Loco Pilot Murder Case: బెజవాడలో కలకలం రేపిన రైల్వే లోకో పైలట్ హత్య కేసును ఛేదించారు పోలీసులు.. రెండు రోజుల క్రితం రైల్వే స్టేషన్ సమీపంలోనే లోకో పైలట్ ఏబేలు దారుణ హత్యకు గురవటం తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే.. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.. అయితే, హత్యకు పాల్పడిన వ్యక్తిని సీసీ టీవీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించటంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఏ కారణంగా హత్యకు పాల్పడ్డాడనే వివరాలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
Read Also: Bandi Sanjay: శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం పాటుపడదాం..
బెజవాడ రైల్వే స్టేషన్ పరిధిలో లోకో పైలట్ గా 52 ఏళ్ల ఏబేలు పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే ఈ నెల 10వ తేదీన విధులకు వెళ్లాడు ఏబేలు. బెజవాడ రైల్వే స్టేషన్ నుంచి ఎఫ్ క్యాబిన్ మధ్య గత బుధవారం అర్థరాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఏబేలుపై గుర్తు తెలియని వ్యక్తి ఇనుక రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఏబేలు రైలు పట్టాలపై పడిపోయాడు. విధులకు వస్తున్న మరో లోకో పైలట్ పృధ్వీరాజ్ గాయపడిన ఏబేలును గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావటంతో ఏబేలు ప్రాణాలు వదిలాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు నిందితుడి పట్టివేత కోసం ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ లను జల్లెడపట్టగా బీహార్ కు చెందిన దేవ్ కుమార్ ను నిందితుడిగా గుర్తించారు.
Read Also: AP Crime: శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. అత్తా కోడళ్లపై అత్యాచారం.. ఆ తర్వాత..!
బెజవాడలో ఏబేలుపై దాడి జరిగిన తర్వాత పోలీసు బృందాలు సీసీ టీవీ ఫుటేజ్ ను జల్లెడ పట్టాయి. నిందితుడు దేవ్ కుమార్ ను ఆనవాళ్లను గుడివాడ సెక్షన్ లో ఉన్న ఎల్ సీ గేటు దగ్గర గుర్తించి పట్టుకున్నారు. లోకో షెడ్ దగ్గర అనుమానస్పదంగా తిరుగుతున్న దేవ్ కుమార్ ను ఏబేలు ప్రశ్నించటంతో ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడినట్ట ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావటంతో అక్కడ ఇతనిపై ఏ కేసులు ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. గంజాయి మత్తులోనే ఈ దాడులకు పాల్పడుతున్న దేవ కుమార్ కు మతిస్థిమితం సరిగా లేదా కావాలని అలా ప్రవర్తిస్తున్నాడా అనే విషయాలను తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. లోకో పైలైట్ ఏబేలు హత్యకు ముందు కూడా దేవ్ కుమార్ బెజవాడలో ముగ్గురిపై దాడులకు పాల్పడినట్టు పోలీసులు విచారనలో గుర్తించారని సమాచారం. తొలుత రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న నైజాం గేట్ దగ్గర ఒక వ్యక్తిపై దాడి చేసి ఆ తర్వాత న్యూ రాజరాజేశ్వరిపేటలో మరోకరిపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం అదే రోజు 8 గంటల సమయంలో కృష్ణలంకలో మరొకరిపై దాడికి పాల్పడ్డట్టు గుర్తించారు. చివరిగా ఏబేలుపై దాడికి పాల్పడినట్టు గుర్తించారు. సైకో గా ప్రవర్తిస్తున్న దేవ్ కుమార్ రోడ్డుపై తిరుగుతూ కనిపించిన వారిపై దాడులకు దిగుతున్నట్టు గుర్తించారు. దీంతో దేవ్ కుమార్ పూర్తి నేర చరిత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇంకా హత్య కేసులు ఏమైనా ఉన్నాయా అని కూడా ఆరా తీస్తున్నారు. ఏబేలు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సబ్యులకు అప్పగించారు.