ప్రజలను కాపాడాల్సిన పోలీసులే.. ప్రజలను బాధిస్తున్నారు. అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వస్తే.. లంచం ఇస్తావా.. మంచం ఎక్కుతావా అంటూ దిగజారి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ పరువు తీస్తున్నారు. తాజాగా ఒక మహిళ ఒక పోలీస్ తనను లైంగికంగా వేధించాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని ఐటీ హబ్ లో నివాసముండే ఒక మహిళ తనకున్న రెండు ఇళ్లలో ఒకదాన్ని అద్దెకు ఇచ్చింది. అద్దెకు వచ్చినవారు కొన్నేళ్లు బాగానే ఉన్నా ఒక ఏడాది నుంచి వాటర్ బిల్లు కట్టడం మానేశారు. ఆమె ఇదేంటి అని ప్రశ్నించడానికి వెళితే.. ఆమెపై కత్తితో దాడిచేసి, హత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో ఆమె గాయాలతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడ ఒక ఇన్స్పెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె వాపోయింది. ఫిర్యాదు తీసుకోకుండా.. త్వరగా నీ కేసు చూడాలంటే పైసల్ ఇస్తావా.. పడక సుఖం ఇస్తావా..? అంటూ చెయ్యి పట్టుకొని లాగి కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడని తెలిపింది. అతని లైంగిక వేధింపులు తట్టుకోలేక పోలీస్ కమీషనర్ కి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. ఒక పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మహిళ ఆరోపణలు నిజమని తెలిస్తే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ తెలిపారు.
