ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాక పనులన్నీ ఈజీ అయిపోయాయి. వాషింగ్ మెషిన్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఏసీలు, గీజర్లు విరివిగా వినియోగిస్తున్నారు. అయితే వీటి వాడకం ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరికరాలను ఉపయోగించే సమయంలో చిన్న పొరపాటు వల్ల విద్యుత్ అఘాతాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వాషింగ్ మెషిన్ ఆపరేటింగ్ చేస్తూ ఓ బాలిక విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్ లో చోటుచేసుకుంది.
Also Read:Hyderabad: డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు..
అలీ నగర్ ప్రాంతానికి చెందిన ఫాతిమా బేగం (17) ఇంట్లో వాషింగ్ మెషిన్ ఆపరేటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైంది. బట్టలు వేస్తుండగా వైర్లు చేతికి తగిలి బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఫాతిమా బేగం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.