Fraud: షేర్ మార్కెట్‌ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..

Fraud

Fraud

షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి వందల కోట్ల రూపాయల మేర భారీ మోసానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ షేర్స్ బజార్ , కిసాన్ పరివార్ సంస్థలు నమ్మబలికాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందల మందితో పాటు దేశవ్యాప్తంగా వేలాది మందిని ఈ సంస్థలు బురిడీ కొట్టించాయి. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దందా గుట్టు రట్టయింది.

మహబూబాబాద్ జిల్లా కందికొండ గ్రామానికి చెందిన భూపాల్ అనే వ్యక్తి ఈ భారీ మోసానికి సూత్రధారిగా గుర్తించారు. అతను కొండాపూర్‌లో ‘షేర్స్ బజార్’ అనే సంస్థను ప్రారంభించి.. తమకు సెబీ రిజిస్ట్రేషన్ ఉందని నకిలీ ప్రచారం చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించాడు. లక్ష రూపాయల పెట్టుబడి పెడితే నెలకు 4 శాతం చొప్పున ఖచ్చితమైన రాబడి ఇస్తామని నమ్మబలికాడు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏకంగా 150 మందికి పైగా ఉద్యోగులతో ఒక పెద్ద కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ ప్రచారాలు చేస్తూ పెద్ద ఎత్తున కస్టమర్లను వలలో వేసుకున్నాడు.

×
×
Ad

సంస్థ మాటలు నమ్మిన బాధితులు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. కొందరైతే తమ పొలాలు, భూములు, బంగారం అమ్మి వచ్చిన డబ్బును కూడా ఈ సంస్థలో డిపాజిట్ చేశారు. అయితే, 2025 అక్టోబర్ నుంచి పెట్టుబడిదారులకు ఇవ్వాల్సిన పేఔట్లను భూపాల్ అకస్మాత్తుగా నిలిపివేశాడు. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తానూ ఎవరికీ డబ్బులు ఇవ్వనని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు దిగాడు.

ఇప్పటికే గుజరాత్‌కు చెందిన కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు భూపాల్ దేశం విడిచి పారిపోకుండా గుజరాత్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది వరకు బాధితులు ఉండవచ్చని, మోసం విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.