Karnataka: కర్ణాటక బెళగావిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆరుగురు నిందితులు బాలికపై రెండుసార్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ చర్యని వారు మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి బాలికను బ్లాక్‌మెయిల్ చేశారు. ఈ బ్లాక్‌మెయిల్ బాలిక రెండోసారి గ్యాంగ్ రేప్‌కి గురవ్వడానికి కారణమైంది.
Read Also: Pakistan: మేము బిచ్చగాళ్లమే.. ఒప్పుకున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..
పోలీసులు కథనం ప్రకారం, మొదటి సామూహిక అత్యాచారం దాదాపుగా ఆరు నెలల క్రితం జరిగింది. నిందితుల్లో ఒకరైన బాలిక స్నేహితుడు ఆమెను బెళగావి శివారల్లోని కొండ ప్రాంతానికి వచ్చేలా చేశాడు. అక్కడికి తన స్నేహితులను కూడా పిలిచారు. వీరంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి నిందితులు బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత నేరస్తుల్లో ముగ్గురు ఆమెపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేధింపులు భరించలేక బాలిక శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితులపై పోలీసులు పోక్సోతో పాటు ఇతర అత్యాచార సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సున్నిత వివరాలను ప్రస్తుతానికి వెల్లడించలేమని పోలీస్ కమిషనర్ బోరాసే భూషన్ గలాబ్రావు అన్నారు. నిందితుల అంతా 18 ఏళ్లకు పైబడిన వారే అని పోలీసులు తెలిపారు. 24 గంటల్లోనే నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశామని, ఒకరు పరారీలో ఉన్నట్లు కమిషనర్ తెలిపారు.
