Honour KIilling: ఉత్తర్‌ప్రదేశ్ మొరాదాబాద్‌లో పరువు హత్య సంచలనంగా మారింది. ముస్లిం యువకుడు, హిందూ యువతి ప్రేమించుకోవడంతో, ఇద్దరి మతాలు వేరు కావడంతో సోదరి అన్నయ్యలే ఇద్దరిని హత్య చేసినట్లు తేలింది. వీరిద్దరి మృతదేహాలు సమీపంలోని ఒక అటవీ ప్రాంతంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. యువతిని 19 ఏళ్ల కాజల్, యువకుడిని 27 ఏళ్ల అర్మాన్‌గా గుర్తించారు. వీరిద్దరిది మొరాదాబాద్‌లోని ఉమ్రీ సబ్జీపూర్ గ్రామం.
Read Also: Love Marriage: గుడిలో పెళ్లి.. ప్రేమ జంటపై యువతి కుటుంబ సభ్యుల దాడి..
పోలీసుల కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం అర్మాన్, కాజల్ అదృశ్యమయ్యారు. అర్మాన్ కనిపించడం లేదని హనీఫ్ తండ్రి ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో కాజల్ కూడా కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. కాజల్ ముగ్గురు సోదరులను విచారించగా, ఇద్దరిని చంపినట్లు ఒప్పుకున్నారు. వీరిద్దరిని పూడ్చిపెట్టిన ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. నిన్న సాయంత్రం మృతదేహాలను వెలికితీశారు. అర్మాన్, కాజల్ చేతులు, కాళ్లు కట్టేసి ఆ తర్వాత వీరిద్దరిని చంపేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
కాజల్ ముగ్గురు సోదరులపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరం మతపరమైన గొడవకు దారితీయకూడదని పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. ఈ ఘటనపై అర్మాన్ సోదరి మాట్లాడుతూ.. అర్మాన్, కాజల్ మధ్య రిలేషన్ ఉందని తమకు తెలియదని చెప్పింది. అర్మాన్ నాలుగేళ్లు సౌదీ అరేబియాలో పనిచేశాడు. మూడు నెలల క్రితం సొంత ఊరికి వచ్చాని ఆమె పేర్కొంది.
