Site icon NTV Telugu

TamilNadu: ప్రేమోన్మాదానికి ఒకే ఇంట్లో ఇద్దరి హత్య.. ఒకరి పరిస్థితి విషమం

Tamil Nadu

Tamil Nadu

TamilNadu: ప్రేమ.. మనసులను కలపాల్సిన భావన.. కానీ అదే ప్రేమ పిచ్చిగా మారితే ప్రాణాలు తీసే స్థాయికి వెళితే‌‌.. తమిళనాడులో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన ఇప్పుడు ఈ ప్రశ్ననే లేవనెత్తుతోంది. ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువకుడు కత్తితో దాడికి దిగాడు. ఆమెను కాపాడేందుకు వచ్చిన అవ్వను కూడా కిరాతకంగా హత్య చేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన అక్కపై కూడా దాడి చేసి పరారయ్యాడు. ఈ సంచలన ఘటన తమిళనాడులో పొల్లాచ్చి సమీపంలో కలకలం రేపింది.

READ ALSO: NLG FAKE BABA ARREST: కంత్రీ మాంత్రికుడు..

కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలో గౌండన్ పాళయంకు చెందిన భూపతి ద్విచక్ర వాహన మెకానిక్ షాపు నడుపుతున్నారు. ఆయనకు భార్య కలైయరసి. హరిత, కౌసి అనే కుమార్తెలు ఉన్నారు. తన తల్లి మైలాత్తాళ్‌తో కలిసి ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. కౌసి చదువు మానేసి ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. కప్పలంగరైకి చెందిన అభిషేక్‌తో అక్కడ కౌసికి ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న సమాచారంతో కుమార్తెను భూపతి మందలించారు. అదే సమయంలో అభిషేక్ తన తల్లిదండ్రులతో కలిసి కౌసిని వివాహం చేయించాలని భూపతి కుటుంబాన్ని సంప్రదించి విన్నవించాడు. కౌసికి వివాహ వయసు రాలేదని, ఆమెకు ఇప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేదని పేర్కొంటూ వారిని భూపతి పంపించేశారు.

అయితే తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు వస్తే అవమానించడమే కాకుండా, తనకు పెళ్లి వద్దంటూ కౌసి చెప్పిందని తెలుసుకున్న అభిషేక్ ఉన్మాదిగా మారాడు. రాత్రి కౌసి ఇంటికి వెళ్లి ఆమెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడయ్యాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను కిరాతకంగా పొడిచాడు. ఆమె అరుపులు విన్న అవ్వ మైలాత్తాల్ పరుగున రాగా.. ఆమైపై కూడా దాడిచేశాడు. ఇద్దర్ని విచక్షణా రహితంగా పొడిచాడు. దీనిని చూసిన హరితపై కూడా కత్తితో దాడి చేసి పరారీ అయ్యాడు. రక్తపు మడుగులోపడి ఉన్న హరితను ఇరుగు పొరుగు వారు పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కౌసి, మైలాత్తాల్ మరణించారు. హరిత తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరారీలో ఉన్న అభిషేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

READ ALSO: ViRosh Wedding: రష్మిక – విజయ్ పెళ్లి ఫోటోలు వైరల్..

Exit mobile version