Site icon NTV Telugu

AP Crime: భార్యపై అనుమానం.. వృద్ధుడి దారుణ హత్య.. నరికిన కాలు తీసుకొని ఎమ్మెల్యే ఇంటికి..!

Crime

Crime

AP Crime: వివాహేతర సంబంధాలు, అనుమానాలతో హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. దేశవ్యాప్తంగా ఈ ఘటనలు కలకలం రేపుతూనే ఉన్నాయి.. ప్రియుడితో కలిసి భర్తలను లేపేసే భార్యలు కొందరైతే.. అనుమానంతో.. భార్యలను మట్టుబెట్టే భర్తలు.. లేదా.. అనుమిస్తున్న వ్యక్తిపై దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా, కర్నూలు జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ వృద్ధున్ని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. కాలు నరికి బైక్ లో తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. నరికిన కాలు చేతిలో పట్టుకొని బైక్ పై వెళ్తున్న భయానక దృశ్యాలు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.

Read Also: Pakistan YouTube Ban: పాక్‌ న్యూస్‌ ఛానెల్స్‌, ఇన్‌స్టా ఖాతాలు భారత్‌లో తిరిగి ప్రత్యక్షం

పూర్తి వివరాల్లోకి వెళ్తే, కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లి లో శేషన్న(62) అనే వ్యక్తి దారుణంగా నరికి హత్య చేశారు. శేషన్న అనే వ్యక్తి ఇంట్లో ఉండగా మాట్లాడాలని వెళ్లిన నలుగురు వ్యక్తులు కర్రలు, వేటకొడవలితో దాడి చేశారు. వేటకొడవలితో రెండు కాళ్లు నరికేశారు. ఒక కాలు పూర్తిగా నరికి బైక్ లో తమ వెంట తీసుకువెళ్లారు నిందితులు. పరశురాముడు, మరో ముగ్గురు కలసి ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితులు పోలీసులకు లొంగిపోయారు. నిందితులు తమతోపాటు తెచ్చిన కాలును చూసి పోలీసులు విస్తుపోయారు. హత్యచేసిన నిందితులు నేరుగా ఎమ్మెల్యే దస్తగిరి ఇంటికి వెళ్లడంతో ఆందోళనకు గురైన ఎమ్మెల్యే నిందితులను పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని సూచించినట్టు సమాచారం.

Read Also: BJP: ఏడు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ.. లిస్ట్ ఇదే..

అయితే, సూదిరెడ్డిపల్లిలో నివాసముంటూ శేషన్న డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన పరశురాముడు, శేషన్న కుటుంబాల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. పరుశురాముని భార్యతో శేషన్నకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నారు. ఎలాగైనా శేషన్నను హత్య చేయాలని నిర్ణయించుకున్న పరశురాముడు.. ప్లాన్ ప్రకారం రాత్రి శేషన్న ఇంట్లో ఉండగా మరో ముగ్గురిని కలుపుకొని వారి ఇంటికి వెళ్లారు. శేషన్న మంచంపై పడుకొని ఉండగా వేటకొడవళ్ళు, కర్రలతో దాడి చేశారు. రెండు కాళ్ళు నరికివేశారు. ఒక కాలు పూర్తిగా నరికి చేతిలో పట్టుకొని బైక్ లో వెళ్లిపోయారు. ముందుగా గ్రామంలో తిరిగి ఆ తరువాత ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఇంటికి వెళ్లారు. రాత్రి వేళ రక్తపు దుస్తులతో చేతిలో నరికిన కాలు పట్టుకొని నిందితులు రావడంతో ఎమ్మెల్యే దస్తగిరి ఆశ్చర్యానికి గురయ్యారు. కొద్ది సేపటికి తేరుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని కేకలు వేసి వారిని పంపించేశారు. నిందితులు నరికిన కాలు అలాగే చేతిలో పట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ రాత్రి వేళ నరికిన కాలుతో నిందితులు స్టేషన్ కు రావడంతో విస్తుపోయారు పోలీసులు. ఏమి జరిగిందో వారి నుంచి వివరాలు తెలుసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు నిందితులు.. కేవలం అనుమానంతో తన తండ్రిని పొట్టన పెట్టుకున్నారని శేషన్న కుమార్తెలు ఆరోపిస్తున్నారు. శేషన్న పిల్లలకు పెళ్లిళ్లయ్యాయి. మనవళ్లు, మనవరాలు వున్నారు.. తమ నాన్నను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు శేషన్న కుమార్తెలు.

Exit mobile version