వారిలో నలుగురిని అరెస్టు చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసులో దొంతి రాజేష్ అలియాస్ రాజన్న అలియాస్ కన్న ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అర్జున్ జ్ఞాన ప్రకాష్, లింగిబెడి రాంబాబు, కందుకూరి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుంభ ఏడుకొండలు, శ్రీను అలియాస్ నాగరాజు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు దొంతి రాజేష్‌కు చందు రాథోడ్ మధ్య అనేక ఆర్థిక, వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. 2022 జనవరిలో రాజన్న తన అనుచరులతో కలిసి హయత్‌నగర్ మండలం కుంట్లూరులో 100 ఎకరాల భూమిలో 1300 గుడిసెలు నిర్మించాడు. ఈ గుడిసెల నిర్మాణం కోసం చందు రాథోడ్, రాజన్న అనుచరులు నుంచి 13 లక్షల రూపాయలు వసూలు చేశారు. అయితే, చందు రాథోడ్ ఆ డబ్బును రాజన్నకు ఇవ్వకుండా పార్టీ పెద్దల ముందు రాజన్నను నిందించారు. చందు రాథోడ్, ఒక బిల్డర్ బాలారెడ్డికి, తన బావమరిదికి మధ్య ఉన్న 12 లక్షల రూపాయల వివాదాన్ని పరిష్కరించేందుకు డబ్బులు వసూలు చేశారు. అలాగే చందు రాథోడ్‌కు తన భార్యతో అక్రమ సంబంధం ఉందని రాజేష్ ఆరోపించారు. అంతేకాకుండా, చందు తన వ్యక్తిగత సంబంధాలను బహిర్గతం చేశాడని.. తన సొంత అనుచరులను ఉపయోగించి సీపీఐ-ఎంఎల్ లిబరేషన్ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయించాడని రాజేష్ ఆగ్రహంతో ఉన్నాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్నాడు. సుమారు 50 లక్షల రూపాయల ఆర్థిక నష్టంతో పాటు రాజకీయంగా అవమానానికి గురైన రాజేష్.. చందు రాథోడ్ నుంచి ప్రాణహాని ఉందని భావించి.. అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
READ MORE: Tirupati: భార్యను కిరాతకంగా హత్య చేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త.. కారణం ఏంటి..?
పక్కా ప్లాన్ ప్రకారం చందును హత్య చేయడానికి ఓ స్విఫ్ట్ కారు అద్దెకు తీసుకున్నారు. కొబ్బరి కటింగ్ కత్తులు, కారంపొడి, తుపాకులు సమకూర్చుకున్నారు. వాకింగ్ చేస్తున్న చందుపై కారంపొడి చల్లి అనంతరం కాల్పులు జరిపారు. నిందితులు వెంటనే స్విఫ్ట్ కారులో అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు నిర్వహించి, 3 కాల్చిన కాట్రిడ్జ్‌లు, 2 మిస్ ఫైర్ బుల్లెట్లు, 2 లెడ్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోస్ట్‌మార్టం సమయంలో మృతుడి శరీరం నుంచి 3 లెడ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక విశ్లేషణ, వేలిముద్రల ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. జూలై 18న ఎ4, ఎ5 నెల్లూరు వైపు పారిపోతుండగా కావలి వద్ద పట్టుకున్నారు. విచారణలో వారు నేరం అంగీకరించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో పలు దొంగతనాలు, దోపిడీల్లో తమ ప్రమేయాన్ని వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగిన ఒక భారీ ఇంటి దొంగతనంలో లూటీ చేసిన బంగారం, నగదు వారి స్వాధీనంలో ఉండటంతో దానిని స్వాధీనం చేసుకుని.. గాజువాక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. జూలై 19న ఎ1, ఎ6 లను జనగామ-వరంగల్ జిల్లా సరిహద్దుల్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పిస్టల్, రివాల్వర్, నాలుగు వాడిన రౌండ్లు, ఒక మిస్ ఫైర్ రౌండ్, ఒక లైవ్ రౌండ్ స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన స్విఫ్ట్ కారును జూలై 15న స్వాధీనం చేసుకున్నారు.. మరోవైపు మెదక్ జిల్లా వరిగుంతం వద్ద కారులో హత్యకు గురైన కాంగ్రెస్ నేత అనిల్ కేసు కూడా కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నెల 14న రాత్రి 8 గంటల సమయంలో అనిల్ కారుని అడ్డగించి గన్‌తో 4 రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేసి పారిపోయారు దుండగులు. ఈ హత్యపై పోలీసులకు అనిల్ తండ్రి ఫిర్యాదు చేశారు. హత్య జరిగిన రోజు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. ఈ కేసులో పూటకో ట్విస్ట్, రోజుకో మలుపు తిరుగుతుంది. అనిల్ హత్యకు మెదక్ జిల్లాలోని రంగంపేటలో ఓ ఇంటిస్థలం వివాదమే కారణమని పోలీసులు అంచనాకు వచ్చారు. కొన్ని రోజుల క్రితం ఇంటి స్థలం విషయంలో ఇంటి యజమానిని బెదిరించి ఇంట్లో కుటుంబ సభ్యులను అనిల్ దూషించినట్టు తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి ఆ వ్యక్తి అనిల్ పై కక్ష పెంచుకున్నాడు. ఓ సుపారీ బ్యాచ్‌తో అనిల్ హత్యకు ఒప్పందం కూడా కుదుర్చుకుని అనిల్‌తో మాత్రం స్నేహంగా ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే హత్యకు కొన్ని నిమిషాల ముందు వరకు అనిల్ కారులోనే సూత్రధారి ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. అంతే కాక అనిల్ హత్యలో కొందరు సొంత గ్రామస్తుల హస్తం ఉన్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
