తన కోపాన్ని ప్రదర్శించిన ఓ సెక్యూరిటీ గార్డు ఖరీదైన మెర్సిడెస్ కారును ధ్వంసం చేసిన ఘటన గురుగ్రామ్‌లో కలకలం రేపింది. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ సెక్టార్–31లో ఉన్న సైబర్ పార్క్ వద్ద జరిగింది. గేటు వద్ద ఆగి ఉన్న మెర్సిడెస్ కారును సెక్యూరిటీ గార్డు చేతిలో ఉన్న కర్రతో అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెర్సిడెస్ కారు డ్రైవర్ రాంగ్‌రూట్‌లో వాహనం నడుపుతూ సైబర్ పార్క్ గేటు వద్దకు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కారు డ్రైవర్‌కు, సెక్యూరిటీ గార్డులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్ భద్రతా సిబ్బందిపై దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు.
దీంతో ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డులు కారును ధ్వంసం చేశారు. ఒక గార్డు మరొక వ్యక్తి చేతిలోని కర్రను లాక్కొని కారువైపు పరుగెత్తి కిటికీల అద్దాలను పగలగొట్టాడు. మరో వ్యక్తి కారు టెయిల్ లైట్లు, సైడ్ మిర్రర్లను కూడా ధ్వంసం చేశాడు. అక్కడ ఉన్నవారు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ మెర్సిడెస్ కారు విలువ దాదాపు 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై కారు యజమాని ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సెక్యూరిటీ గార్డు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తుంటే, మరికొందరు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘర్షణకు కారణమని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చర్చనీయాంశంగా మారింది.
Gurugram: A security guard at Cyber Park, Sector 31, vandalised a Mercedes with sticks after an argument over wrong-side driving.
The driver allegedly assaulted the guard first. pic.twitter.com/EoyBfBt0mh— Greater Noida West (@GreaterNoidaW) December 19, 2025