కుటుంబ కలహాలు పెను విషాదానికి దారితీశాయి. క్షణికావేశంలో మానవత్వాన్ని మరిచిన ఓ అల్లుడు కసాయిగా మారి సొంత బంధువులపైనే కత్తులతో విరుచుకుపడ్డాడు. అడ్డువచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా నరికిచంపాడు. హైదరాబాద్ నగర శివారులోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దారుణ మారణకాండ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రక్తసిక్తమైన జయశ్రీ కాలనీ
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ పీఎస్ పరిధిలోని జయశ్రీ కాలనీలో నివాసముంటున్న కుటుంబంలో గత కొంతకాలంగా అంతర్గత కలహాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సదరు అల్లుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో కుటుంబసభ్యులపై ఒక్కసారిగా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్త నిరంజన్ బీ, బావమరిది భార్య రేష్మపై తీవ్రస్థాయిలో కత్తిపోట్లు పొడవడంతో వారు రక్తపు మడుగులో
అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఈ దాడిలో నిందితుడి భార్య, కుమార్తె సహా బావమరిది యూసుఫ్ తీవ్రంగా గాయపడ్డారు. యూసుఫ్ పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు.
ఉదయమే పీఎస్‌కు వెళ్లినా దక్కని రక్షణ.. పోలీసుల నిర్లక్ష్యంపై నిప్పులు!
ఈ దారుణ ఘటనకు పోలీసుల అలసత్వమే కారణమంటూ మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి నుంచి తమకు ప్రాణహాని ఉందని, గొడవ తీవ్రమవుతోందని బాధితులు బుధవారం ఉదయమే మీర్పేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ పోలీసులు సకాలంలో స్పందించలేదని, కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే నిందితుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని బాధితుల కుటుంబసభ్యులు రోదిస్తూ ఆరోపించారు.
ఘటనా స్థలంలో సీపీ, క్లూస్ టీమ్
సమాచారం అందుకున్న వెంటనే మీర్పేట్ పోలీసులు, ఉన్నతాధికారులు క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వేలిముద్రలు, రక్తపు నమూనాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ప్రశాంతంగా ఉండే జయశ్రీ కాలనీలో ఒక్కసారిగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు విషమ స్థితికి చేరడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

