NTV Telugu Site icon

Cyber Crime: తస్మాత్ జాగ్రత్త.. ఆ నంబర్ నుంచి కాల్ వస్తే, అస్సలు లిఫ్ట్ చేయొద్దు

Cyber Crimes Call

Cyber Crimes Call

Cyber Crime: ఇప్పుడున్న టెక్నాలజీ సహాయంతో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. సరికొత్త విధానాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు తెలియకుండా చాలా ఈజీగా బురిడీ కొట్టించి, సొమ్ముని కాజేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో కొత్త విధానానికి తెరలేపారు. 91తో కలిపి కేవలం 9 అంకెల నంబర్‌తో ఫోన్ చేసి.. జనాల్ని మాయమాటల్లో పడేసి, ఖాతాలో ఉన్న డబ్బుల్ని దోచేసుకుంటున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఒక్క హైదరాబాద్ నగరంలోనే 30 నమోదు అయ్యాయి.

Mobile Number: ఓ వివాహిత ప్రాణం తీసిన కొత్త నంబర్.. అసలేం జరిగిందంటే?

మొదటగా సైబర్‌ మోసగాళ్లు వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ (VOIP) ద్వారా 91తో కలిపి 9 అంకెల నంబర్‌తో ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ ఎత్తగానే.. తాము సీబీఐ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తారు. అనంతరం మీ పేరు, ఆధార్ నంబర్ ఇదేనా అని అడుగుతారు. అందుకు మీరు అవునని చెప్పగానే.. అసలు కథ మొదలవుతుంది. ‘‘మీరు ముంబై నుంచి తైవాన్‌కు ఒక కొరియర్ ద్వారా పార్శిల్ పంపుతున్నట్టు మాకు సమాచారం అందింది. అందులో డ్రగ్స్‌తో పాటు ఇంకా అనుమానాస్పద పత్రాలు ఉన్నాయని, వాటిని ఇతర దేశాలకు పంపిస్తున్నట్టు తెలిసింది. మీరు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్టు కొరియర్‌ ప్రతినిధి మాకు తెలియజేశాడు. మీపై సీబీఐ కేసు నమోదైంది, ఇంకో 20 నిమిషాల్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం’’ అని ఫోన్ చేసిన వ్యక్తి చెప్తారు.

Sachin Pilot: బీజేపీ నేతలకు సచిన్‌ పైలట్ కౌంటర్‌.. వాస్తవాలు తెలుసుకోవాలంటూ ట్వీట్‌

ఇలా ఎవరైనా బెదిరిస్తే ఏమవుతుంది చెప్పండి..? కచ్ఛితంగా ప్యాంటు తడిచిపోతుంది. తమ తప్పేమీ లేదని ప్రాధేయపడతారు. ఈ బలహీనతనే వాళ్లు అలుసుగా తీసుకొని, ఈ సమస్య నుంచి బయటపడేస్తామని ఆ సైబర్ నేరగాళ్లు చెప్పి, తమ లూటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. మీరు నిర్దోషి అని తేలాలంటే బ్యాంక్ ఖాతాల్ని తనిఖీ చేయాలని చెప్పి, మొత్తం వివరాలు సేకరిస్తారు. అనంతరం స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించి, మీ ఫోన్‌ని వాళ్లు తమ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. మీ ఖాతా నుంచి కొంత డబ్బు సీబీఐ ఖాతాకు పంపమంటారు. ఇలా మూడు గంటల పాటు మాటల్లో పడేసి.. సైబర్‌ మోసగాళ్లు స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ ద్వారా మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల్ని ఖాళీ చేసేస్తారు. ఇలా 30 మంది నుంచి రూ.1.5 కోట్లు కాజేశారు.

Cinema At Manipur: మణిపూర్‌లో 23 ఏళ్ల తరువాత.. హిందీ సినిమా ప్రదర్శన

ఇలాంటి మోసాలకు చెక్ పెట్టాలంటే.. 91తో కలిపి 9 అంకెల నంబర్ నుంచి ఫోన్ వస్తే, అస్సలు లిఫ్ట్ చేయకండి. సాధారణంగా మొబైల్ నంబర్స్ 10 అంకెలుంటాయి. వాటి ముందు 91 అనే సంఖ్య కూడా వస్తుంది. మీకు ఫోన్ వచ్చినప్పుడు ఇది బాగా గమనించండి. ఒకవేళ పొరపాటున మీరు 9 అంకెల నంబర్ నుంచి వచ్చిన కాల్‌ని లిఫ్ట్ చేస్తే.. వారి మాటలకు భయపడకుండా, నిర్భయంగా సమాధానం ఇవ్వండి. వీలైతే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.