Site icon NTV Telugu

Murder : మామ ఆస్తి కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూపు.. చివరికి

Crime

Crime

ఆస్తి కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. హైదరాబాద్‌లో తాజాగా జరిగిన ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. సైదాబాద్ విష్ణునగర్‌లో వృద్ధుడిని చంపేసిన కోడలు.. దోపిడీ దొంగల ప్రయత్నంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమె తెలివితేటలకు చెక్ పెట్టారు. ఆమెతోపాటు సహకరించిన మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు నినవత్ మంగ. పక్కనే ఉన్నది ఆమె ప్రియుడు వెంకట్. ఈ ఇద్దరు కలిసి దారుణమైన స్కెచ్ వేశారు. నినవత్ మంగకు వరుసకు మామ అయ్యే వృద్దుడు కట్రోత్ శివయ్య ఆస్తిపై కన్నేశారు. ఆయన్ను చంపేస్తే ఆస్తి తమకే వస్తుందని.. మంగ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో అతన్ని చంపేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది..

సైదాబాద్.. విష్ణునగర్‌లో కట్రోత్ శివయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. సెప్టెంబర్ 14న రాత్రి సమయంలో.. శివయ్య ఉంటున్న ఇంటికి మంగ.. తన ప్రియుడు వెంకట్‌తోపాటు కొడుకు భరత్‌ను తీసుకుని వెళ్లింది. నిద్రపోతున్న శివయ్యను.. దిండుతో ఊపిరి ఆడకుండా చేశారు. తర్వాత గొంతు నులిమి చంపేశారు. ఆయన ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలతోపాటు ఇంట్లో ఉన్న వస్తువులను కూడా ఎత్తుకుని వెళ్లిపోయారు. అంతే కాదు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు శివయ్య గొంతు కోసి.. డెడ్ బాడీని ఇంటి ముందు పడేశారు..

ఉదయం.. ఏమీ తెలియనట్లుగా వచ్చిన మంగ..కొత్త డ్రామా షురూ చేసింది. అర్ధరాత్రి దొంగలు పడి తన మామను చంపేశారని.. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోయారని నాటకం మొదలు పెట్టింది. ఈ మేరకు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు షురూ చేశారు. ఈ కేసులో సీసీ ఫుటేజీల పరిశీలనతోపాటు అన్ని కోణాల్లో విచారణ చేశారు. బంధువులను విచారించారు. ఐతే పోలీసులకు.. మంగ ఓవరాక్షన్‌ చూసి అనుమానం వచ్చింది. దీంతో ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఆస్తి కోసం తామే హత్య చేసినట్లు వెల్లడించింది. తనకు కొడుకు భరత్‌తోపాటు వెంకట్ అనే వ్యక్తి మరో నలుగురు సాయం చేశారని వెల్లడించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకట్ అనే వ్యక్తి మంగ ప్రియుడిగా విచారణలో తేలింది..

ఐతే మంగ చాలా కాలం నుంచి వృద్ధుడు శివయ్యకు సంబంధిచిన ఇంటిపై కన్నేసింది. తన పేరిట రాసి ఇవ్వాలని కూడా అడిగింది. ఐతే శివయ్య అందుకు నిరాకరించాడు. తన ఇంటిని ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. నిన్న చంపి అయినా ఇల్లు, ఆస్తి తీసుకుంటానని మంగ.. మంగమ్మ శపథం చేసింది. చివరకు అన్నట్లుగా అతన్ని ఆస్తి కోసం చంపేసింది. ఆస్తి కోసం ఇంతటి ఘాతుకానికి పాల్పడిన మంగను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..

Exit mobile version