WhatsApp Scam: అనకాపల్లి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా కోటిన్నర రూపాయలకు పైగా నష్టపోయాడు. గవరపాలెంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరగడం మహేంద్ర సూర్యకుమార్ ఈ సైబర్ మోసానికి బలైనట్టు పోలీసులు తెలిపారు. సైబర్ కేటుగాళ్లు వాట్సాప్‌లో కాల్ చేసి, తాము సూచించిన పెట్టుబడి గ్రూప్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించి.. మొదట రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టించి, వెంటనే రూ.20 వేలు లాభం వచ్చేలా అతడ్ని నమ్మించారు. దీంతో భారీగా ఆశలు పెట్టుకున్న మహేంద్ర.. దశలవారీగా మొత్తం రూ.1 కోటి 64 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాడు. అయితే, ఆ తర్వాత నుంచి సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ ఎత్తడం ఆపేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు తాను మోసపోయానని గ్రహించాడు. అనంతరం వెంటనే అనకాపల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Also: Tragedy: తుఫాన్ ను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు యువకులు మృతి.. మరో 9 మందికి గాయాలు
ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ తరహా ట్రేడింగ్, పెట్టుబడి గ్రూప్‌ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. తక్షణ లాభాలకు ఆశపడటం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని అనకాపల్లి పోలీసులు సూచించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలు, వాట్సాప్ నెంబర్లు, కాల్ లాగ్స్ ఆధారంగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.