Haryana: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే తప్పుడు పనులకు పాల్పడ్డాడు. ఉన్న హోదాలో ఉన్న ప్రిన్సిపాల్ కీచకుడిగా మారాడు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానాలోని జింద్ జిల్లాలో చోటు చేసుకుంది. 50 మందికి పైగా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం ప్రకటించారు. నిందితుడైన వ్యక్తిని శనివారం అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. ఈ కేసును విచారించేందుకు డీఎస్పీ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
Read Also: Germany: హాంబర్గ్ విమానాశ్రయంలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. దుండగుడితో చర్చలు..
నేరానికి పాల్పడిన ప్రిన్సిపాల్ గత ఐదు రోజులుగా పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతడిని కోర్టు ముందు ప్రవేశపెడతామని చెప్పారు. జింద్ లోని ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది. అతడిని సస్పెండ్ చేసిన తర్వాత హర్యానా పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేణు భాటియా పంచకులతో మీడియాతో మాట్లాడుతూ.. బాలికల నుంచి ప్రిన్సిపాల్‌కి వ్యతిరేకంగా 60 లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయని, 50 మంది బాలికలను లైంగికంగా వేధించారని వారంతా ఫిర్యాదు చేశారని చెప్పారు. ఫిర్యాదు చేసిన వాళ్లంతా మైనర్లే అని ఆమె తెలిపారు. నిందితుడిపై లైంగిక వేధింపులు, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
