AP Crime: కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి కూతురు అత్త గారింట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి శాడిస్ట్ భర్తతో వేధింపులు మొదలయ్యాయి. ఆశలతో మెట్టినింట అడుగు పెట్టిన వధువుకు అనుక్షణం అవమానాలే ఎదురయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త విచక్షణ మరచి నువ్వు అందంగా లేవు. నాకు పరిచయం ఉన్న సాయి అనే అమ్మాయి అందం ముందు నీవెందుకు పనికిరావు అంటూ కొట్టి దూషించడం, అడ్డు చెప్పాల్సిన అత్తామామ అతనికి అండగా నిలబడటం చూసి తట్టుకోలేకపోయింది. పెళ్లైన నాలుగు నెలలకే మెట్టినింటి వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లలేక పదిమందికి మంచీచెడు చెప్పే యువ అధ్యాపకురాలు బలవన్మరణానికి పాల్పడింది. తన చావుకు కారణమైన వారిని వదలొద్దు అంటూ తల్లిదండ్రులకు లేఖ రాసింది. ఈ హృదయ విదారక ఘటన ఉయ్యూరులో ఆదివారం రాత్రి జరిగింది.
Read Also: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం.. 12 మృతదేహాలు లభ్యం.. మిగతావారి కోసం గాలింపు!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉయ్యూరు కలవపాముల గ్రామ సచివాలయంలో సర్వేయుర్‌గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ కు ఉయ్యూరు అంబేద్కర్ నగర్‌కు చెందిన వర్రే శ్రీవిద్య (24)తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ఎంఎస్సీ చదివిన శ్రీవిద్య.. స్థానిక శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో అధ్యాపకు రాలిగా పనిచేస్తోంది. ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు భర్త, అత్తమామలే కారణమని తన తల్లిదండ్రులు, తమ్ముడికి సూసైడ్ లేఖ రాసింది.
Read Also: Malnadu Drugs Case: మల్నాడు డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. ఎవరంటే..?
భర్త అరుణ కుమార్ రోజూ తాగి వచ్చి “నువ్వు అందంగా లేవు.. నీకంటే ముందు నాకు పరిచయం ఉన్న అమ్మాయి అందం ముందు నీవు ఎందుకు పనికిరావు” అంటూ కొట్టి హింసిస్తున్నాడు.. ఇలాంటి వాడి దగ్గర ఉండలేకపోతున్నాను.. మన ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను.. నిన్ను, నాన్నను తిడుతున్నాడు. వీడిని, వీడి అమ్మ నాన్నలను వదలొద్దు.. ఇక ఈ బాధలు నేను తాళలేను.. నీకు ఈ సారి రాఖీ కట్టలేక పోతున్నాను తమ్ముడు.. అమ్మనాన్నలను జాగ్రత్తగా చూసుకో అంటూ లేఖలో పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీవిద్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీవిద్య చనిపోయే ముందు రాసిన సూసైడ్ లెటర్ కంట తడి పెట్టిస్తోంది. శ్రీవిద్య తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ టీవీవీ రామారావు తెలిపారు.
