NTV Telugu Site icon

Mavoists Violence: గూడ్స్ రైలుకి నిప్పు..ఆగిన రైళ్ళు

మావోయిస్టులు తమ ప్రతాపం చూపుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. గతంలో జేసీబీలు, రోడ్ల నిర్మాణం చేపట్టే యంత్రాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు తాజాగా గూడ్స్ రైలుని టార్గెట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు.

రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును మావోయిస్టులు అడ్డగించారు. సుమారు 20 మంది సాయుధ నక్సలైట్లు రంగంలోకి దిగి గూడ్స్ రైలును నిలిపివేశారని, ఇంజిన్‌కు నిప్పంటించారని స్థానికులు తెలిపారు. దీంతో కిరన్ డోల్ నుంచి విశాఖపట్నం మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ఎంత నష్టం వాటిల్లింది అనేది ఇంకా తెలియాల్సి వుంది.

గత ఏడాది చివరిలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సూరవీడు మాజీ సర్పంచ్‌ కొర్సా రమేష్‌ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ములుగు జిల్లాలో డిసెంబర్ 2021లో గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు.. వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నైట్ హాల్ట్ లో వున్న బస్సుకి నిప్పు పెట్టారు. ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మావోయిస్టులే ఈ పనిచేశారన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.