Site icon NTV Telugu

Son Kills Mother: తల్లిని కొడుకు హత్య చేసిన కేసులో షాకింగ్‌ ట్విస్ట్..! తాను దేవుడిని అంటే నమ్మలేదు.. అందుకే..!

Son Kills Mother

Son Kills Mother

Son Kills Mother: మానసిక స్థితి సరిగా లేని కొడుకు చేతిలో కన్నతల్లిని దారుణ హత్య చేసిన ఘటన ప్రొద్దుటూరులో కలకలం రేపింది. ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మీదేవి, భాస్కర్ రెడ్డి దంపతులకు యశ్వంత్ కుమార్ రెడ్డి ఒక్కడే కుమారుడు. ఒక్కడే కుమారుడు కావడంతో చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్న దంపతులు యశ్వంత్ కుమార్ ను బీటెక్ వరకు చదివించారు. బీటెక్ పూర్తి చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇంతవరకు యశ్వంత్ కుమార్ కు ఉద్యోగం రాలేదు. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోనే ఒక్కడే రూమ్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు యశ్వంత్ కుమార్. యశ్వంత్ కుమార్ నెల ఖర్చులకు తల్లిదండ్రులు డబ్బు పంపించేవారు. అయితే, ఇటీవల యశ్వంత్ కుమార్ మానసిక స్థితిలో మార్పు గమనించిన తల్లిదండ్రులు యశ్వంత్ కుమార్ ను పలుమార్లు ఇంటికి రమ్మని పిలిచిన రాలేదు. కేవలం డబ్బులు పంపించమని మాత్రమే యశ్వంత్ కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేసేవాడని పోలీస్ విచారణలో చెప్పినట్లు సమాచారం..

Read Also: Samantha : ఎట్టకేలకు శుభవార్త చెప్పిన సమంత.. అందరూ అనుకున్నదే చేసిందిగా!

ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్న యశ్వంత్ వచ్చిన వెంటనే తాను అడిగిన డబ్బు ఎందుకు పంపించలేదని, తాను ఒక దేవుడునని తాను అడిగినప్పుడు డబ్బు పంపించాలంటూ తల్లితో గొడవపడినట్లు సమాచారం. ఇంట్లోనే పక్క గదిలో స్నానం చేస్తున్న తండ్రి భాస్కర్ ఎందుకు గొడవ పడుతున్నావు అంటూ పక్క గదిలో నుండి బయటకు వస్తున్న క్రమంలో తండ్రిని లోపలికి నెట్టి బయట గడియ పెట్టేశాడు.. ఆ తర్వాత తల్లి లక్ష్మీదేవిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంట రూమ్‌ నుంచి ఈడ్చుకుంటూ బయట వరండాలో పడేసి తన గదిలోకి వెళ్లి యశ్వంత్ తలుపులు వేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఇంటి వద్దకు వచ్చి తలుపులు పగలగొట్టి యశ్వంత్‌ను అదుపులోకి తీస్తున్నారు.

అయితే, తాను ఒక దేవుడిని.. ఈ విషయం తన తల్లికి చెప్తే నమ్మడం లేదని, అందుకే దేవుడు వద్దకే పంపించాను అంటూ యశ్వంత్ కుమార్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. యశ్వంత్ మానసిక స్థితిపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లో యశ్వంత్ పెరిగిన పరిస్థితులు.. గతంలో ఇతని మానసిక స్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లక్ష్మీదేవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పడంతో సోమవారం ఉదయం లక్ష్మీదేవి మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హంతకుడైన కొడుకును తలకొరువి పెట్టడానికి పంపించాలంటూ పోలీసులను తండ్రి భాస్కర్ కోరారు.

Exit mobile version