Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్‌ చాట్‌తో వెలుగులోకి దారుణం..

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
  • చివరకు మొబైల్ ఫోన్ చాటింగ్‌తో వెలుగులోకి నిజం..
Crime

Crime

Wife Kills Husband: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, మృతుడి మొబైల్‌ బయటపడిన చాట్ హిస్టరీ ఈ కేసులో కీలకంగా మారింది. ఈ చాట్‌తో భార్య దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

మీరట్‌లోని లోహియా నగర్‌కు చెందిన 30 ఏళ్ల తాలిబ్‌కు 27 ఏళ్ల ఇల్మాతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇల్మా బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. వీరిద్దరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. సెప్టెంబర్‌లో ఓ రోజు తాలిబ్ తన పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడని ఇల్మా తన అన్న అక్రమ్‌కు చెప్పింది. మంచంపై పడుకున్న తాలిబ్ కాసేపటి తర్వాత మరణించాడు. గుండెపోటుతో మరణించాడని భావించి కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే, కొంత కాలం తర్వాత తాలిబ్ మరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్టోబర్ 01న తాలిబ్ బంధువు రైస్ ఇల్మా ఇంటికి వచ్చిన తర్వాత, ఇల్మా దాచిన తాలిబ్ మొబైల్ బయటపడింది. ఫోన్‌లో తాలిబ్, అమన్ అనే వ్యక్తి మధ్య మెసేజ్‌లు బయటపడ్డాయి. తన భార్యతో మాట్లాడొద్దని తాలిబ్ అమన్‌ను హెచ్చరించినట్లు ఈ చాట్‌లో ఉంది. దీంతో ఇల్మాను కుటుంబీకులు గట్టిగా ప్రశ్నించడంతో, తన భర్తను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.

సెప్టెంబర్ 28న తాలిబ్ తనపై దాడి చేసిన తర్వాత ప్రియుడు అమన్‌కు ఫోన్ చేసిందని, అమన్ అతడి స్నేహితులు ఇల్మాతో కలిసి తాలిబ్ మెడకు చున్నీని బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇల్మాను పెళ్లి చేసుకుంటానని అమన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం తాలిబ్ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇల్మాపై పోలీసుల నిఘా కొనసాగుతోందని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.