Nagpur: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఫోన్‌లో గట్టిగా మాట్లాడోద్దని సూచించినందుకు ఏకంగా ఓ తండ్రి కొడుకును కొట్టి చంపాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి రాడ్‌తో దాడి చేయడంతో అతని కొడుకు మరణించాడు. ఈ ఘటన నాగ్‌పూర్ జిల్లాలో నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్రా గ్రామంలో జరిగింది. నిందితుడు రాంరావు కక్డేని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Siddarth : సిద్దార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా..? ఆ కారణం వల్ల విడిపోయారా?
ఈ విషాదకరం సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాంరావు ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడుతుండటంపై కొడుకు 28 ఏళ్ల సూరజ్ అభ్యంతరం తెలిపాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అప్పటికే మత్తులో ఉన్న రాంరావు స్టీల్ రాడ్‌తో సూరజ్‌పై దాడి చేశాడు. తీవ్రగాయాలైన సూరజ్‌ని ఆస్పత్రికి తరలించారు, చికిత్స పొందుతూ అతను మంగళవారం మరణించాడు. ఈ కేసులో పోలీసుల కథనం ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
