Site icon NTV Telugu

UP: రక్తసంబంధానికి మాయని మచ్చ.. హత్య వెనుక అమానుషం.. వీడిన లక్నో మర్డర్ మిస్టరీ

Upmurder

Upmurder

‘‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు’’ సమాజంలో జరుగుతున్న దుర్మార్గాలను చూసి చలించి తెలంగాణ కవి అందెశ్రీ రాసిన గేయం. అచ్చం అదే మాదిరిగా తాజా పరిణామాలు జరుగుతున్నాయి. ఏ తల్లిదండ్రులైనా కడుపున పుట్టిన బిడ్డలు ప్రయోజకులు కావాలని కోరుకుంటారు. అదే ఆ తండ్రికి శాపమైంది. బుద్ధిగా చదువుకోమని చెప్పడమే పాపమైంది. ఆ మాట కొడుకును రాక్షసుడిలా మార్చింది. రక్తసంబంధాన్ని మరిచి అత్యంత దారుణంగా తండ్రిని చంపి ముక్కలు.. ముక్కలు చేసి విసిరేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. నాలుగు రోజుల మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఇది కూడా చదవండి: Virosh Wedding: విజయ్-రష్మిక పెళ్లి సంబరాలు షురూ.. “విరోష్” థీమ్‌తో ప్రీ వెడ్డింగ్ ఫొటోలు చూశారా!

మన్వేంద్ర సింగ్ పాథాలజీ ఆపరేటర్. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఆషియానా ప్రాంతంలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్ (19) చదువు విషయంలో నిరంతరం ఇంట్లో తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 20న తెల్లవారుజామున నీట్ పరీక్ష కోసం బాగా చదువుకోవాలని తండ్రి చెప్పాడు. అయితే కుమారుడు ఏం సమాధానం ఇచ్చాడో.. ఏమో తెలియదు గానీ కోపంలో ఉన్న తండ్రి తన లైసెన్స్ తుపాకీ తీసి బెదిరించాడు. అయితే కొడుకు చదువుకుంటానని.. శాంతించమని అడగడంతో తుపాకీని పక్కన పెట్టాడు. అంతే అదే అదునుగా భావించిన అక్షత్ ప్రతాప్ సింగ్.. వెంటనే తుపాకీ తీసుకుని తండ్రి ఛాతీలోకి గురిపెట్టి కాల్చాడు. దీంతో అక్కడికక్కడే మన్వేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇంట్లో కాల్పుల శబ్దం విన్న 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల కూతురు అంతస్తు నుంచి కిందకు దిగి వచ్చింది. తండ్రి రక్తపుమడుగులో ఉండటాన్ని చూసి సోదరుడిని ప్రశ్నించింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయంతో ఆమె ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది.

అయితే మన్వేంద్ర సింగ్ తప్పిపోయినట్లుగా ఫిబ్రవరి 20న ఆషియానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యుల్ని విచారించారు. కుమారుడిని కూడా పలుమార్లు విచారించారు. పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు. ఫిబ్రవరి 20న తెల్లవారుజామున 4:30 గంటలకు తండ్రితో జరిగిన గొడవలో తుపాకీతో కాల్చి చంపినట్లుగా ఒప్పుకున్నాడు.

అయితే ఆధారాలు నాశనం చేసేందుకు తండ్రిని ముక్కలు.. ముక్కలుగా కోసి కొన్ని ప్రాంతాల్లో విసిరేశాడు. మరికొన్ని ముక్కలను అంతస్తు కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఖాళీ గదిలో డ్రమ్‌లో దాచి పెట్టాడు. జనసంచారం లేని సమయంలో డ్రమ్మును పడేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో పోలీసులు డ్రమ్మును కనుగొని స్వాధీనం చేసుకున్నారు.

చదువుకోమని ఒత్తిడి తేవడంతో కుమారుడుడు అక్షత్ ప్రతాప్ సింగ్ విసిగిపోయాడని డీసీపీ సెంట్రల్ విక్రాంత్ వీర్ తెలిపారు. నిత్యం తండ్రి తిట్టడంతో తట్టుకోలేక చంపినట్లుగా డీసీపీ వెల్లడించారు. అన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రక్తసంబంధానికి మాయని మచ్చగా మిగిలిపోయింది.

Exit mobile version