Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్‌పేట్‌లో దారుణ హత్య

  • స్కూల్ పక్కనే సంపులో మృతదేహం
  • బంగారు పోగులు మాయం.. దోపిడీ కోణంలో దర్యాప్తు
  • జీతం వచ్చిందని తెలిసే హత్య చేశారా?
  • అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Murder

Murder

Meerpet Murder : హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన దారుణ హత్య వెలుగు చూసింది. స్థానిక ఒక పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న కళ్ళమ్మ (65) అనే వృద్ధురాలు నగరంలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. నిందితులు ఆమె మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి, పాఠశాల పక్కనే ఉన్న బిల్డింగ్ సంపులో పడేసి పరారయ్యారు. మృతురాలి చెవికి ఉన్న బంగారు పోగులు మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు.

మనువరాళ్ల పెంపకమే ఆమె లోకం.. డబ్బు, బంగారం కోసమే హత్య?

ఈ ఘటనపై మీర్‌పేట్ పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. కళ్ళమ్మ ఆయాగా పనిచేస్తూ వచ్చిన సంపాదనతోనే తన ముగ్గురు మనువరాళ్లను సాకుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, స్థానికంగా చిప్స్ షాప్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తిపై పోలీసులకు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయాకు ఇటీవల జీతం వచ్చిన విషయం తెలుసుకున్న నిందితుడు, ఆమె వద్ద ఉన్న డబ్బుతో పాటు బంగారు ఆభరణాలను కాజేయాలనే దుర్బుద్ధితోనే ఈ హత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అనుమానితుడైన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నారు.