Site icon NTV Telugu

Ranga Reddy Crime News: అల్లుడి కిరాతకం.. భార్యని ఇంటికి పంపించట్లేదని..

Man Killed His Uncle

Man Killed His Uncle

Son In Law Killed His Uncle For Not Sending His Wife To Home: తన భార్యను ఇంటికి పంపించేందుకు నిరాకరిస్తున్నారని.. ఓ అల్లుడు తన మామను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. తన స్నేహితుల సహకారంతో.. ఒంటరిగా వెళ్తున్న మామపై కత్తులతో దాడి చేశాడు. ఆపై పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. అయితే.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత అతడ్ని పట్టుకోగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. దుండిగల్‌ మున్సిపాలిటీ చర్చిగాగిల్లాపూర్‌లో రమేష్ (37) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. రమేష్‌కు మహాలక్ష్మి అనే కుమార్తె ఉంది. అదే ప్రాంతానికి చెందిన షేక్ నాసిర్ అహ్మద్ (31) అనే యువకుడు.. రమేష్ కుమార్తెను కిడ్నాప్ చేసి, ముంబైకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Ambati Rayudu: ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పిన రాయుడు.. ఇక నో యూటర్న్

తండ్రి రమేష్ చేసిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు అహ్మద్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసులో అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. కొన్ని రోజుల తర్వాత బయటకొచ్చిన అహ్మద్.. తాను చేసిన పాపానికి గాను తనకు శిక్ష పడుతుందని భయపడి, మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులు చర్చిగాగిల్లాపూర్‌లోని సర్వే నెంబరు 214లో కాపురం పెట్టారు. మొదటి రెండు నెలలు వీరి సంసార జీవితం సజావుగానే సాగింది కానీ, ఆ తర్వాత అహ్మద్ తన భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో మహాలక్ష్మిని నిత్యం హింసించసాగాడు. అతని వేధింపులు భరించలేక.. ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. అనంతరం తన భార్యను ఇంటికి తీసుకువెళ్లేందుకు అహ్మద్ తన అత్తారింటికి వెళ్లాడు. అయితే.. కూతుర్ని పంపించేందుకు రమేష్ ఒప్పుకోలేదు. తన కూతుర్ని కాపురానికి పంపించనని, ఇంట్లోనే ఉంటుందని తెగేసి చెప్పాడు. అప్పటి నుంచి అహ్మద్ తన మామ రమేష్‌పై కక్ష పెంచుకున్నాడు. ఆయన్ను అంతమొందించేందుకు తన స్నేహితులు కోటేశ్వరరావు (24), మహేందర్ (22)లతో కలిసి ప్లాన్ వేశాడు. మెదక్ జిల్లా నుంచి వీళ్లు నాలుగు కత్తులు కొనుగోలు చేశారు.

Margani Bharath: టీడీపీకి ఇది మహానాడు కాదు.. చివరినాడు

ప్లాన్ ప్రకారం.. 2022 డిసెంబర్ 16వ తేదీన అహ్మద్ మరోసారి రమేష్ ఇంటికి వెళ్లి, తన భార్యని పంపించాలని కోరాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాసేపయ్యాక అహ్మద్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒక పని నిమిత్తం రమేష్ ఇంటి నుంచి బయటకు రాగా.. ఓ నిర్మానుష్య ప్రాంతంలో అహ్మద్ తన స్నేహితులతో కలిసి ఆయనపై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. మరోవైపు.. అహ్మద్, అతని స్నేహితులు పారిపోయారు. పోలీసులు ఎంత గాలించినా.. వారి జాడ కనిపించలేదు. అయితే.. అహ్మద్ ఎక్కడున్నాడో శనివారం పోలీసులు ఓ విశ్వసనీయ వర్గం నుంచి సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. అతడ్ని పట్టుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులు కోటేశ్వరరావు, మహేందర్‌లను సైతం అరెస్టు చేశారు. వీళ్లు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు పంపారు.

Exit mobile version